అన్నా ... నువ్వేం అడిగినవ్ !
నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని, అదీ.. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే కొన్నింటిని పూర్తిచేస్తామని తమ అధినేత కేసీఆర్ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు ఆశావహులు అసెంబ్లీకి బాట కట్టిండ్రు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయానికే పరిమితం కాకుండా కొందరు ప్రత్యేక పాసులపై లాబీల్లోకీ వస్తున్నారు. అసెంబ్లీలో అయితే సీఎం కేసీఆర్‌ను కలవడం తేలికని, తమ కోరికల చిట్టాలను విప్పొచ్చని ఒక్కొక్కరూ వచ్చి పోతున్నారు. లాబీల్లో ఒకరికొకరు ఎదురుపడుతున్న ఆశావహులు ‘ అన్నా .. నువ్వేం అడిగినవ్..? అంటే నువ్వేం అడిగినవ్..’ అంటూ పరస్పరం ఆరా తీస్తున్నరు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఓ మాజీ ఎమ్మెల్యే, తొలిసారి పోటీ చేసి ఓడిపోయిన మరో పార్టీ నేత, ఇప్పటి దాకా ఎలాంటి అవకాశం రాని యువ నేతలు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి అటు మంత్రులను, వీలయితే సీఎంను కలసి పోతున్నారు. పార్టీ అభ్యర్థులు ఓడిపోయిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఆయా పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలూ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఓడిపోయిన పార్టీ నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యిందని కూడా వీరు గుసగుసలు పెట్టుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి, సీట్ల సంఖ్య పెరిగితే తప్ప మళ్లీ పోటీ చేసే అవకాశం రాదని బాగా అర్థం చేసుకున్న వీళ్లు, నామినేటెడ్ రేసులో ముందే జాగ్రత్త పడుతున్నారు. ‘ సార్‌కు అయితే కనిపించిన. నా పరిస్థితి సార్‌కు తెలుసు. కార్పొరేషన్ పదవులు ఉన్నయ్ కదా.. చూద్దాం అన్నారు..’ అని ఓడిపోయిన ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీ నేతల వద్ద చెప్పుకుంటూ కనిపించారు. ఒకరికొకరు నువ్వేం పదవి అడిగావంటూ తెలుసుకోవడంలో బిజీగా మారారు.