‘కోడ్‌’ పోగానే పందేరం! | Sakshi
Sakshi News home page

‘కోడ్‌’ పోగానే పందేరం!

Published Mon, May 20 2024 4:38 AM

Congress government is ready to fill nominated posts

మరిన్ని నామినేటెడ్‌ పదవుల పంపకానికి కాంగ్రెస్‌ సర్కారు సిద్ధం 

ఇప్పటికే 37 మందికి పదవులు.. ఇంకో 17 పోస్టులతో జాబితా

అంతా ఒకేసారి పదవీ బాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు 

గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి ఇవ్వడంపై సీఎం రేవంత్‌ నిరాసక్తత 

టికెట్‌ ఆశించి దక్కని వారికి మలి జాబితాలో కూడా అవకాశం 

కొందరు జిల్లా అధ్యక్షులు, యువ నాయకులకూ ప్రాధాన్యత 

రైతు, విద్యా కమిషన్లు కూడా త్వరలోనే.. కోదండరెడ్డి, ఆకునూరి మురళీకి చాన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీ మరో­మారు నామినేటెడ్‌ పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు 37 మంది పార్టీ నేతలను పలు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధిష్టానం అనుమతితో రెండో జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇందులో 17 మందికి చాన్స్‌ ఇవ్వనున్నట్టు గాంధీభవన్‌ వర్గాల సమాచారం. తొలిదఫాలో అవకాశం దక్కిన 37 మంది, ఈ 17 మంది కలిపి.. ఒకేసారి పదవీబాధ్యతలు తీసుకునేలా ఏర్పాట్లు చేసే యోచనలో సీఎం రేవంత్‌ ఉ­న్నా­రని తెలిసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే మలి దఫా జాబితాను ప్రకటిస్తారని సమాచారం. 

ఎవరెవరికన్న దానిపై కాస్త స్పష్టత 
తొలిదఫా నామినేటెడ్‌ పదవుల్లో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు, టికెట్లు ఆశించి దక్కని వారికి అవకాశం ఇచ్చారు. రెండో దఫాలో కూడా ఇదే తరహాలో పదవులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తొలి దఫాలో పీసీసీ అనుబంధ విభాగాల్లో.. చేనేత, ఎక్స్‌ సరీ్వస్‌మన్, సేవాదళ్‌లకు అవకాశం రాలేదు. దీంతో రెండో జాబితాలో ఈ విభాగాలకు చెందిన నేతలకు నామినేటెడ్‌ పదవులు దక్కుతాయని సమాచారం. వారితోపాటు ఆరేడుగురు పార్టీ జిల్లా అధ్యక్షు­లు, మరో ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ నేతల పేర్లను ఖరారు చేసినట్టు సమాచారం. 

గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి దక్కని కొందరికి ఈ జాబితాలో చాన్స్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన మైనార్టీ నేతల్లో కీలకమైనవారికి ఇప్పటికే నామినేటెడ్‌ పదవులు రాగా.. రెండో దఫాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు గాం«దీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. జూన్‌ 6వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగియనుంది. తర్వాత కొన్నిరోజుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన నాలుగైదు రోజుల్లోనే రెండో దఫా నామినేటెడ్‌ జాబితా విడుదల, అందరి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

రైతు, విద్యా కమిషన్లు కూడా.. 
వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని.. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందని గాంధీ భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈ కమిషన్ల ఏర్పాటు విషయంలో కూడా సీఎం రేవంత్‌ ఓ అభిప్రాయానికి వచ్చారని అంటున్నాయి. రెండో దఫా నామినేటెడ్‌ జాబితాతోపాటు ఆ రెండు కమిషన్ల నియామకం కూడా చేపట్టాలని భావిస్తున్నారని పేర్కొంటున్నాయి. 

రైతు కమిషన్‌ చైర్మన్‌గా ఏఐసీసీ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎం. కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిలను నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాయి. వ్యవసాయ, విద్యా శాఖలకు అనుబంధంగా పనిచేస్తూ.. కీలక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే దిశగా ఆ కమిషన్లు పనిచేస్తాయని నేతలు అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల నిర్మూలన, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ వంటి కీలక అంశాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తాయని చెప్తున్నారు. 

పోటీ చేసి ఓడినవారికి లేనట్టే! 
గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిన వారికి మలి దఫా నామినేటెడ్‌ పదవుల్లో కూడా స్థానం దక్కదని తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న రేవంత్‌రెడ్డి.. ఎన్ని విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చినా తొలిదఫాలో అలాంటి వారికి అవకాశం కల్పించలేదు. 

ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా మాత్రమే కొనసాగుతారని, ఎలాంటి నామినేటెడ్‌ పదవుల్లో వారికి అవకాశం ఉండదని గాం«దీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement