‘నామినేట్‌’ చేయండి.. బాస్‌  | TRS Aspirants requesting for KCR for nominated posts | Sakshi
Sakshi News home page

‘నామినేట్‌’ చేయండి.. బాస్‌ 

Published Mon, Nov 11 2019 2:42 AM | Last Updated on Mon, Nov 11 2019 4:36 AM

TRS Aspirants requesting for KCR  for nominated posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నామినేటెడ్‌ పదవుల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆశావహులు అటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికార నివాసం ప్రగతిభవన్‌తో పాటు, పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఈ పదవుల భర్తీ జరగలేదు. టీఆర్‌ఎస్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవులు పొందిన నేతల పదవీ కాలం ముగియడంతో చాలామంది రెండోసారీ తమను కొనసాగించాలని కోరుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులతో పాటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు కూడా ఈ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

రాష్ట్రంలో 50కి పైగా కార్పొరేషన్లు ఉండగా, వాటిలో 30 కార్పొరేషన్‌ చైర్మన్లకు కేబినెట్‌ హోదా దక్కుతుంది. వాటి కోసం పోటీ పడుతోన్న ఆశావహుల సంఖ్య పెద్దగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగిన కేబినెట్‌ విస్తరణ సందర్భంగా 12 మంది సీనియర్‌ నేతలకు తొలి ప్రాధాన్యతగా నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకేతాలిచ్చారు. కార్పొరేషన్లతో పాటు నాలుగువేలకు పైగా మార్కెట్, ఆలయ కమిటీలు, గ్రంథాలయ సంస్థ పాలక మండళ్లల్లో ఉద్యమకారులకు చోటిస్తామని ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత నామినేటెడ్‌ పదవుల భర్తీ ఉంటుందని ఇటీవల తనను కలిసిన వరంగల్‌ జిల్లా నేతలకు కేటీఆర్‌ చెప్పినట్లు సమాచారం. 

ఓడిన నేతలకు పదవులతో ఊరట 
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి నామినేటెడ్‌ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో కరీంనగర్‌ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్‌ చైర్మన్‌గా కేబినెట్‌ హోదా దక్కింది. మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, పి.మహేందర్‌రెడ్డి, చందూలాల్, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి కీలక పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పేరు ఖరారైనట్లు చెబుతున్నా ఇంకా స్పష్టత రాలేదు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించి సీఎం కేసీఆర్, కేటీఆర్‌ ప్రశంసలు అందుకున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గతంలో హుడా చైర్మన్‌గా పని చేసిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది.  

కొందరికే అవకాశం.. మరెందరో ఎదురుచూపులు 
ఒకరిద్దరు మినహా గతంలో కార్పొరేషన్‌ చైర్మన్లుగా నామినేటెడ్‌ పదవుల పొందిన నేతల పదవీ కాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగిసింది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక నలుగురైదుగురినే నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌ పదవీ కాలం పొడిగించారు. ఎనర్జీ రెగ్యులేషన్‌ కమిటీ చైర్మన్‌గా న్యాయవాది శ్రీరంగా రావు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెస్కో) చైర్మన్‌గా నియమిస్తారనే ప్రకటన వెలువడినా అధికారికంగా ఉత్తర్వులు జారీ కాలేదు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, సురేశ్‌రెడ్డి, మండవ వెంకటేశ్వర్‌రావు పలుమార్లు సీఎంను కలిశారు. తక్కళ్లపల్లి రవీందర్‌రావు, బస్వరాజు సారయ్య ఆశావహుల జాబితాలో ఉన్నారు. విద్యార్థి నాయకులు కె.వాసుదేవరెడ్డి, రాకేశ్‌రెడ్డి రెండోసారి కొనసాగింపు కోరుతుండగా, అవకాశం కోసం పల్లా ప్రవీణ్‌రెడ్డి, బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఎదురుచూస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement