సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డ మానవ మృగం నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షాజీద్ ఖాన్‌ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'టీఆర్ఎస్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోంది. బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టి మూడురోజులైనా అరెస్టు చేయకపోగా.. దోషిగా తేలితేనే పార్టీ నుంచి బహిష్కరిస్తామనడం సిగ్గు చేటు. టీఆర్ఎస్ నేతల తీరును చూస్తుంటే ఈ అరాచకాలను సమర్ధిస్తుందని అర్ధమవుతోంది.
ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం హేయనీయం
టీఆర్ఎస్ మార్క్ సెక్యూలరిజానికి పరాకాష్ట. ఆనాడు రజాకార్లు మహిళలను చెరుపుతుంటే నిజాం రాజు మౌన పాత్ర వహించినట్లుగానే ఈనాడు టీఆర్ఎస్ నేతలు బాలికలను, మహిళలను చెరిపేస్తుంటే.. ఈ నయా నిజాం కేసీఆర్ ప్రేక్షక పాత్ర పోషిస్తుండటం హేయనీయం. మానవ మృగాన్ని పార్టీ నుంచి బహిష్కరించే సాహసం చేయలేకపోవడం అత్యంత దారుణం. నేటి నయా నిజాం పాలనకు నిదర్శనమిదే. టీఆర్ఎస్ పాలనలో వెలుగు చూసిన ఇలాంటి సంఘటనలు కొన్ని మాత్రమే. వెలుగు చూడని ఘటనలు కోకొల్లలు.
చదవండి: (ఎంకే స్టాలిన్‌కు సీఎం జగన్, కేసీఆర్ బర్త్‌డే విషెష్)
రాక్షస క్రీడలో మీరు భాగం కావొద్దు
గతంలో హైదరాబాద్ నడిబొడ్డున చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంమంత్రి నివాసానికి సమీపంలోనే దళిత మహిళపై ఎంఐఎం నేత అత్యాచారం చేస్తే ప్రేక్షక పాత్ర పోషించిన ప్రభుత్వం కేసు కూడా నమోదు చేయలేదు. కేసీఆర్ మార్క్ నూతన రాజ్యాంగం అంటే ఇదేనేమో. కల్వకుంట్ల రాజ్యాంగానికి అభం శుభం తెలియని బాలికలు బలవుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాల్సిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు భయపడుతుండటం బాధాకరం.
పోలీసులారా.. అధికార పార్టీ రాక్షస క్రీడలో మీరు భాగం కావొద్దని కోరుతున్నా. తక్షణమే బాధ్యుడిని అరెస్టు చేయాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇకనైనా అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి పనిచేయండి. ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. కేసీఆర్ పాలనలో టీఆర్ఎస్ రజకార్లు దౌర్జన్యాలు, లైంగిక దాడులతో రెచ్చిపోతున్నరు. ఇట్లాగే వ్యవహరిస్తే.. నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది. ఆనాడు రజకార్ల నుంచి తెలంగాణ మహిళలను రక్షించినట్లుగానే ఈనాడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ నియంత పాలనను తరిమి తరిమి కొట్టడం ఖాయం' అని బండి సంజయ్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment