సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్ల నియామక ప్రక్రియ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పదవీ కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్న వాసుదేవరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలాన్ని కూడా మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలం అక్టోబర్‌లో ముగిసింది. వాసుదేవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిల పదవీ కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న టీఆర్‌ఎస్ నేతల సంఖ్య పదికి చేరింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ (మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), మన్నె క్రిషాంక్ (టీఎస్‌ఎండీసీ), సాయిచంద్ (వేర్ హౌజింగ్ కార్పొరేషన్), పాటిమీది జగన్ (టీఎస్‌టీఎస్), గజ్జెల నగేశ్ (బీవరేజెస్ కార్పొరేషన్), దూదిమెట్ల బాలరాజు యాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), ఆకుల లలిత (మహిళా ఆర్థిక సంస్థ), జూలూరు గౌరిశంకర్ (సాహిత్య అకాడమీ) చైర్మన్లుగా నియమితులైన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు పదవులు రానివారిపై దృష్టి..
పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, ఉద్యమ సమయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల్లో చురుగ్గా పనిచేసిన వారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినా పదవులు పొందని వారిని గుర్తించి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారు. సుమారు 50 వరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, పాలక మండళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం కావడంతో పదవులు ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో పాటు తమ జిల్లాలకు చెందిన మంత్రుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment