onteru prathap reddy
-
వంటేరు, వాసుదేవరెడ్డికి మళ్లీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్ల నియామక ప్రక్రియ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పదవీ కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్న వాసుదేవరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలాన్ని కూడా మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలం అక్టోబర్‌లో ముగిసింది. వాసుదేవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిల పదవీ కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్ నేతల సంఖ్య పదికి చేరింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ (మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), మన్నె క్రిషాంక్ (టీఎస్ఎండీసీ), సాయిచంద్ (వేర్ హౌజింగ్ కార్పొరేషన్), పాటిమీది జగన్ (టీఎస్టీఎస్), గజ్జెల నగేశ్ (బీవరేజెస్ కార్పొరేషన్), దూదిమెట్ల బాలరాజు యాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), ఆకుల లలిత (మహిళా ఆర్థిక సంస్థ), జూలూరు గౌరిశంకర్ (సాహిత్య అకాడమీ) చైర్మన్లుగా నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పదవులు రానివారిపై దృష్టి.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, ఉద్యమ సమయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల్లో చురుగ్గా పనిచేసిన వారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరినా పదవులు పొందని వారిని గుర్తించి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారు. సుమారు 50 వరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, పాలక మండళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం కావడంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో పాటు తమ జిల్లాలకు చెందిన మంత్రుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై నిందలా?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై నిందారోపణలకు దిగుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో గజ్వేల్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. పార్టీలోకి వస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డికి స్వాగతం పలికారు. తాము ప్రతాపరెడ్డిని 2009లోనే పార్టీలో చేరాలని కోరామని, కొన్ని కారణాలతో ఆయన చేరలేకపోయారని గుర్తుచేసుకున్నారు. 2009–19 వరకు రకరకాల పోరాటాలు చేసి ఇప్పుడు ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. గజ్వేల్‌లో ఎవరు అడగకపోయినా.. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి... ఇప్పు డు ప్రతాపరెడ్డి చేరికతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 40 నుంచి 50 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పడ్డాయని తెలిపారు. తెలం గాణలో ఆశించినంత వేగంగా అభివృద్ధి పనులు జరగాలంటే.. కేంద్రాన్ని శాసించాల్సిన స్థాయికి పార్టీ ఎదగాల్సిన అవసరముందని అన్నారు. మాకు బీజేపీతో ఏం సంబంధం? చంద్రబాబు అభాండాలకు దిగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘మాకు– బీజేపీకి ఏం సంబం«ధం? బీజేపీ బిల్డప్‌పార్టీ. మోదీది పైన పటారం లోన లొటారం. తెలంగాణలో 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ రాకుండా, చిత్తుచిత్తుగా ఓడించింది మా పార్టీ కాదా? చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏపీపై గద్దల్లా వాలారంటూ కేసీఆర్, ప్రధానిలను బూచిగా చూపిస్తున్నాడు. సోనియాను ఇటలీ మాఫియాగా అభివర్ణించిన బాబు ఇపుడు అదే పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? ఆంధ్ర ప్రజలకు మాది ఒకటే విజ్ఞప్తి. ఏపీ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. తెలంగాణలోని సెటిలర్లు అంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు జైకొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రెంటికీ మేజిక్ ఫిగర్ వచ్చే అవకాశాల్లేవు. ప్రాంతీయ పార్టీలన్నీ నిర్ణయాత్మక పాత్ర పోషిం చాలి. ఈ విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా మా ఆలోచనతో ఏకీభవించారు’అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను కలిసిన ఒంటేరు.. టీఆర్ఎస్లో చేరిన అనంతరం ఒంటేరు మర్యాదపూర్వకంగా సీఎంను ప్రగతి భవన్లో కలిశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఒంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రతాపరెడ్డికి కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ఏపనిఅప్పగించినా చేస్తా: ఒంటేరు అనంతరం ఒంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. ‘వాస్తవానికి 2009, 14, 18లో నన్ను టీఆర్ఎస్లో చేరమని అడిగినా నేను చేరలేదు. కేసీఆర్ సంక్షేమ పథకాలు పేదలకు చేరాయి. మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు మధ్యలో బ్రోకర్లకు కాకుండా ప్రజలకు అందాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను విజయతీరాలకు చేర్చాయి. మల్లన్నసాగర్, వేములఘాట్ నిర్వాసితులే టీఆర్ఎస్ను గెలిపించారు. దీంతో నేను చేసిన ఉద్యమమే తప్పని ఒప్పుకుంటున్నా.. కేసీఆర్ నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినా పనిచేస్తా’అని స్పష్టం చేశారు. -
