సాక్షి, హైదరాబాద్: అగ్నిప్రమాదాల నివారణకు తగిన ఏర్పాట్లు చేయనప్పుడు, చట్ట ప్రకారం తగిన అనుమతులు తీసుకోనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీకి ఎలా అనుమతిచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కూడా తిరిగి ఎగ్జిబిషన్ కొనసాగించేందుకు అనుమతివ్వడంలో ఔచిత్యమేంటని నిలదీసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్ చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ ఐజాజుద్దీన్ వాదనలు వినిపించారు. ఇటీవల ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరి గిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఏం చర్యలు తీసుకున్నారు?
అగ్నిప్రమాద నివారణకు తగిన ఏర్పాట్లు చేయనప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎలా అనుమతినిచ్చారని ప్రభుత్వా న్ని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. ఎగ్జిబిషన్ మూసివేతకు తాము ఆదేశాలు ఇవ్వబోమని, చట్ట ప్రకారం విధి విధానాలన్నీ పూర్తి చేయాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదాల నివారణకు, ప్రజల రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను బుధవారం నాటికి తమ ముందుంచాలని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ రేపటికల్లా ఎలా చేయగలమని ప్రశ్నించారు. దీనిపై ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందించింది. ఎలా చేయాలంటూ మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో చెప్పేందుకు తామిక్కడ లేమంటూ ఘాటుగా వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.
అలాంటప్పుడు అనుమతి ఎలా ఇచ్చారు?
Published Wed, Feb 20 2019 2:20 AM | Last Updated on Wed, Feb 20 2019 2:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment