సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒకవైపు చలిపులి వణికిస్తుండగా.. మరోవైపు రాజకీయ వేడి రగులుకొంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల మాటల తూటాలతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు తారస్థాయికి చేరింది. నగరం కేంద్రంగా సాగుతున్న దర్యాప్తు సంస్థల దండయాత్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఐటీ, ఈడీ కేసులు, విచారణలు, అరెస్టులతో కేంద్రం ముందుకు వెళ్తోంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారానికి సంబంధించిన ఫాంహౌస్ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఆయుధంగా వాడుకుంటోంది. అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్ పెద్దల యుద్ధానికి కొన్ని రోజులుగా హైదరాబాద్ వేదికైంది.
ఈడీ కేసులతో మొదలై..
బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గా ఉన్న వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి సెంట్రల్ వర్సెస్ స్టేట్‌గా మారిపోయింది. టీఆర్‌ఎస్ నాయకులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్న కేంద్రం దాదాపు ఏడాది కాలంలో పావులు కదిపింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసులు, దాడులతో కలకలం సృష్టించింది. స్థిరాస్తి సంస్థలు, సెల్‌ఫోన్, వస్త్ర, జ్యువెలరీ వ్యాపార దిగ్గజాలు కూడా వీటిని ఎదుర్కొన్నారు.
ఓ పక్క ఈ పరిణామాలు ఇలా నడుస్తుండగానే చికోటి ప్రవీణ్‌కు సంబంధించిన క్యాసినో కేసుతో ఈడీ రంగంలోకి దిగింది. ప్రవీణ్‌తో మొదలైన విచారణ ఎదుర్కొనే వ్యక్తుల పరంపర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ వరకు వచి్చంది. వీరితో పాటు విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డినీ ఈడీ అ«ధికారులు ప్రశ్నించారు.
లిక్కర్ కేసుతో మారిన సీన్...
ఇలా ఐటీ, ఈడీ కేసులు, దాడులతో వాతావరణం వేడెక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీ లేకుండా చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన లిక్కర్ స్కామ్‌తో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు కేసులు, నోటీసులు, దాడులు, విచారణల వరకే కేంద్ర సంస్థలు పరిమితమయ్యాయి.
లిక్కర్ కేసులో ఢిల్లీ సర్కారు నేతలతో పాటు హైదరాబాద్‌కు చెందిన కొందరు కీలక వ్యక్తుల్నీ ఓ ఏజెన్సీ అరెస్టు చేయడం, మరో ఏజెన్సీ సైతం కస్టడీలోకి తీసుకుని విచారించడం చకచకా జరిగిపోయాయి... పోతున్నాయి. ఈ వ్యవహారంలో ఏకంగా ఎమ్మెల్సీ కవిత పేరును తీసుకురావడానికి బీజేపీ అధినాయకత్వం ప్రయతి్నంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఫాంహౌస్ కేసుతో రంగంలోకి సిట్..
మునుగోడు ఉప ఎన్నికకు కొన్ని రోజుల ముందు తెరపైకి వచ్చి ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారానికి వేదికైన ఫాంహౌస్ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఖరీదు చేయడానికి అవసరమైన డీల్ చేస్తూ రంగంలోకి దిగిన నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి అరెస్టు అయ్యారు. తాము స్వా«దీనం చేసుకున్న ఆడియో, వీడియోల్లో కేంద్రం పెద్దలకు సంబంధించిన వ్యవహారాలే ఉన్నాయంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు.
ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏకంగా బీఎల్ సంతోష్, తుషార్ భట్టాచార్య, జగ్గు స్వామిలకే నోటీసులు జారీ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చి
రెండు రోజులు విచారణ చేసింది.
మంత్రిపైనే ఐటీ బాణం..
ఈ కౌంటర్లు–ఎన్‌కౌంటర్ల మధ్యలో మంగళవారం చోటు చేసుకున్న వ్యవహారం కీలకంగా మారింది. ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రాష్ట్ర మంత్రి మల్లారెడ్డినే టార్గెట్‌గా చేసుకుంది. ఉదయం నుంచి ఏకకాలంలో ఆయనతో పాటు కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల ఇళ్లపై దాడులు చేసింది. మెడికల్ సీట్లలో అవకతవకలు, లావాదేవీల మధ్య భారీ వ్యత్యాసాలు గుర్తించినట్లు లీకులు కూడా ఇచ్చింది.
ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ నాయకుల అనుచరులు, సహాయకులతో పాటు పార్టీ మద్దతుదారులను టార్గెట్‌గా చేసుకున్న కేంద్ర సంస్థలు మల్లారెడ్డి వ్యవహారంతో ప్రత్యక్షంగా మంత్రికి..పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక పంపినట్లయింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తుయోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment