సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టి ఏడాది గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తెరమీదకు వస్తున్నా తరచూ వాయిదా పడుతోంది. వరుస ఎన్నికలు వీటికి అవరోధంగా మారాయి. తాజాగా సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవి ముగిశాక పార్టీ అధినేత కేసీఆర్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ చేపడతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదిన్నరగా ఒకటీ అరా మినహా నామినేటెడ్ పదవుల భర్తీ జరగక పోవడంతో పార్టీ లో పదవుల కోసం పోటీ నెలకొంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది శాసనసభ్యులు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారు.
సీనియర్లకు హామీ ఇచ్చిన అధిష్టానం
రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ 3 విడతల్లో మంత్రివర్గాన్ని విస్తరించారు. తనతో పాటు మరో 16 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో వివిధ సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చోటు కల్పించారు. అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యమిస్తామంటూ గతేడాది జరిగిన మూడో విడత కేబి నెట్ విస్తరణ సందర్భంగా సంకేతా లు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం, మాజీ హోంమంత్రి నాయి ని, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, జూపల్లి, తుమ్మ ల నాగేశ్వర్‌రావు, బాజిరెడ్డి గోవర్ధన్‌తో సహా మొత్తం 12 మంది పేర్లను ప్రస్తావిస్తూ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. సుమారు 90 ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు ఉండ గా గతేడాది అక్టోబర్ నాటికి 95% పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈ పదవులను ఆశిస్తూ సీఎం కేసీఆర్‌తో పాటు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు.
ఒకటీ అరా పదవుల భర్తీ
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను అసెంబ్లీలో, బి. వెంకటేశ్వర్లును మండలిలో చీఫ్ విప్‌లుగా నియమించారు. ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఎ.జీవన్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ కమిటీల్లో చోటు కల్పించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయాచితం శ్రీధర్ ను కొనసాగించారు. మాజీ ఎంపీ బి. వినోద్‌కుమార్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా కేబినెట్ హోదాలో నియమించారు.
పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అడ్వొకేట్ శ్రీరంగారావును టీఎస్‌ఈఆర్‌సీ చైర్మన్‌గా నియమించారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను టెస్కో చైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించినా ఉత్తర్వులు రాలేదు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేబినెట్ హోదాలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధీర్ రెడ్డిని నియమించారు.
కార్పొరేషన్లలో ఖాళీగా పదవులు
రోడ్డు రవాణా సంస్థ, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ, మిషన్ భగీరథ, ఎస్సీ కార్పొరేషన్, మహిళా కమిషన్ వంటి కీలక సంస్థల్లో చైర్మన్, పాలక మండలి సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో మార్కె ట్, దేవాలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లలో ఖాళీగా ఉన్నాయి. మున్సిప ల్ ఎన్నికల్లో పోటీ అవకాశం దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది.
సుమారు 4 వేల వరకు నామినేటెడ్ పదవుల భర్తీకి అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు పార్టీ నేతలు, కేడర్‌ను సంతృప్తి పరిచేలా పదవులను భర్తీ చేయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నేతలు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తుండటంతో, వీరిలో కొందరికి పార్టీ పదవులను కట్టబెట్టడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశముందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment