
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యాహక్కు చట్టంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠ శాలల జాబితాను ఏటా అధికారికంగా ప్రకటించాలని నిబంధనలున్నా, అవి అమలు కావడం లేదని పేర్కొంటూ సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ పిల్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టం–2009ని అమలు చేయకుండా 1994 నాటి చట్టాన్నే అమలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
పాఠశాలల రాబడిలో 50 శాతం జీతభత్యాలకు, 15 శాతం ఇతర ఖర్చులకు వినియోగించాలన్న నిబంధన అమలు కావడం లేదన్నారు. మహేంద్రహిల్స్‌లోని డీపీఎస్ పాఠశాలపై మెజిస్టీరియల్ విచారణ జరిపాక రూ.1.2 లక్షలున్న స్పోర్ట్స్ ఫీజు సగానికిపైగా తగ్గిందని తెలిపారు. పాఠశాలల ఖాతాల వివరాలు ప్రభుత్వం వద్ద లేవన్నారు. చట్ట ప్రకారం ఆ వివరాలన్నీ పాఠశాలలు డీఈవోలకు సమర్పించాలన్న నిబంధన అమలు కావడం లేదని, ఇందుకు హైదరాబాద్ డీఈవో కార్యాలయమే ఉదాహరణ అన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment