సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించేందుకు తన ఫోన్లను పోలీసు శాఖ ట్యాపింగ్ చేస్తోందని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసులు, ఎన్నికల అధికారుల్లో మార్పు రావాలని, లేని పక్షంలో గజ్వేల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ప్రతిక్షణం తన వెంట సివిల్ పోలీసులను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కరినీ కేసీఆర్ పరామర్శించలేదని, ఆర్థిక సహాయం అందించలేదని అన్నారు.
మసాయిపేట రైలు ప్రమాద మృతులను, క్షతగాత్రులను సైతం పరామర్శించలేదన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించలేదని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తనపై 27 కేసులు పెట్టారని, హరీశ్‌రావు గల్లీ లీడర్‌లా అందర్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ గెలుపుకోసం ఇప్పటికే రూ.50 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో డబ్బులున్నాయని, అయినా అక్కడ తనిఖీలు జరపడం లేదన్నారు. అక్కడ పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కు 337 ఎకరాలు ఉంటే ఎన్నికల అఫిడవిట్‌లో కేవలం 57 ఎకరాలే ఉన్నట్లు పేర్కొన్నారని, మిగిలిన భూమి ఎవరిదో? విచారణ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.
వంటేరు నివాసంలో సోదాలు
వంటేరు ప్రతాపరెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే, అక్కడ ఎటువంటి నగదు లభించకపోవడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంటిని ఎలా తనిఖీ చేస్తారని ప్రశ్నించారు. విషయం తెలిసిన వంటేరు అభిమానులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment