సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పేందుకు పరిగెత్తడం కాదని, ఆ ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నప్పుడు సక్రమంగా విధులు నిర్వర్తించినట్లని హైకోర్టు వ్యాఖ్యానించింది. విపత్తుల నిర్వహణ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుంటే ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్ నుమాయిష్‌లో ఇటీవల అగ్నిప్రమాద ఘటనపై దాఖలైన వ్యాజ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది.
భవిష్యత్తులో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై తదుపరి విచారణ సమయంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఇజాజుద్దీన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ధర్మాసనం ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామన్నారు. పిటిషనర్ ఇజాజుద్దీన్ జోక్యం చేసుకుంటూ, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోకుండానే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా కేబినెట్ మంత్రి ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఉందా? అని ఆరా తీసింది. ఉందని, అది అగ్నిపమాక శాఖలో భాగమని శరత్ చెప్పగా, తాము అడుగుతున్నది విపత్తుల ప్రతిస్పందన విభాగం గురించి కాదని, దే శస్థాయిలో ఉన్న విపత్తుల నిర్వహణ సంస్థ గురించని, దీనికి రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ సంస్థకు పలు అధికారాలతో పాటు కీలక బాధ్యతలు కూడా ఉంటాయంది. ఇంతకీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ విస్తీర్ణం ఎంతని ధర్మాసనం ప్రశ్నించగా, 24 ఎకరాలని శరత్ చెప్పారు. ఈ మొత్తం భూమిలో హరితహారం కింద మొక్కలు నాటేస్తే అసలు ఏ ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు పీసీబీ తదితరులను ప్రతివాదులుగా చేరుస్తున్నామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో కార్యాచరణను నిర్ణయించి తగిన ఆదేశాలిస్తామంటూ విచారణను వాయిదా వేసింది.
మంటల వెనుక పరిగెత్తడం కాదు..
Published Thu, Feb 28 2019 3:19 AM | Last Updated on Thu, Feb 28 2019 3:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment