గజ్వేల్‌లో మాట్లాడుతున్న టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారని, టీఆర్‌ఎస్‌లో ఆయనకు సముచిత గుర్తింపు లేదని.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధపడుతున్నారని, అంతేకాకుండా మామ కేసీఆర్‌ను ఓడించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్నరాత్రి హరీశ్‌రావు నాకు అన్‌నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసిండు.. నువ్వేమన్నా కష్టపడు, మా మామ కేసీఆర్‌ను ఓడించు.. కావాలంటే ఆర్థికంగా సాయం జేస్తా... మా మామ ఉంటే నా రాజకీయ జీవితం ఉండదు. అన్నీ కేటీఆర్‌కు అప్పజెప్తుండు. పార్టీలో నా ఇజ్జత్ తీస్తుండు’అంటూ చెప్పారని పేర్కొన్నారు. ‘పద్నాలుగేండ్లు పార్టీ కోసం కష్టపడ్డా.. గ్లాసులు కడిగినా.. చివరకు నాకు గుర్తింపు లేదు..’అంటూ వాపోయారని అన్నారు. ‘నేను కూడా నీవెంటే వస్తా’అంటూ భరోసా ఇచ్చారని తెలిపారు.
ఈ విషయాన్ని ఎక్కడంటే.. అక్కడ ప్రమాణం చేసి చెప్పడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే మీ అవినీతి సొమ్ము నాకొద్దంటూ తిరస్కరించానని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాదనే విషయం గుర్తించి, పార్టీ మారడానికి హరీశ్‌రావు సిద్ధపడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. తన వర్గం ఎమ్మెల్యేలతో వస్తానని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హరీశ్‌రావు, రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. సామాజిక తెలంగాణ కాంగ్రెస్‌కే సాధ్యమని.. ఈ పార్టీలోకి ఎవరు వచ్చినా అంతా స్వాగతిస్తారని పేర్కొన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నేతలు కుల సంఘాలతో మీటింగ్‌లు ఎందుకు పెడుతున్నారని ఒంటేరు ప్రశ్నించారు.
కులాలను తెరమీదికి తెచ్చి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 25 వేల మంది యువత ఉద్యోగావకాశాలు లేక ఆందోళన చెందుతున్నారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న కేసీఆర్ కనీసం 10 వేల మందికైనా ఉపాధి చూపించలేకపోయారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. గజ్వేల్‌ను అడ్డాగా మలచుకొని స్థానికేతర టీఆర్‌ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడున్న రెడ్డి నాయకులకు సమర్థత లేదా? అంటూ ప్రశ్నించారు.టీఆర్‌ఎస్ వైఖరిని ప్రజల్లో ఎక్కడికక్కడ ఎండగడతామని చెప్పారు. తాను గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో టీఆర్‌ఎస్ విధానాలపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూడటం ఖాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment