ప్రజలే బాసులు...
టీఆర్‌ఎస్ 15వ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్
నేతలు, కార్యకర్తలు ప్రజల తలలో నాలుకలా వ్యవహరించాలి
నిర్లక్ష్యం చేస్తే పతనమవుతాం.. ప్రజలు నిర్దాక్షిణ్యంగా తీర్పిస్తారు
తెలంగాణ పునర్నిర్మాణం ఓ మహాయజ్ఞం
కార్యకర్తలు సంక్షేమ పథకాలకు కాపలాదారులుగా ఉండాలి
పార్టీ కన్నతల్లి.. విధేయతతోనే పదవులు
మే చివరికి ‘నామినేటెడ్’ భర్తీ.. ఇక నుంచి పార్టీపై దృష్టి సారిస్తా
(ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
ప్రజలంతా తెలంగాణ రాష్ట్ర సమితిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. టీఆర్‌ఎస్‌కే తెలంగాణ పరిస్థితులపై అవగాహన ఉందంటూ రాష్ట్ర బాధ్యతను అప్పగించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజలే తమకు బాసులని, వారికి తలలో నాలుకలా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలకు సూచించారు. నిత్యం ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలు ఏం ఆశించి ఇలాంటి విజయాలు అందిస్తున్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే పతనమవుతామని, ప్రజలు నిర్దాక్షిణ్యంగా తీర్పిస్తారని, పొగరుగా ఉంటే బండకేసి కొడతారని హెచ్చరించారు. తెలంగాణ పున ర్మిర్మాణం ఓ మహాయజ్ఞమని, ఈ స్పృహను మరిచిపోవద్దని సూచించారు. ఖమ్మంలో బుధవారం టీఆర్‌ఎస్ 15వ ప్లీనరీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం కే సీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజలు గొప్ప విజయాన్ని ఇచ్చారు: ‘‘2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక .. మీ ఉద్యమం ముగిసింది పక్కకు వెళ్లమన్నారు కొందరు. కానీ తెలంగాణ సమాజం మాత్రం టీఆర్‌ఎస్‌కే ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉందంటూ.. తెలంగాణ బాధ్యత తీసుకొమ్మన్నారు. ఆ స్ఫూర్తితోనే తొలి ఎన్నికల్లో 63 సీట్లతో టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. మరో 14 స్థానాలను వెయ్యిలోపు ఓట్ల తేడాతో పోగొట్టుకున్నాం. ప్రజలు గొప్ప విజయం ఇచ్చారు. కానీ కొందరు పది రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందని ప్రచారం చేశారు. పక్క రాష్ట్రం కరెంటు విషయంలో కిరికిరి పెట్టింది. అలాంటి బాలారిష్టాలు, కష్టాలను తట్టుకుని తెలంగాణ నిలబడింది.
టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వం హిమాలయాల అంత ఎత్తుకు ఎదిగాయి. అయినా మనకు గర్వం పనికిరాదు. మెదక్ లోక్‌సభ ఉపఎన్నిక మొదలు అపురూపమైన ఫలితాలు వచ్చాయి. వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు రికార్డు మెజారిటీతో గెలిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అసాధారణ తీర్పు ఇచ్చారు. 99 డివిజన్లు గెలిచాం. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు ఏం ఆశించి ఇలాంటి విజయాలు అందిస్తున్నారో అర్థం చేసుకోవాలి. మనకు బాస్‌లు లేరు. ప్రజలే బాసులు.
ఎవరి పదవులు వారికే..
నామినేటెడ్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టాం. మే నెలాఖరుకు అన్నీ భర్తీ చేస్తాం. 1985లో నేను ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి రావడానికి 13 ఏళ్లు పట్టింది. సమయం, సంద ర్భం, జిల్లాలు, సమీకరణాలు ఉంటాయి. ఎదురుచూడాలి. పార్టీ కన్నతల్లి వంటిది. దాన్ని నరికే ప్రయత్నం చేయొద్దు. ఎవరి పదవులు వారికి వస్తాయి. ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెరుగుతుంది. కనీసం మరో 34 మందికి అవకాశం వస్తుంది. ఎమ్మెల్సీ సీట్లు 10 సీట్లు పెరుగుతాయి. అంటే 44 మందికి అవకాశం వస్తుంది. సమయం కోసం ఎదురుచూడాలి. విద్యార్థి నాయకుడు బాల్క సుమన్ ఎంపీ అవుతాడని ఎవరన్నా ఊహించారా, యువజన సంఘం నేత బొంతు రామ్మోహన్ మేయర్ అవుతాడని ఎవరన్నా ఊహించారా? కొద్దిపాటి ఓపిక అవసరం. ఉద్యమానికి, పార్టీకి విధేయతగా పనిచేయండి, అవకాశం వస్తుంది. నాకు తెలిసి అన్ని రకాల నామినేటెడ్ పదవులు కలసి 3,500 నుంచి 4వేల దాకా ఉంటాయి. అన్నింటినీ నెలా నెలన్నరలో భర్తీ చేస్తాం.
ఇక పార్టీపై పూర్తిగా దృష్టి
ఇంతకాలం పరిపాలనపై దృష్టి పెట్టడం వల్ల పార్టీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు త ప్పదు. జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు పూర్తి చేస్తం. కమిటీల పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుంది. పార్టీ శిక్షణ కార్యక్రమాలను త్వరలో మొదలు పెడతాం. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. ఎవరూ రిలాక్స్ కావొద్దు. పతనమవుతాం. ప్రజలు నిర్దాక్షిణ్యంగా తీర్పిస్తారు. ప్రజల తలలో నాలుకలా ఉండాలి. పొగరు వస్తే బండకేసి కొడతరు. నిరాడంబరంగా, ప్రజల మధ్య ఉండాలి.
మేనిఫెస్టో నూరుశాతం అమలు
రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలే 80 శాతం మంది ఉన్నారు. అందుకే సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశంలో సంక్షేమ రంగానికి రూ.35,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. ప్రధాన మంత్రి కూడా ఈ అంశాన్ని వ్యక్తిగతంగా నా వద్ద ప్రస్తావించారు. గొప్పగా ముందుకు వెళుతున్నారని అభినందించారు. మేనిఫెస్టోలోని అంశాలను వంద శాతం అమలు చేశాం. అందులో చెప్పని సత్కార్యాలూ చే శాం. 4.80 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి భృతి అందిస్తున్నం. కల్యాణలక్ష్మి, సన్నబియ్యం వంటివి అమలు చేస్తున్నం.
తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించిందే నిధులు-నీళ్లు-నియామకాల నినాదంతో... ఇప్పుడు ప్రత్యేక రాష్టంగా ఏర్పడ్డాం. మన నిధులు బయటికి పోవు. ఉద్యోగాల బాధ తొలగిపోయింది. నీళ్లు రావాల్సిన అవసరముంది. మిషన్ కాకతీయకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన కరువుతో హృదయం బాధపడుతోంది. దానికి పరిష్కారం మిషన్ భగీరథ. ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్తా అపర భగీరథుడే. అంతా శ్రద్ధ తీసుకుని 2017 నాటికి దాన్ని పూర్తి చేయాలి. ఒక పథకం మొదలు పెట్టామనగానే బ్రోకర్లు తయారవుతున్నారు. కల్యాణలక్ష్మిలో పందికొక్కులు చేరాయి.
సంక్షేమ పథకాలకు కాపలాదారులుగా ఉండాలి. ఏవైనా సూచనలుంటే కార్యకర్తలు రాసి ఇవ్వాలి. ఇక విద్యుత్ సమస్యను అధిగమించినం. ఛత్తీస్‌గఢ్ కరెంటు అక్టోబర్‌లో వస్తుంది. అందరికీ అన్నీ అనుమానాలే. కాంగ్రెస్, టీడీపీలు తమ హయాంలో చేయలేదు కాబట్టి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నాయి. పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తున్నం. 2.60 లక్షల ఇళ్లు నిర్మిస్తం. దీనికోసం మూడు నాలుగేళ్లలో రూ.2లక్షల కోట్ల నుంచి రూ.2.5లక్షల కోట్లు వెచ్చిస్తం. మన ఆర్థిక ప్రగతి బాగుంది. 2025 నాటికల్లా తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లకు చేరుతుంది.
అందరూ బాగుపడితేనే..
మత్స్యకారులు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసేలా చర్యలు చేపడుతున్నం. చే నేత, కంసాలి, కుమ్మరి ఇలా బీసీల వృత్తి పనివాళ్ల సమస్యలు ముందేసుకుంటాం. అందరూ బాగుపడితేనే బంగారు తెలంగాణ వస్తుంది. టీఎస్ ఐపాస్‌కు మంచి స్పందన వస్తోంది. రూ.30వేల కోట్లు ఆక ర్షించాం. పెట్టుబడులు వరదలా వచ్చే అవకాశం ఉంది. ఐటీలో దేశంలోనే మనం నంబర్‌వన్‌గా ఎదిగే అవకాశాలున్నాయి.
ఈ ఘనత కార్యకర్తలదే..
తెలంగాణ సాధకులు టీఆర్‌ఎస్ కార్యకర్తలేనని.. వారికే ఈ ఘనత దక్కుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పద్నాలుగేళ్ల నిరంతర శ్రమ, అరెస్టులు, లాఠీలు, తూటాలు, పీడీ యాక్టులు, కేసులు, అవమానాలు, అవహేళనలను ఎదుర్కొన్నామని... మొక్కవోని దీక్షతో ఉద్యమం సాగించి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఎంతో ఆత్మ గౌరవంతో పార్టీ 15వ ప్లీనరీని జరుపుకొంటున్నామని, ఈ ఘనత, గౌరవం కార్యకర్తలకే దక్కుతుందని పేర్కొన్నారు.
‘‘నీచ మానవులు ఏం జరుగుతుందోనని మంచి పనులు ప్రారంభించరు.. కొందరు ప్రారంభించి మధ్యలో వదిలేస్తారు. ధీరులు మాత్రం అవరోధాలు అధిగమించి లక్ష్యం వైపు, గమ్యం వైపు సాగిపోతారు. తెలంగాణ సాధకులుగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇలాగే పనిచేశారు. ఈ పార్టీ ఉండేదా.. అయ్యేదా.. మఖలో పుట్టి పుబ్బలో పోయేదని హేళన చేశారు. కానీ టీఆర్‌ఎస్ నేతృత్వంలో జరిగిన ఉద్యమం ప్రపంచ ఉద్యమాల చరిత్రకు కొత్త భాష్యం చెప్పింది. శాంతియుతంగా, అహింసా పద్ధతిలో దేశవ్యాప్తంగా 36 పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాధించడం అద్భుతం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.