nominated posts in telangana
-
నెలాఖరులోగా ‘నామినేటెడ్’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు మరోసారి పదవుల పందేరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఇంతకుముందు 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. ఈసారి మరో 25కుపైగా పోస్టులను నింపే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియాల పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక..ఢిల్లీ వెళ్లి ఈ విషయంపై అధిష్టానంతో చర్చలుజరపనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని.. ఈ నెలాఖరులోపే నామినేటెడ్ పదవుల జాబితా వెలువడుతుందని వెల్లడిస్తున్నాయి. పదవుల కోసం ఎదురుచూపులు ఎన్నో.. తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటుదక్కని చాలా మంది మలి జాబితా కోసం ఎదు రుచూస్తున్నారు. చాలా కాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్నవారు, విద్యార్థి నాయకులు, అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్నవారు, మహిళా నేతలతోపాటు కొందరు సీనియర్లు కూడా పదవులు ఆశిస్తున్నారు. నెల రోజుల క్రితమే రెండో దఫా పదవుల పందేరం ఉంటుందనే చర్చ జరిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతోందని, వీలైనంత త్వరగా పదవులు ఇవ్వాలని ఆశావహులు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేలకు కూడా! రెండో రౌండ్ నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది. ఆర్టీసీ, సివిల్ సప్లైస్, మూసీ రివర్‌ఫ్రంట్ వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కనివారికి చైర్మన్ పదవులతోపాటు కేబినెట్ హోదా కల్పిస్తారని సమాచారం. ఇక బేవరేజెస్ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్ తదితర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగించనున్నట్టు తెలిసింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను ప్రకటించగా.. మిగతా కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయకత్వంపై ఒత్తిడులు వస్తున్నాయి. -
‘కోడ్’ పోగానే పందేరం!
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ మరోమారు నామినేటెడ్ పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందు 37 మంది పార్టీ నేతలను పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో 17 మందికి చాన్స్ ఇవ్వనున్నట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. తొలిదఫాలో అవకాశం దక్కిన 37 మంది, ఈ 17 మంది కలిపి.. ఒకేసారి పదవీబాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మలి దఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం. ఎవరెవరికన్న దానిపై కాస్త స్పష్టత తొలిదఫా నామినేటెడ్ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు. రెండో దఫాలో కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలి దఫాలో పీసీసీ అనుబంధ విభాగాల్లో.. చేనేత, ఎక్స్ సరీ్వస్‌మన్, సేవాదళ్‌లకు అవకాశం రాలేదు. దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని సమాచారం. వారితోపాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షులు, మరో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో చాన్స్ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైనవారికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు రాగా.. రెండో దఫాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. జూన్ 6వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగియనుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేటెడ్ జాబితా విడుదల, అందరి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతు, విద్యా కమిషన్లు కూడా.. వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్ ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి. రెండో దఫా నామినేటెడ్ జాబితాతోపాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి. రైతు కమిషన్ చైర్మన్‌గా ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిలను నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. వ్యవసాయ, విద్యా శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ.. కీలక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ఆ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్తున్నారు. పోటీ చేసి ఓడినవారికి లేనట్టే! గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి మలి దఫా నామినేటెడ్ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్‌రెడ్డి.. ఎన్ని విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చినా తొలిదఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలేదు. ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా మాత్రమే కొనసాగుతారని, ఎలాంటి నామినేటెడ్ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. -
ఎవరెవరికి... ఏమేమిద్దాం!
