- నామినే టెడ్ పదవుల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్
- పార్టీ పదవులు, కమిటీల నియామకం కూడా..
- టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో వెల్లడి
- ఏప్రిల్ 27న ఖమ్మంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ, సభ
- అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర
- వివరాలు వెల్లడించిన కడియం, నాయిని
- కార్యకర్తల బీమాకు విరాళంగా ప్రజాప్రతినిధుల నెల వేతనం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27లోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దాంతోపాటే పార్టీ సంస్థాగత పదవులు, కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ దాదాపు గంటపాటు పాల్గొన్న ఈ భేటీలో.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే ఎక్కువగా చర్చించారు. ఏప్రిల్ 27న పార్టీ ప్లీనరీని ఖమ్మంలో జరపాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి భేటీ వివరాలను విలేకరులకు తెలిపారు.
కరువు ఎదుర్కొనేందుకు నిధులు
‘‘సమావేశంలో కరువు, తాగునీటి ఎద్దడి, ప్రశుగ్రాసం కొరత, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ తదితర అంశాలపై చర్చించాం. కరువును ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపి నివేదికలు అందజేస్తే అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు’’ అని డిప్యూటీ సీఎం కడియం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల తీరుపైనా చర్చించామని, ప్రతిపక్షాల విమర్శలు హేతుబద్ధంగా ఉండడం లేదని, రాజకీయ విమర్శలు చేస్తున్నారు తప్పితే నిర్మాణాత్మక సూచనలు చేయడం లేదని సీఎం అభిప్రాయపడినట్లు వివరించారు.
విరాళంగా ప్రజాప్రతినిధుల నెల వేతనం
టీఆర్‌ఎస్ కార్యకర్తల కోసం గతంలో బీమా చేశామని, ఇందుకు గతేడాది రూ.4.75 కోట్లు చెల్లించగా.. రూ.10 కోట్ల క్లెయిమ్‌లు పొందినట్లు కడియం తెలిపారు. ఈసారి కూడా బీమా రెన్యువల్ చేయాలని, ఇందుకు పార్టీ ప్రజాప్రతినిధులు విరాళాలు ఇవ్వాలని సీఎం కోరినట్లు చెప్పారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ముందుకు వచ్చి రూ.వంద మొదలు ఎంతైనా విరాళంగా ఇవ్వొచ్చన్నారు. ఏప్రిల్ 27న ఖమ్మంలో ఉదయం ప్రతినిధుల సభ, సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చే శామన్నారు. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, తదితర పాలక మండళ్లకు సంబంధించిన నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కడియం వివరించారు. పార్టీ ఆవిర్భావ రోజు నాటికి పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా బలపడిందని, ప్రజలు అపూర్వ విజయాలు అందించారన్నారు. పార్టీ పదవుల నియామకాల తర్వాత కార్యకర్తల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
బస్సు యాత్రలో సమస్యలకు పరిష్కారం
అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపడతారని కడియం తెలిపారు. నియోజకవర్గాల్లో జరిగే ఈ పర్యటనల్లో గుర్తించిన సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఎమ్మెల్యేలు తమ వేతనాల పెంపు, ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చారని, అందుకు పరిశీలిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో మిషన్ కాకతీయ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ చివరికల్లా పందేరం
Published Sat, Mar 19 2016 2:34 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
Advertisement