‘బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించింది మేమే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అశించినంత వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రాన్ని కూడా శాసించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీగా మారిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ కీలక నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒంటేరు చేరికతో టీఆర్ఎస్ మరింత బలంగా మారిందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసినా కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు నిర్ణయాత్మక పాత్ర పోషించాలని, ఆంధ్రాప్రాంతం అభివృద్ధికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. గతంలో సోనియా గాంధీని ఇటలీ మాఫీయా అన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తుపెట్టుకున్నారని పేర్కొన్నారు. బీజేపీకీ తమకు ఏదో సంబంధం ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని, బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించింది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తుచేశారు. -
కారెక్కిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గజ్వేల్‌కు చెందిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ప్రతాప్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్‌ల ఆహ్వానం మేరకు పార్టీలో చేరుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరమని 2009 నుంచి వివిధ సందర్భాల్లో కేటీఆర్ తనను కోరారనీ, ఆయన ఆహ్వానంతో ఇప్పుడు పార్టీలోకి వస్తున్నట్లు ఒంటేరు వెల్లడించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లోకి వెళ్లాయని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారని ఒంటేరు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ పక్షానే ఉన్నారని, ఇలాంటప్పుడు కేసీఆర్‌పై తాను పోరాటం చేయడంలో అర్థంలేదన్నారు. తనకు ఏ బాధ్యతలు అప్పగించినా పార్టీ కోసం తీవ్రంగా కష్టపడతానని ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌కు బలమైన నేతగా ఉన్న ప్రతాప్‌రెడ్డి 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా సీఎం కేసీఆర్‌పై పోటీచేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
గులాబీ గూటికి ఒంటేరు..!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. గులాబీ గూటికి చేరుతున్నారనే వార్త ఉమ్మడి మెదక్ జిల్లాలో సంచలనంగా మారింది. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తన ముఖ్య అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కార్యనిర్వాహ క అధ్యక్షుడు కేటీఆర్‌తో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిసింది. దీంతో శుక్రవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఒంటేరు చేరికతో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తు న్న గజ్వేల్ నియోజకవర్గంలో గులాబీ సేనకు ఎదురే ఉండదని నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ భవిష్యత్‌పై చర్చ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి గట్టి పోటీనిచ్చి, గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్‌పై 15వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంటేరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఐదేళ్లపాటు ఆయన కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచీ ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌కు దీటుగా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు వేసిన ఎత్తుగడ కూడా ఫలించింది. అయినా ఒంటేరుకు కేసీఆర్ చేతిలో ఓటమి తప్పలేదు. పరాజయంపాలైనా.. నిత్యం కేడర్‌తో టచ్‌లో ఉంటూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ గజ్వేల్ నియోజకవర్గంలో తమ కేడర్‌ను బరిలో నిలిపారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఎదురు ఉండకూడదంటే.. ఒంటేరును పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో గులాబీ నేతలు పావులు కదిపారు. ఇందులో భాగంగానే కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి ఒంటేరుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఒంటేరుకు గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు అంగీకరించినట్లు తెలిసింది. దీంతోపాటుగా ప్రతాప్‌రెడ్డి కుమారునికి కూడా మంచి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం మేరకు శుక్రవారం ఒంటేరు ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలుస్తారు. అనంతరం తెలం గాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్లో చేరాల్సిన ఆవశ్యకతను కేడర్‌కు వివరించి వారిని కూడా టీఆర్ఎస్లో చేర్పిస్తారని సమాచారం. -
కేసీఆర్‌పై పోటీ చేస్తే కేసులా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు తనను, తన అనుచరులను కేసులతో వేధిస్తున్నారని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. అసలు వీరు పోలీస్ డిపార్ట్‌మెంటా.. లేక కల్వకుంట్ల డిపార్ట్‌మెంటా అని ప్రశ్నించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు డిపాజిట్లు రావన్న భయంతోనే అన్ని రకాల అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న గజ్వేల్‌కు చెందిన ఓయూ విద్యార్థి మురళి శవయాత్రలో పాల్గొన్నందుకు తనపై నాలుగు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితోపాటు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పక్షాన పోరాడినందుకు, ఎస్సైలు రామక్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఇప్పటివరకు తనపై 23 కేసులు పెట్టారని వాపోయారు. ఈసీ, పోలీసుల్లో చలనం లేదు కేసీఆర్ ఎక్కడ ఓడిపోతారన్న భయంతోనే మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌లో 45 రోజులుగా టెంట్లు వేసుకుని మరీ ప్రలోభాలకు తెరలేపారని వంటేరు ఆరోపించారు. నగదు, మద్యం ఏరులై పారుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సాక్ష్యాధారాలు సమర్పించినా ఈసీ, పోలీసుల్లో చలనం లేదని ఆవేదన చెందారు. ఈసీ, పోలీసులు పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోదాల పేరుతో పోలీసులు ఇష్టానుసారంగా తన, తన అనుచరుల ఇళ్లపై దాడులు చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని వేధిస్తున్నారని, తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాపోయారు. తప్పుడు కేసులు సరికాదు: ఉత్తమ్ వంటేరుపై కేసులు, పోలీసుల వైఖరి విషయంలో డీజీపీ, ఎన్నికల సంఘం సరిగా వ్యవహరించడం లేదని ఉత్తమ్ మండిపడ్డారు. గజ్వేల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతాప్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి వేధించడం సరికాదని హితవు పలికారు. ఆయన ఇంటిపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు పక్షపాతంగా వ్యవహరించే అధికారులు భవిష్యత్‌లో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
నా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించేందుకు తన ఫోన్లను పోలీసు శాఖ ట్యాపింగ్ చేస్తోందని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు, ఎన్నికల అధికారుల్లో మార్పు రావాలని, లేని పక్షంలో గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ప్రతిక్షణం తన వెంట సివిల్ పోలీసులను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కరినీ కేసీఆర్ పరామర్శించలేదని, ఆర్థిక సహాయం అందించలేదని అన్నారు. మసాయిపేట రైలు ప్రమాద మృతులను, క్షతగాత్రులను సైతం పరామర్శించలేదన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తనపై 27 కేసులు పెట్టారని, హరీశ్‌రావు గల్లీ లీడర్లా అందర్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్‌లో టీఆర్ఎస్ గెలుపుకోసం ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో డబ్బులున్నాయని, అయినా అక్కడ తనిఖీలు జరపడం లేదన్నారు. అక్కడ పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు 337 ఎకరాలు ఉంటే ఎన్నికల అఫిడవిట్లో కేవలం 57 ఎకరాలే ఉన్నట్లు పేర్కొన్నారని, మిగిలిన భూమి ఎవరిదో? విచారణ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. వంటేరు నివాసంలో సోదాలు వంటేరు ప్రతాపరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే, అక్కడ ఎటువంటి నగదు లభించకపోవడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటిని ఎలా తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. విషయం తెలిసిన వంటేరు అభిమానులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్ కుమార్‌కు గురువారం టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్ఎస్ నేతలు గట్టు రాంచంద్రారావు, ఉపేందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడితే హరీశ్ సీఎం అవుతారని రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు ముఖ్యమంత్రి నుంచి విముక్తి కల్పించాలని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఓడించాలని హరీశ్‌రావు తనకు ఫోన్ చేసినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి నిరాధారంగా ఆరోపణలు చేశారని తప్పుబట్టారు. నర్సాపూర్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సీఎం పదవిని గౌరవించకుండా మీడియాలో ప్రచురించలేని బూతులు మాట్లాడారని ఆరోపించారు. -
ఆధారాలుంటే బయటపెట్టాలి లేదంటే క్షమాపణ చెప్పాలి
గజ్వేల్: కాంగ్రెస్‌లో చేరడానికి తాను రాహుల్ గాంధీ తో టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి ప్రతాప్‌రెడ్డి వద్ద ఏమైనా ఆధారాలుంటే బయట పెట్టాలని, లేనిపక్షంలో భేషరతుగా క్షమాపణ చెప్పా లని మంత్రి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో, ప్రతాప్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రచారానికి అద్భుతమైన స్పందన రావడంతో ఓటమి భయంతో ప్రతాప్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి న కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఏం ఒరగబెట్టలేదనే విషయం కూడా ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. తాను గజ్వేల్ నియోజకవర్గంలో ఉండి ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని, మూడోసారి హ్యాట్రిక్ ఓటమికి దరిదాపుల్లో ఉన్నానని గ్రహించిన ప్రతాప్‌రెడ్డి ఇలాంటి ఆరోపణలకు దిగారని హరీశ్ ధ్వజమెత్తారు. ఈసారి ఓడిపోతే తన రాజకీయ జీవితం పరిసమాప్తమవుతుందనే ఆందోళనలో ప్రతాప్‌రెడ్డి ఉన్నారన్నారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత ‘నీ బతుకేందో ప్రజలు తేలుస్తారు’ అని ప్రతాప్‌రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తానేందో.. తన వ్యక్తి త్వమేందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని, అదే విశ్వసనీయతతో పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ తాను ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయగలిగానని పేర్కొన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమికి.. మహా ఓటమి తప్పదని గుర్తించి చంద్రబాబు, కాంగ్రెస్ నేతల డైరెక్షన్లో గోబెల్స్ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. రాహుల్ కాంగ్రెస్ పార్టీకి ఐరెన్ లెగ్ లాంటివాడని, ఆయన ఎక్కడ పాదం మోపినా అక్కడ పరాజయమేనని, అలాంటి పార్టీలోకి తాను ఎలా వెళ్తానని ప్రశ్నించారు. ఇప్పటికే వందల సార్లు తాను ప్రకటించానని.. తన పుట్టుక, చావు టీఆర్ఎస్లోనేనని పునరుద్ఘాటించారు. గజ్వేల్‌లో చిల్లర రాజకీయాలతో ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రతాప్‌రెడ్డి వైఖరిని సహించబోనన్నారు. ఇక్కడే తిష్టవేసి ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయడం ద్వారా రాజకీయంగా ఆయన అంతుచూస్తానని హెచ్చరించారు. ప్రతాప్ అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే క్రమంలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
మామను ఓడించమని హరీశ్ ఫోన్ చేశారు
గజ్వేల్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారని, టీఆర్ఎస్లో ఆయనకు సముచిత గుర్తింపు లేదని.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడుతున్నారని, అంతేకాకుండా మామ కేసీఆర్‌ను ఓడించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నరాత్రి హరీశ్‌రావు నాకు అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసిండు.. నువ్వేమన్నా కష్టపడు, మా మామ కేసీఆర్‌ను ఓడించు.. కావాలంటే ఆర్థికంగా సాయం జేస్తా... మా మామ ఉంటే నా రాజకీయ జీవితం ఉండదు. అన్నీ కేటీఆర్‌కు అప్పజెప్తుండు. పార్టీలో నా ఇజ్జత్ తీస్తుండు’అంటూ చెప్పారని పేర్కొన్నారు. ‘పద్నాలుగేండ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. గ్లాసులు కడిగినా.. చివరకు నాకు గుర్తింపు లేదు..’అంటూ వాపోయారని అన్నారు. ‘నేను కూడా నీవెంటే వస్తా’అంటూ భరోసా ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని ఎక్కడంటే.. అక్కడ ప్రమాణం చేసి చెప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే మీ అవినీతి సొమ్ము నాకొద్దంటూ తిరస్కరించానని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాదనే విషయం గుర్తించి, పార్టీ మారడానికి హరీశ్‌రావు సిద్ధపడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తన వర్గం ఎమ్మెల్యేలతో వస్తానని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హరీశ్‌రావు, రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌కే సాధ్యమని.. ఈ పార్టీలోకి ఎవరు వచ్చినా అంతా స్వాగతిస్తారని పేర్కొన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నేతలు కుల సంఘాలతో మీటింగ్‌లు ఎందుకు పెడుతున్నారని ఒంటేరు ప్రశ్నించారు. కులాలను తెరమీదికి తెచ్చి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 25 వేల మంది యువత ఉద్యోగావకాశాలు లేక ఆందోళన చెందుతున్నారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ కనీసం 10 వేల మందికైనా ఉపాధి చూపించలేకపోయారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. గజ్వేల్‌ను అడ్డాగా మలచుకొని స్థానికేతర టీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడున్న రెడ్డి నాయకులకు సమర్థత లేదా? అంటూ ప్రశ్నించారు.టీఆర్ఎస్ వైఖరిని ప్రజల్లో ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పారు. తాను గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ విధానాలపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూడటం ఖాయమని అన్నారు. -
చంద్రబాబును కలసిన ఒంటేరు, బండ్ల గణేశ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, బండ్ల గణేశ్ శనివారం ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తూంకుంట నర్సారెడ్డి, రాములు నాయక్ శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఒంటేరు ఢిల్లీ వచ్చారు. ఏపీ భవన్లో బస చేసిన చంద్రబాబును ఒంటేరు గణేశ్‌తో వచ్చి కలిశారు. తెలంగాణలో ఏపీ పోలీసులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న ప్రచారం ఊపందుకోవడం, పలుచోట్ల ఆ తరహా ఘటనలు బహిర్గతమైన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఒంటేరుకు కాంగ్రెస్ టికెట్ ఖరారైనట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతుండటంతో ఈసారి ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించేందుకు బాబు ఆశీస్సులు తీసుకున్నట్లు సమాచారం. చంద్రబాబుతో సమావే శం అనంతరం బయటకొచ్చిన ఒంటేరు, బండ్ల ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ ఎంపీలతో కాసేపు ముచ్చటించారు. -
గజ్వేల్‌లో గద్దర్.. ప్రతాప్ పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. కేసీఆర్‌పై పోటీకి మొదటి నుంచీ టికెట్ ఆశిస్తున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి అవకాశం లభిస్తుందా.. స్వతంత్ర అభ్యర్థిగా గద్దర్ నిల్చుంటే ఆయనకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అనే గజిబిజి నెలకొంది. బుల్లెట్ పోరు నుంచి అనూహ్యంగా బ్యాలెట్ పోరు బాట పట్టిన ప్రజాయుద్ధ నౌక గద్దర్.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం, అన్ని పార్టీలు అంగీకరిస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించడంతో ఇప్పుడు గజ్వేల్‌లో చర్చంతా గద్దర్ చుట్టే తిరుగుతోంది. చాలాకాలంగా టీడీపీలో ఉండి, కాంగ్రెస్‌లోకి వచ్చాక కేసీఆర్‌పై ఒంటరి పోరు చేస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డి మళ్లీ తన అదృష్టాన్ని గజ్వేల్ నుంచే పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతుండటం, ఆయనకు టీపీసీసీ ముఖ్యుల మద్దతు కూడా ఉండటంఆసక్తి రేకెత్తిస్తోంది. గద్దర్‌కు తొలిసారి ఓటు హక్కు గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీగా మహాకూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను దింపుతారనే చర్చ రెండు నెలలుగా చర్చ జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే గద్దర్ కూడా తన జీవితంలో తొలిసారి ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. స్వయంగా ఎన్నికల కమిషనర్‌ను కలసి వచ్చారు. గద్దర్ పోటీకి అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఆయన కూడా అక్కడక్కడా పోటీ అంశాన్ని ప్రస్తావిస్తున్నా కాంగ్రెస్ కేడర్ అంతగా పట్టించుకోలేదు. వాస్తవానికి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కూడా చాలా కాలంగా గద్దర్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇప్పటికే మూడు నాలుగుసార్లు సమావేశమై కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించాలని కోరారు. అయితే ఈనెల 12న ఉన్నట్టుండి గద్దర్ తన కుటుంబం సహా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్‌తో కలసి రాహుల్ నివాసానికి వెళ్లారు. ఆయన కుమారుడు సూర్యకిరణ్ గతంలోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ కార్యాలయంలో ముఖ్యుడైన కొప్పుల రాజుతో పాటు రాహుల్‌కు అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ కూడా గద్దర్ కుటుంబసభ్యులతో ఉన్నారు. వీరంతా రాహుల్‌తో పాటు సోనియాను కూడా కలిశారు. తనను కలిసిన సందర్భంగా కాంగ్రెస్‌లో చేరి గజ్వేల్ నుంచి పోటీ చేయాలని రాహుల్ కోరారని, ఇందుకు తాను సమ్మతించలేదని, ఏ పార్టీలో చేరబోనని, అందరూ ఓకే అంటే స్వతంత్రంగా గజ్వేల్ నుంచి బరిలో ఉంటానని రాహుల్‌కు చెప్పానని గద్దర్ వెల్లడించారు. ప్రతాప్ పరిస్థితేంటి? తెలుగు రైతు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కూడా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉండేందుకు తహతహలాడుతున్నారు. గత ఎన్నికలలో కేసీఆర్‌పై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి 67వేలకు పైగా ఓట్లు సాధించిన ఒంటేరు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే గత ఎన్నికల్లో ఓడిపోయినా వెనక్కు తగ్గకుండా కేసీఆర్, టీఆర్ఎస్పై పోరాట పంథాలోనే వెళ్తున్నారు. ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిల మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలో దాదాపు తనకు మళ్లీ కేసీఆర్‌పై పోటీచేసే అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే గద్దర్ ఎపిసోడ్‌తో ఆయన, ఆయన అనుచరులు డోలాయమానంలో పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి గజ్వేల్‌లో కాంగ్రెస్ పోటీచేస్తే ప్రతాప్‌రెడ్డి అభ్యర్థి అవుతారని, స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వాల్సి వస్తే గద్దర్ బరిలో ఉంటారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
‘కేసీఆర్.. మహంకాళి గుడికి రా.. ఒట్టేసుకుందాం’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనని సికింద్రబాద్ మహంకాళి అమ్మవారిపై ఒట్టు వేసుకొని ప్రజల్లోకి వెళ్దామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత ఒంటెరు ప్రతాప్ రెడ్డి సవాల్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇంటింటికి నల్లా ఇవ్వనిదే ఓటు అడగనన్న కేసీఆర్ ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఎన్నికలకు పోతున్నాడని విమర్శించారు. కేసీఆర్‌కు చీము నెత్తురు ఉంటే మాట మీద నిలబడి ఎన్నికలకు దూరంగా ఉండాలన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణ వచ్చి ఉండకపోతే కేసీఆర్ గజ్వెల్లో ఎమ్మెల్యేగా కూడా గెలిచేవాడు కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, అవినీతి మీద ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. 2001లో కేసీఆర్, హరీశ్‌రావుల ఆస్తులు ఎంతో.. ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బ్రోకరిజం పుట్టిందే కేసీఆర్ ఇంట్లోనని, ఆయన ఒక గల్ఫ్ ఏజెంట్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి బయటపెడతామని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. -
వాళ్ల చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతం
ఢిల్లీ: గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృద్వీరాజ్ సహా సుమారు 60 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...ఇలాంటి బలమైన నాయకుల చేరికతో పార్టీ క్రమక్రమంగా మరింత బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. 2019లో గెలిచే దిశగా కాంగ్రెస్ పయనం చేస్తోందన్నారు. ప్రతాప్ రెడ్డిని అధికార టీఆర్ఎస్ పార్టీ జైలులో పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నారని అన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ..కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం లేదని తెలిపారు. ఏడాది నుంచి సెక్రటేరియట్‌కు రాని వ్యక్తి పాలన ఏం చేస్తాడని ప్రశ్నించారు. హామీల అమలులో పూర్తిగా విఫలమైన కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ గూటికి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి!
సాక్షి, సిద్దిపేట : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి.. ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధంలో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు దాదాపు ఖరారైంది. ఈ మేరకు బుధవారం సిద్దిపేట జిల్లా గౌరారంలోని ఓ రిసార్టులో కాంగ్రెస్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో ప్రతాప్‌రెడ్డి చర్చలు జరిపారు. ఈ నెల 21న ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. టీడీపీకి రాజీనామా చేసిన ఒంటేరు.. వారంరోజులుగా ఏ పార్టీలో చేరకుండా సందిగ్ధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారా? లేక కోదండరామ్ పార్టీలో చేరతారా? వీటిని కాదని టీఆర్ఎస్ గూటికి చేరతారా? అనేది సర్వత్రా చర్చగా మారింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న నాయకులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. ఇటీవల పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మిగతా నాయకులు ఆయనతో ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా బుధవారం గౌరారంలోని ఓ రిసార్టులో వీరంతా భేటీ అయ్యారు. అక్కడి నుంచి పీసీసీ చీఫ్‌తో ఫోనులో మాట్లాడారు. ఆయన పార్టీలో చేరితే లాభనష్టాలు, ఇచ్చే ప్రాధాన్యం తదితర అంశాలను చర్చించారు. ఈ మేరకు పీసీసీ చీఫ్‌తో హామీ కూడా తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా ఈ నెల 21న ఢిల్లీలో రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని ఆయన సమక్షంలో ‘ఒంటేరు’ తమ అనుచరులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఒంటేరు చేరికపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్
ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శ సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్ఎస్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని టీటీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ అరాచకాలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను కూడా పోలింగ్ స్టేషన్లకు రాకుండా అడ్డుకున్నారని, టీఆర్ఎస్కు ఓటేయకపోతే పింఛన్లు, రేషన్‌కార్డులు రద్దు చేస్తామని మంత్రి హరీశ్‌రావు బెదిరించారన్నారు.