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల పందేరంపై అధికార కాంగ్రెస్ పార్టీలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఈ పదవులను త్వరలో భర్తీ చేస్తామని ఇటీవల గాందీభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన తర్వాత ఈ చర్చ ఉధృతమైంది. భర్తీ త్వరలోనే ఉంటుందని చెప్పిన సీఎం ఎప్పుడన్న దానిపై స్పష్టం చేయకపోవడంతో అసలు ఈ పోస్టుల ప్రకటన ఎప్పుడు ఉంటుంది? తొలిదఫాలో ఎన్ని కార్పొరేషన్లు భర్తీ చేస్తారు? అందులో కీలకమైన కార్పొరేషన్లు ఎన్ని ఉంటాయి? ఆ కీలక కార్పొరేషన్లే కాకుండా నామినేటెడ్ హోదాలు ఎవరెవరికి దక్కుతాయన్నది ఇప్పుడు గాందీభవన్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటుండటం గమనార్హం. ఇక, సంక్రాంతికి ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కానీ, సంక్రాంతికి ముందే ఉంటుందా? లేక సంక్రాంతి తర్వాత ఉంటుందా అన్న దానిపై కూడా స్పష్టత రావడం లేదు. అటు ఎమ్మెల్యే కోటా, ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వాయిదా పడుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లోగా ఖాయం అయితే, లోక్‌సభ ఎన్నికల్లోపు మాత్రం ఖచ్చితంగా నామినేటెడ్ భర్తీ ఉంటుందనే చర్చ జరుగుతుండగా, సంక్రాంతిలోపు భర్తీ చేస్తే మాత్రం తొలి దఫాలో కేవలం 10 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులే నింపుతారని, అదే జాప్యం జరిగితే మాత్రం కొన్ని పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా, తొలిదఫా నామినేటెడ్ పందేరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దొరకని వారు, పార్టీ కోసం త్యాగం చేసిన వారు, జిల్లా స్థాయిలో ముఖ్య హోదాల్లో ఉన్న వారికి మాత్రమే అవకాశముంటుందని సమాచారం. ఆశావహులు ఎవరెవరంటే.. ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే ఒబేదుల్లా కొత్వాల్, చారకొండ వెంకటేశ్, రాజీవ్‌రెడ్డి, కేతూరి వెంకటేశ్ (మహబూబ్‌నగర్), కె.కె.మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, రమ్యారావు, నేరెళ్ల శారద (కరీంనగర్), చల్లా నర్సింహారెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, ముంగి జైపాల్‌రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సామా రామ్మోహన్‌రెడ్డి (రంగారెడ్డి), విశ్వప్రసాద్, నల్లాల ఓదెలు (ఆదిలాబాద్), రవళి, వెన్నం శ్రీకాంత్ (వరంగల్), మెట్టు సాయికుమార్, మోతె రోహిత్, నూతి శ్రీకాంత్ (హైదరాబాద్), అన్వేశ్‌రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, తాహెర్ బిన్, కాసుల బాలరాజు, గడుగు గంగాధర్ (నిజామాబాద్), త్రిషా దామోదర్, ఆంజనేయులు గౌడ్ (మెదక్), బొర్రా రాజశేఖర్, లోకేశ్‌యాదవ్, కోటా రాంబాబు, మద్ది శ్రీనివాస్‌రెడ్డి, సాధు రమేశ్‌రెడ్డి, నాగా సీతారాములు, తూళ్లూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్, శంకర్‌నాయక్, పున్నా కైలాశ్‌నేత, సర్వయ్య, ముత్తినేని వీరయ్య వర్మ, చెవిటి వెంకన్న యాదవ్ (నల్లగొండ) తదితరులు కీలక కార్పొరేషన్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కీలక నేతలు కూడా బడా కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్నారు. మొత్తంగా ఆశలపల్లకిలో 3వేలమంది ఇక, మరికొన్ని కార్పొరేషన్లతో పాటు డైరెక్టర్ల స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ నేతల సంఖ్య 3వేలకు పైగా ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో కొందరికి ఇందిరమ్మ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంమీద నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం మాత్రం అధికార కాంగ్రెస్ వర్గాల్లో రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు యాభై వాస్తవానికి, రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కార్పొరేషన్లు చిన్నా చితకా, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 50 వరకు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. వీటిని వీలున్నంత త్వరగా భర్తీ చేస్తే రెండేళ్ల పదవీ కాలం చొప్పున మరో రెండు మార్లు ఇతర నేతలకు అవకాశమివ్వచ్చని, అలా 1,500 మంది వరకు నేతలకు నామినేటెడ్ పదవులు ఈ ఐదేళ్ల కాలంలో పంపిణీ చేయవచ్చనేది టీపీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తొలిదఫా భర్తీ ఎప్పుడు పూర్తవుతుందన్న దాన్ని బట్టి 1,500 మంది వరకు అవకాశం కల్పించవచ్చని, జాప్యం జరిగిన కొద్దీ నేతల సంఖ్య తగ్గిపోతుందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, ఏఐసీసీ సిఫారసులు... ఇలా అనేక విధాలుగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య చాంతాడంత కనిపిస్తోంది. ఒక్కో జిల్లాకు 5–10 మంది పేర్లు వినిపిస్తున్నాయి. -
వంటేరు, వాసుదేవరెడ్డికి మళ్లీ చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల పరిధిలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్ల నియామక ప్రక్రియ వరుసగా మూడో రోజు కూడా కొనసాగింది. రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి పదవీ కాల పరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్న వాసుదేవరెడ్డి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టులో ముగిసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం మరో రెండేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలాన్ని కూడా మరో రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వంటేరు ప్రతాప్‌రెడ్డి పదవీ కాలం అక్టోబర్‌లో ముగిసింది. వాసుదేవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డిల పదవీ కాలాన్ని పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్ నేతల సంఖ్య పదికి చేరింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ (మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్), మన్నె క్రిషాంక్ (టీఎస్ఎండీసీ), సాయిచంద్ (వేర్ హౌజింగ్ కార్పొరేషన్), పాటిమీది జగన్ (టీఎస్టీఎస్), గజ్జెల నగేశ్ (బీవరేజెస్ కార్పొరేషన్), దూదిమెట్ల బాలరాజు యాదవ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), ఆకుల లలిత (మహిళా ఆర్థిక సంస్థ), జూలూరు గౌరిశంకర్ (సాహిత్య అకాడమీ) చైర్మన్లుగా నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పదవులు రానివారిపై దృష్టి.. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారు, ఉద్యమ సమయంలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల్లో చురుగ్గా పనిచేసిన వారు, వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరినా పదవులు పొందని వారిని గుర్తించి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారు. సుమారు 50 వరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు, పాలక మండళ్లు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం కావడంతో పదవులు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడంతో పాటు తమ జిల్లాలకు చెందిన మంత్రుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పదవుల ‘కల’వరం.. ఎప్పుడో పందేరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెరమీదకు వస్తున్నా తరచూ వాయిదా పడుతోంది. వరుస ఎన్నికలు వీటికి అవరోధంగా మారాయి. తాజాగా సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి ముగిశాక పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదిన్నరగా ఒకటీ అరా మినహా నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పోవడంతో పార్టీ లో పదవుల కోసం పోటీ నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన 12 మంది శాసనసభ్యులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు. సీనియర్లకు హామీ ఇచ్చిన అధిష్టానం రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 3 విడతల్లో మంత్రివర్గాన్ని విస్తరించారు. తనతో పాటు మరో 16 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో వివిధ సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించారు. అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యమిస్తామంటూ గతేడాది జరిగిన మూడో విడత కేబి నెట్ విస్తరణ సందర్భంగా సంకేతా లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం, మాజీ హోంమంత్రి నాయి ని, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జూపల్లి, తుమ్మ ల నాగేశ్వర్రావు, బాజిరెడ్డి గోవర్ధన్‌తో సహా మొత్తం 12 మంది పేర్లను ప్రస్తావిస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సుమారు 90 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఉండ గా గతేడాది అక్టోబర్ నాటికి 95% పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈ పదవులను ఆశిస్తూ సీఎం కేసీఆర్‌తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. ఒకటీ అరా పదవుల భర్తీ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను అసెంబ్లీలో, బి. వెంకటేశ్వర్లును మండలిలో చీఫ్ విప్‌లుగా నియమించారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయాచితం శ్రీధర్ ను కొనసాగించారు. మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కేబినెట్ హోదాలో నియమించారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అడ్వొకేట్ శ్రీరంగారావును టీఎస్ఈఆర్సీ చైర్మన్‌గా నియమించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను టెస్కో చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించినా ఉత్తర్వులు రాలేదు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధీర్ రెడ్డిని నియమించారు. కార్పొరేషన్లలో ఖాళీగా పదవులు రోడ్డు రవాణా సంస్థ, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ, మిషన్ భగీరథ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా కమిషన్ వంటి కీలక సంస్థల్లో చైర్మన్, పాలక మండలి సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో మార్కె ట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో ఖాళీగా ఉన్నాయి. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సుమారు 4 వేల వరకు నామినేటెడ్ పదవుల భర్తీకి అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పార్టీ నేతలు, కేడర్‌ను సంతృప్తి పరిచేలా పదవులను భర్తీ చేయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నేతలు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తుండటంతో, వీరిలో కొందరికి పార్టీ పదవులను కట్టబెట్టడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశముందని సమాచారం. -
మంత్రులతో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జిల్లాల వారీగా అభిప్రాయసేకరణను మంత్రులు పూర్తి చేశారు. శాసనసభా సమావేశాల్లోపు నామినేటెడ్ పోస్తులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పోస్టులపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు.