సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంపై కాంగ్రెస్‌లో కొత్త చర్చ మొదలైంది. కేసీఆర్‌పై పోటీకి మొదటి నుంచీ టికెట్ ఆశిస్తున్న ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి అవకాశం లభిస్తుందా.. స్వతంత్ర అభ్యర్థిగా గద్దర్ నిల్చుంటే ఆయనకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అనే గజిబిజి నెలకొంది.
బుల్లెట్ పోరు నుంచి అనూహ్యంగా బ్యాలెట్ పోరు బాట పట్టిన ప్రజాయుద్ధ నౌక గద్దర్.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం, అన్ని పార్టీలు అంగీకరిస్తే గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించడంతో ఇప్పుడు గజ్వేల్‌లో చర్చంతా గద్దర్ చుట్టే తిరుగుతోంది. చాలాకాలంగా టీడీపీలో ఉండి, కాంగ్రెస్‌లోకి వచ్చాక కేసీఆర్‌పై ఒంటరి పోరు చేస్తున్న ఒంటేరు ప్రతాపరెడ్డి మళ్లీ తన అదృష్టాన్ని గజ్వేల్ నుంచే పరీక్షించుకునేందుకు ఉవ్విళ్లూరుతుండటం, ఆయనకు టీపీసీసీ ముఖ్యుల మద్దతు కూడా ఉండటంఆసక్తి రేకెత్తిస్తోంది.
గద్దర్‌కు తొలిసారి ఓటు హక్కు
గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీగా మహాకూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా గద్దర్‌ను దింపుతారనే చర్చ రెండు నెలలుగా చర్చ జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే గద్దర్ కూడా తన జీవితంలో తొలిసారి ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. స్వయంగా ఎన్నికల కమిషనర్‌ను కలసి వచ్చారు. గద్దర్ పోటీకి అంగీకరిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఆయన కూడా అక్కడక్కడా పోటీ అంశాన్ని ప్రస్తావిస్తున్నా కాంగ్రెస్ కేడర్ అంతగా పట్టించుకోలేదు.
వాస్తవానికి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క కూడా చాలా కాలంగా గద్దర్‌తో టచ్‌లో ఉంటున్నారు. ఇప్పటికే మూడు నాలుగుసార్లు సమావేశమై కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించాలని కోరారు. అయితే ఈనెల 12న ఉన్నట్టుండి గద్దర్ తన కుటుంబం సహా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్‌తో కలసి రాహుల్ నివాసానికి వెళ్లారు.
ఆయన కుమారుడు సూర్యకిరణ్ గతంలోనే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నారు. రాహుల్ కార్యాలయంలో ముఖ్యుడైన కొప్పుల రాజుతో పాటు రాహుల్‌కు అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ కూడా గద్దర్ కుటుంబసభ్యులతో ఉన్నారు. వీరంతా రాహుల్‌తో పాటు సోనియాను కూడా కలిశారు. తనను కలిసిన సందర్భంగా కాంగ్రెస్‌లో చేరి గజ్వేల్ నుంచి పోటీ చేయాలని రాహుల్ కోరారని, ఇందుకు తాను సమ్మతించలేదని, ఏ పార్టీలో చేరబోనని, అందరూ ఓకే అంటే స్వతంత్రంగా గజ్వేల్ నుంచి బరిలో ఉంటానని రాహుల్‌కు చెప్పానని గద్దర్ వెల్లడించారు.
ప్రతాప్ పరిస్థితేంటి?
తెలుగు రైతు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి కూడా గజ్వేల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉండేందుకు తహతహలాడుతున్నారు. గత ఎన్నికలలో కేసీఆర్‌పై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి 67వేలకు పైగా ఓట్లు సాధించిన ఒంటేరు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే గత ఎన్నికల్లో ఓడిపోయినా వెనక్కు తగ్గకుండా కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై పోరాట పంథాలోనే వెళ్తున్నారు.
ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిల మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలో దాదాపు తనకు మళ్లీ కేసీఆర్‌పై పోటీచేసే అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే గద్దర్ ఎపిసోడ్‌తో ఆయన, ఆయన అనుచరులు డోలాయమానంలో పడ్డట్లు తెలుస్తోంది. మొత్తానికి గజ్వేల్‌లో కాంగ్రెస్ పోటీచేస్తే ప్రతాప్‌రెడ్డి అభ్యర్థి అవుతారని, స్వతంత్ర అభ్యర్థికి మద్దతివ్వాల్సి వస్తే గద్దర్ బరిలో ఉంటారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment