ఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా? | High Court Mandate to Authorities | Sakshi
Sakshi News home page

ఘటన జరిగిన తర్వాత స్పందిస్తారా?

Published Thu, Feb 21 2019 3:54 AM | Last Updated on Thu, Feb 21 2019 3:54 AM

High Court Mandate to Authorities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తులను ఎదుర్కొనే విషయంలో అధికారులు తగిన స్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో అధికారుల సమాధానం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని తేల్చిచెప్పింది. ఎగ్జిబిషన్‌ సందర్భంగా అక్కడికి వచ్చే సందర్శకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.. అగ్నిప్రమాదాల నివారణకు ఏం చేయబోతున్నారు.. విపత్తుల నిర్వహణ కింద ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని డీజీపీ, విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్‌ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. అందుబాటులో ఉన్న వివరాలతో ఈ మొత్తం వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేశామంటూ ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.శరత్‌కుమార్‌ దాన్ని ధర్మాసనం ముందుంచారు.  

జనాలకు చెబుతున్నారా? 
విస్తృత జన సమూహాలు వచ్చే ఎగ్జిబిషన్‌ వంటి నిర్వహణకు ఎన్‌ఓసీ అవసరమా?లేదా? అని ప్రశ్నించింది. అవసరమని శరత్‌ చెప్పగా.. మరి అఫిడవిట్‌లో ఎన్‌ఓసీ అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారని నిలదీసింది. చట్టం కావాలని చెబుతున్న దాన్ని అవసరం లేదని అధికారులు ఎలా చెబుతారంది. ‘ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగితే ఎగ్జిబిషన్‌ లోపలి నుంచి బయటకు వెళ్లేందుకు ఎన్ని మార్గాలున్నాయి.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. వాటి ద్వారా ఎలా బయటపడాలి.. తదితర ప్రాథమిక సమాచారాన్ని ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాలకు వివరించే ప్రయత్నం చేశారా? ఎక్కడైనా బయటకు వెళ్లే మార్గాల గురించి బోర్డులపై రాశారా? విమానం బయల్దేరిన వెంటనే ఎయిర్‌హోస్టెస్‌ ప్రతీసారి విమానంలో ఉండే ద్వారాల సమాచారాన్ని ప్రయాణికులకు చెబుతారు. ఎందుకు? అనుకోని ఘటన ఏదై నా జరిగితే వాటి ద్వారా బయటపడటం ప్ర యాణికులకు సులభమవుతుందని. ఎగ్జిబిషన్‌ విషయంలో ఇలా చేయొచ్చు. కానీ మీరు (అధికారులు) అలా చేయట్లేదంటే మీ విధులు, బాధ్యతలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నట్లే.’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. 

ఘటన తర్వాత స్పందిస్తారా.. 
ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లను మరిం త మెరుగుపరిచామని శరత్‌ చెప్పారు. వెంటనే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘మనదేశంలో ఇదే సమస్య. దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాతే మేల్కొంటారు. ప్రపంచమంతా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. మనం మాత్రం ఘటన జరిగాకనే స్పందిస్తాం. ఇలా జరిగాక స్పందిస్తే.. బతుకు దెరువు కోసం ఎగ్జిబిషన్‌లో దుకాణాలు ఏర్పాటు చేసిన వారి పరిస్థితేంటి? ఘటన వల్ల వారికి జరిగే నష్టాన్ని ఎవరు పూడ్చాలి?’అంటూ ప్రశ్నించింది. కోర్టు హాలులో ఉన్న అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారిని అడిగి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ విస్తీర్ణం, అందులో ఏర్పాటు చేసిన ఫైర్‌ ఇంజను,్ల ఇతరయంత్రాలు, బయటకెళ్లే గేట్లు, వాటి వెడల్పుఎగ్జిబిషన్‌కు ఎంత మంది సందర్శకులొస్తారు.. తదితర వివరాలను అడిగి తెలుసుకుంది. 24 ఎకరాల్లో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ ఉందని, ప్రస్తుతం 4 ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేశామని, బయటకెళ్లేందుకు 3 గేట్లు ఉన్నాయని, ఒక్కో గేటు మార్గం 18 అడుగులు ఉంటుందని, సాధారణ రోజుల్లో 30 వేలు, సెలవులు, వారాంతాల్లో 80 వేల వరకు జనం వస్తారని అధికారి వివంచారు. 

ఓ మోస్తరు పెళ్లి పందిరి వేయాలంటేనే ఎన్‌ఓసీ తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. అలాంటిది 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహణకు ఎన్‌ఓసీ తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎగ్జిబిషన్‌ నిర్వహణకు ఎన్‌ఓసీ అవసరమని చట్టం చెబుతోంది. మీరేమో (అధికారులు) ఎన్‌ఓసీ అవసరం లేదంటున్నారు. చట్టం అవసరమని చెబుతున్న దాన్ని అవసరం లేదని మీరెలా చెబుతారు? చట్ట నిబంధనలను తుంగలో తొక్కడం ద్వారా ఎగ్జిబిషన్‌కు వచ్చే జనాల భద్రతను తేలిగ్గా తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఇంత పెద్ద మైదానంలో ఎగ్జిబిషన్‌ జరుగుతుంటే.. భారీ సంఖ్యలో ప్రజలు వస్తుంటే.. మీరు ఏర్పాటు చేసేది నాలుగే ఫైర్‌ ఇంజన్లా! దీనిపై నిలదీస్తే మొన్న జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత ఫైర్‌ ఇంజన్ల సంఖ్యను పెంచామంటారు. మన దేశంలో ఇదే సమస్య. ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాతే మేల్కొంటాం. దుర్ఘటన జరగక ముందే చర్యలు తీసుకోవడం అన్నది ఉండనే ఉండదు. 
– జస్టిస్‌ రాఘవేంద్ర చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం 

నాలుగే ఫైర్‌ ఇంజన్లా! 
24 ఎకరాల్లో ఉన్న గ్రౌండ్‌లో 4 ఫైరింజన్లనే ఏర్పాటు చేయడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ సమయంలో పిటిషనర్‌ ఖాజా ఐజాజుద్దీన్‌ స్పందిస్తూ.. ఎగ్జి బిషన్‌ మూసివేతకు ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. మూసివేత వల్ల పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి దుకాణాలు పెట్టుకున్న చిరు వ్యాపారులు నష్టపోతారని, వారి వాదనలు వినకుండానే ఎగ్జిబిషన్‌ మూసివేతకు ఆదేశాలివ్వమంటారా అంటూ పిటిషనర్‌ను నిలదీసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement