అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై నిందలా? | Onteru Pratap Reddy To Join TRS | Sakshi
Sakshi News home page

అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై నిందలా?

Published Sat, Jan 19 2019 3:27 AM | Last Updated on Sat, Jan 19 2019 3:27 AM

 Onteru Pratap Reddy To Join TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై నిందారోపణలకు దిగుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో గజ్వేల్‌ కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. పార్టీలోకి వస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డికి స్వాగతం పలికారు. తాము ప్రతాపరెడ్డిని 2009లోనే పార్టీలో చేరాలని కోరామని, కొన్ని కారణాలతో ఆయన చేరలేకపోయారని గుర్తుచేసుకున్నారు.

2009–19 వరకు రకరకాల పోరాటాలు చేసి ఇప్పుడు ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. గజ్వేల్‌లో ఎవరు అడగకపోయినా.. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి... ఇప్పు డు ప్రతాపరెడ్డి చేరికతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 40 నుంచి 50 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడ్డాయని తెలిపారు. తెలం గాణలో ఆశించినంత వేగంగా అభివృద్ధి పనులు జరగాలంటే.. కేంద్రాన్ని శాసించాల్సిన స్థాయికి పార్టీ ఎదగాల్సిన అవసరముందని అన్నారు.

మాకు బీజేపీతో ఏం సంబంధం?
చంద్రబాబు  అభాండాలకు దిగుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘మాకు– బీజేపీకి ఏం సంబం«ధం? బీజేపీ బిల్డప్‌పార్టీ. మోదీది పైన పటారం లోన లొటారం. తెలంగాణలో 103 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్‌ రాకుండా, చిత్తుచిత్తుగా ఓడించింది మా పార్టీ కాదా? చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏపీపై గద్దల్లా వాలారంటూ కేసీఆర్, ప్రధానిలను బూచిగా చూపిస్తున్నాడు.

సోనియాను ఇటలీ మాఫియాగా అభివర్ణించిన బాబు ఇపుడు అదే పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? ఆంధ్ర ప్రజలకు మాది ఒకటే విజ్ఞప్తి. ఏపీ అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు. తెలంగాణలోని సెటిలర్లు అంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు జైకొట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రెంటికీ మేజిక్‌ ఫిగర్‌ వచ్చే అవకాశాల్లేవు. ప్రాంతీయ పార్టీలన్నీ నిర్ణయాత్మక పాత్ర పోషిం చాలి. ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ కూడా మా ఆలోచనతో ఏకీభవించారు’అని కేటీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌ను కలిసిన ఒంటేరు..
టీఆర్‌ఎస్‌లో చేరిన అనంతరం ఒంటేరు మర్యాదపూర్వకంగా  సీఎంను ప్రగతి భవన్‌లో కలిశారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి ఒంటేరు ప్రతాపరెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ప్రతాపరెడ్డికి కేసీఆర్‌ సూచించారు.

కేసీఆర్‌ ఏపనిఅప్పగించినా చేస్తా: ఒంటేరు
అనంతరం ఒంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. ‘వాస్తవానికి 2009, 14, 18లో నన్ను టీఆర్‌ఎస్‌లో చేరమని అడిగినా నేను చేరలేదు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలు పేదలకు చేరాయి. మిషన్‌ భగీరథ, రైతు బంధు పథకాలు మధ్యలో బ్రోకర్లకు కాకుండా ప్రజలకు అందాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను విజయతీరాలకు చేర్చాయి. మల్లన్నసాగర్, వేములఘాట్‌ నిర్వాసితులే టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. దీంతో నేను చేసిన ఉద్యమమే తప్పని ఒప్పుకుంటున్నా.. కేసీఆర్‌ నాకు ఎలాంటి బాధ్యత అప్పగించినా పనిచేస్తా’అని స్పష్టం చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement