గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
గజ్వేల్: కాంగ్రెస్‌లో చేరడానికి తాను రాహుల్ గాంధీ తో టచ్‌లో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించి ప్రతాప్‌రెడ్డి వద్ద ఏమైనా ఆధారాలుంటే బయట పెట్టాలని, లేనిపక్షంలో భేషరతుగా క్షమాపణ చెప్పా లని మంత్రి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో, ప్రతాప్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రచారానికి అద్భుతమైన స్పందన రావడంతో ఓటమి భయంతో ప్రతాప్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సీఎం కేసీఆర్ పథకాల పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని చెప్పారు. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి న కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు ఏం ఒరగబెట్టలేదనే విషయం కూడా ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు.
తాను గజ్వేల్ నియోజకవర్గంలో ఉండి ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని, మూడోసారి హ్యాట్రిక్ ఓటమికి దరిదాపుల్లో ఉన్నానని గ్రహించిన ప్రతాప్‌రెడ్డి ఇలాంటి ఆరోపణలకు దిగారని హరీశ్ ధ్వజమెత్తారు. ఈసారి ఓడిపోతే తన రాజకీయ జీవితం పరిసమాప్తమవుతుందనే ఆందోళనలో ప్రతాప్‌రెడ్డి ఉన్నారన్నారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత ‘నీ బతుకేందో ప్రజలు తేలుస్తారు’ అని ప్రతాప్‌రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తానేందో.. తన వ్యక్తి త్వమేందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని, అదే విశ్వసనీయతతో పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ తాను ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేయగలిగానని పేర్కొన్నారు. ప్రజలను అయోమయానికి గురిచేయడానికి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాకూటమికి.. మహా ఓటమి తప్పదని గుర్తించి చంద్రబాబు, కాంగ్రెస్ నేతల డైరెక్షన్‌లో గోబెల్స్ ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు.
రాహుల్ కాంగ్రెస్ పార్టీకి ఐరెన్ లెగ్ లాంటివాడని, ఆయన ఎక్కడ పాదం మోపినా అక్కడ పరాజయమేనని, అలాంటి పార్టీలోకి తాను ఎలా వెళ్తానని ప్రశ్నించారు. ఇప్పటికే వందల సార్లు తాను ప్రకటించానని.. తన పుట్టుక, చావు టీఆర్‌ఎస్‌లోనేనని పునరుద్ఘాటించారు. గజ్వేల్‌లో చిల్లర రాజకీయాలతో ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ప్రతాప్‌రెడ్డి వైఖరిని సహించబోనన్నారు. ఇక్కడే తిష్టవేసి ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేయడం ద్వారా రాజకీయంగా ఆయన అంతుచూస్తానని హెచ్చరించారు. ప్రతాప్ అనుచిత వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే క్రమంలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ ఎం.భూంరెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ భూపతిరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment