సంగారెడ్డి టౌన్ : రాష్ట్రంలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. 90 సీట్లతో తాము అధికారంలోకి రాబోతున్నామన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఆదివారం రాత్రి ఆయన టీఆర్‌ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయంపై పీసీసీ అధ్యక్షుడికే ధీమా లేదన్నారు.
ముఖ్యమంత్రులు కావాలనుకున్న కాంగ్రెస్ నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి వెళ్లారని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకప్పుడు డాక్టర్లు ఉండే వారు కాదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌకర్యాలు పెంచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజూ 4 గంటల కరెంట్ కట్ ఉండేదని, టీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.
అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే మీ బతుకులు చీకటవుతాయని అన్నారని, కానీ తెలంగాణకు వెలుగులు వచ్చాయని, చీకటి కాంగ్రెస్‌కు, కిరణ్‌కుమార్‌రెడ్డికి మిగిలిందని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని, కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. తెలంగాణ పదాన్ని నిషేధించిన చంద్రబాబు, కాంగ్రెస్ ముసుగులో మళ్లీ వస్తున్నారని, ఆంధ్రాబాబు కావాలో, సుపరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment