
కోస్గి (కొడంగల్): కాంగ్రెస్ నేతల్లో ఓటమి భయం నెలకొనడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని.., ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణకు మళ్లీ కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దీన్ని ప్రజలే నిర్ణయించారని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో మంగళవారం జరగనున్న టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సోమవారం రాత్రి హరీశ్‌రావు కోస్గికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రమంతా కేసీఆర్ సంక్షేమ పాలన కోరుకుంటున్నారని అన్నారు.
కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తమ సొంత నియోజకవర్గాలు వదిలి రాలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సభలు జరుగుతున్నా ఓటమి భయం నుంచి తేరుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కొడంగల్ ప్రజలు చైతన్యవంతులు కావడంతో తన జిమ్మిక్కులు ఇక సాగవని రేవంత్‌రెడ్డి గుర్తించారని పేర్కొన్నారు. దీంతో బంద్, ధర్నాలంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇన్ని రోజులు బయట తిరిగిన రేవంత్‌రెడ్డి, కేసీఆర్ సభను అడ్డుకునేందుకు గ్రామాల్లో విందులు ఏర్పాటు చేయించారని తెలిపారు. కేసీఆర్ సభను అడ్డుకుని అరెస్టు కావడం ద్వారా ప్రజల్లో సానుభూతి కోసం రేవంత్‌రెడ్డి మరోమారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కానీ కల్యాణలక్ష్మి చెక్కుతో పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పింఛన్ తీసుకునే వృద్ధులతో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ సభ కోసం ఎదురు చూస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment