సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ ఊహించని రీతిలో పెరిగిన పోలింగ్ శాతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 103 నియోజకవర్గాల్లో గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఆ ఓట్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ శాతం పెరుగుదల తమకంటే తమకే అనుకూలమని అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలిపేందుకే ఓటర్లు ఉత్సాహంగా ఓట్లేశారని అధికార టీఆర్‌ఎస్ చెబుతోంది.
అయితే.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. మరోవైపు బీజేపీ ఇతర చిన్నాచితకా పార్టీలు, ఇండిపెండెంట్ల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉన్నందున టీఆర్‌ఎస్‌కే లబ్ధి కలగొచ్చని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే దీనిపై ఏ పార్టీకి స్పష్టత రావడం లేదు. అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాల నేపథ్యంలో కొన్ని లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే సంస్థలు, వివిధ జాతీయ చానళ్లు జరిపిన సర్వేల ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సగటు తీసిన సీఎన్‌ఎన్ న్యూస్ 18 సంస్థ.. కేసీఆర్‌కు 66 సీట్లు రావొచ్చని పేర్కొంది. విచిత్రంగా కేసీఆర్ లక్కీ నంబరు 6. దీంతో కేసీఆర్‌కు డబుల్ లక్కీ ఫిగర్ వస్తుందేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇవీ టీఆర్‌ఎస్ లెక్కలు
పెరిగిన పోలింగ్ శాతంపై టీఆర్‌ఎస్ విశ్లేషణను పరిశీలిస్తే.. రైతులు, రైతు కూలీలు, పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వంపై సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తోంది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాల లబ్ధిదారులంతా మూకుమ్మడిగా ప్రభుత్వానికి బాసటగా నిలిచారంటోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు తగినంత సమయం దొరికింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పాటు వారి బంధువులను సైతం ఆకట్టుకునే రీతిలో వీరి ప్రచారం సాగింది.
గ్రామ గ్రామాన సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను తెప్పించుకుని వారిని ప్రత్యక్షంగా కలిసి ఓట్లడిగేందుకు మూడు నెలల సమయం దొరకడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సఫలీకృతయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పోలింగ్ పూర్తిగా తమకు అనుకూలంగానే జరిగిందనే ధీమాలో గులాబీదళం ఉంది. ఇక.. విద్యావంతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే భావన ఎన్నికల ముందు కనిపించినప్పటికీ పోలింగ్ సమయానికి వివిధ కారణాలతో కొంత అనుకూలంగా మారిందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తంమీద పోలింగ్ తమ పక్షానే జరిగిందని, మంగళవారం ఇదే నిర్ధారణ అవుతుందని కేసీఆర్‌తో సహా ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
అది వ్యతిరేక ఓటే: కాంగ్రెస్
ప్రభుత్వంపై వ్యతిరేకతే పెరిగిన ఓటింగ్ రూపంలో బయటపడిందని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా కూటమి అంటోంది. తెలంగాణ ఉద్యమ నినాదమైన నియామకాల విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. దీంతో నిరుద్యోగ యువత పూర్తిగా తమకే ఓటేసిందని అంచనా వేస్తోంది. ఎన్నికలకు ముందు ఉద్యోగులు కూడా బహిరంగంగానే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని, విద్యావంతులకు కూడా ప్రభుత్వంపై సదాభిప్రాయం లేదన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల ఐక్యత కారణంగా కూడా పోలింగ్ ఎక్కువగా జరిగిందని, అన్ని పార్టీలు తమ కార్యకర్తల చేత ఓట్లు వేయించడంలో విజయవంతమైనందునే పోలింగ్ శాతం పెరిగిందని కూటమి అభిప్రాయపడుతోంది. టీఆర్‌ఎస్ వైఫల్యాలు, తమ మేనిఫెస్టో, కూటమి స్ఫూర్తి వెరసి.. ఓటింగ్ పెరుగుదలకు కారణమైందని ధీమా వ్యక్తం చేస్తోంది.
త్రిముఖ పోటీ ఉన్నచోట..
టీఆర్‌ఎస్, కూటమితో పాటు బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్రుల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరిగింది. బోథ్, నిజామాబాద్ (అర్బన్), రామగుండం, చొప్పదండి, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, మేడ్చల్, నారాయణ్‌పేట, మహబూబ్‌నగర్, దేవరకొండ, మిర్యాలగూడ, భువనగిరి, ఆలేరు, వరంగల్ (ఈస్ట్), భద్రాచలం స్థానాల్లో కూడా పోలింగ్ శాతం పెరగడంతో ఇక్కడ ప్రజాతీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బలమైన నేతలే పోటీదారులు ఉండడంతో ఎవరికి వారే తమకు అనుకూలంగా పోలింగ్ చేయించుకునేందుకు చేసిన ప్రయత్నాల కారణంగానే పోలింగ్ పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. అయితే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు.. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మధ్య చీలిపోయి అది టీఆర్‌ఎస్‌కు మేలు జరుగుతుందని విశ్లేషకులంటున్నారు. ఇక, బీజేపీ ప్రధాన పోటీలో ఉన్న నియోజకవర్గాలతో పాటు నగర, పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ గణనీయంగా ఓట్లు చీల్చగలిగితే ఆ ప్రభావం కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందనే చర్చ కూడా జరుగుతోంది.
10% కన్నా ఎక్కువే!
పోలింగ్ శాతం ఏ నియోజకవర్గంలో ఏమేరకు పెరిగిందనే లెక్కల ఆధారంగా చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే 10% కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఇందులో పట్టణ నేపథ్యం ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, జహీరాబాద్, నల్లగొండ వంటి నియోజకవర్గాలతో పాటు పూర్తిగా గ్రామీణ ఓటర్లుండే కొడంగల్, నారాయణ్‌పేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, అచ్చంపేట వంటి స్థానాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో ఏకంగా 17.8% పోలింగ్ పెరగడంతో ప్రజాపల్స్‌ను ఊహించడం రాజకీయ పార్టీల తరం కావడం లేదు. గత ఎన్నికల కన్నా సుమారు 35వేల ఓట్లు ఇక్కడ అధికంగా పోల్‌కావడంతో ఈ ఓట్లన్నీ ఎవరికి పడ్డాయనేదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ 41 నియోజకవర్గాల్లో..
7% కన్నా ఎక్కువ పోలింగ్ 41 నియోజకవర్గాల్లో నమోదైంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ (అర్బన్), నిజామాబాద్ (రూరల్), కోరుట్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్, మెదక్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కొడంగల్, నారాయణ్‌పేట, మహబూబ్‌నగర్, మక్తల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, షాద్‌నగర్, కొల్లాపూర్, దేవరకొండ, నాగార్జునసాగర్, సూర్యాపేట, నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, కొత్తగూడెం స్థానాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఇందులో ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2014తో పోలిస్తే కనీసం 15వేలు ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో ఈ 41 స్థానాల్లో ఫలితాలే ప్రభుత్వంలో ఎవరుండాలని నిర్ణయిస్తాయని విశ్లేషకులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment