అందరి చూపు చైర్మన్‌గిరి వైపే
నామినేటెడ్ పదవి కోసం ఆశావహుల చక్కర్లు
గాడ్ ఫాదర్లను ఆశ్రయిస్తున్న గులాబీ నేతలు
పరకాల : స్థానిక వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గిరి గులాబీ నేతలను ఊరిస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి చైర్మన్ పదవి పైనే పడుతుంది. దీని కోసం ఆశావహులు తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇటు పరకాల అటు భూపాలపల్లి నియోజకవర్గాలకు నామినేటెడ్‌పరంగా కీలక పదవి కావడంతో ఉత్కంఠ రేపుతుంది. 1984లో స్థాపించబడిన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పరకాల, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, భూపాలపల్లి మండలాలున్నాయి. చిట్యాల, శాయంపేటలో సబ్ మార్కెట్లు ఉన్నాయి. గతంలో ఎప్పుడులేనంతగా తొలిసారిగా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం కోసం రిజర్వేషన్లను అమలుపర్చారు. చైర్మన్ పదవిని మూడు నెలల క్రితమే జనరల్‌కు కేటాయించారు. వెంటనే పాలకవర్గాన్ని నియమిస్తారని భావించినప్పటికి మళ్లీ వాయిదా పడింది. నేడో రేపో మళ్లీ నామినేటేడ్ పదవులను భర్తీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తుండడంతో చైర్మన్ ఎవరనీ వరిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుుతే పరకాల నియోజకవర్గంలో ఒక్క పరకాల మినహా మిగతా మండలాలు ఐదు భూపాలపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి. అసలే చైర్మన్ పదవి ఏ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులకు కేటాయిస్తారనేది సందిగ్ధంగా ఉంది.
భూపాలపల్లి నుంచి సిరికొండ మధుసూదనాచారి స్పీకర్‌గా వ్యవహరిస్తుండగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సైతం సీఎం కేసీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. చైర్మన్ ఎంపిక విషయంలో ఇద్దరు నేతలకు ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పరకాల మండలం నుంచి స్పీకర్ సన్నిహితుడు పాడి ప్రతాప్‌రెడ్డికి చైర్మన్ పదవి కావాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చందుపట్ల రమణారెడ్డి, చింతిరెడ్డి సాంబరెడ్డి చైర్మన్ పదవిని ఆశిస్తున్నవారిలో మొదటి వరుసలో ఉన్నారు. శాయంపేట మండల నుంచి పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డి, చిట్యాల నుంచి కుంభం రవీందర్‌రెడ్డి, భూపాలపల్లి నుంచి మేకల సంపత్, రేగొండ నుంచి భలేరావు మనోహర్‌రావులు పోటీపడుతున్నారు. గతంలో పోలెపల్లి శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్ మాట ఇచ్చారు. చైర్మన్ పదవిని దక్కించుకోవడం కోసం నాయకులు తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండడంతో చైర్మన్ పదవి ఎవరినీ వర్తిస్తుందో వేచి చూడాలి మరీ.