సాక్షి, సిద్దిపేట: ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతో విపక్షాలు కూటమిగా ఒక్కటవుతున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శిం చారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలతోపాటు జనగామ నియోజకవర్గం చేర్యాల ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు. విపక్షాలకు టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోనే సత్తా లేక సిద్ధాంతాలను పక్కనబెట్టి కూటమి కడుతున్నారని మండిపడ్డారు.
ఎలాగూ గెలవరు.. కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకునేందుకు వారు తాపత్రయ పడుతున్నారన్నారు. అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరిందని, ఇది చూసి జీర్ణించుకోలేని విపక్షాలు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతు అవుతాయనే భయం తోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో చెయ్యి కలపారని దుయ్యబట్టారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ నదీ జలాల పంపిణీపై రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.
రాహుల్‌వన్నీ అబద్ధాలే
ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలేనని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన తీరు అబద్ధాల బాబా, గ్లోబల్ బాబాలను తలపిం చే లా ఉన్నాయన్నారు. టీకాంగ్రెస్ నాయకులు రాసిన అబద్ధాల స్క్రిప్టును కనీసం పరిశీలించకుండా మాట్లా డి తన స్థాయిని దిగజార్చుకున్నారని చెప్పారు.
రైతు ఆత్మహత్యలపై చర్చకు సిద్ధమా?
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు.. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా అని హరీశ్ సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు పథకం, రుణమాఫీ ఇలా అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణగా మార్చేందుకు టీఆర్‌ఎస్ అహర్నిశలు కష్టపడుతోందని చెప్పారు. ఇదంతా మర్చిపోయి అధికార కాంక్షతో తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబు చెయ్యి పట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
రాంమాధవ్ వ్యాఖ్యల్లో పసలేదు..
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచామని, అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యల్లో పసలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు కోసం 16 రకాల అనుమతులు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే అనే విషయం రాంమాధవ్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా ప్రజల బాగోగులు పట్టించుకోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికలు రాగానే ప్రజల వద్దకు రావడం శోచనీయం అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వొడితల సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment