
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోసం హెలిప్యాడ్ నిర్మించేందుకు కరీంనగర్ జిల్లా, తీగలగుట్ట గ్రామం సర్వే నంబర్ 232లో ఉన్న తమకు చెందిన భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మూడు పక్కల ముఖ్యమంత్రి, అతని బంధువుల భూములు ఉండగా, వాటిని వదిలేసి తమ భూమిని హెలిప్యాడ్ కోసం తీసుకుంటున్నారంటూ సిరిసిల్లకు చెందిన పి.ప్రతిమ, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్‌డీవోలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. 2013లో వచ్చిన భూ సేకరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం పిటిషనర్ల భూములను తీసుకుందని తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం అధికారులు తమ భూమిని తీసుకోలేదని, కేవలం ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రయోజనం కోసం భూమిని తీసుకున్నారని తెలిపారు. అంతేకాక పిటిషనర్ల భూమి పక్కనే ఉన్న ముఖ్యమంత్రి, ఆయన బంధువుల భూముల జోలికి వెళ్లకుండా పిటిషనర్ల భూములను తీసుకోవడం అన్యాయమన్నారు.
ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మేర తమ భూమిని తీసుకున్నారే తప్ప, చట్ట నిబంధనలకు లోబడి కాదని వివరించారు. కరీంనగర్ కలెక్టర్ 20 ఎకరాల్లో విస్తరించి ఉందని, అందులో ఇప్పటికే రెండు హెలికాప్టర్లు ఉన్నాయని తెలిపారు. 2013 కొత్త భూ సేకరణ చట్టం కింద ప్రైవేటు ప్రయోజనాల కోసం భూ సేకరణ చేయడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రతివాదులను ఆదేశించారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment