కామినేని జంక్షన్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. చిత్రంలో మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతుల మెరుగుదలే లక్ష్యంగా బహుముఖ ప్రణాళికలు, వ్యూహాలతో నగరాభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని మునిసిపల్, ఐటీ మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. ప్రజా రవాణా, పట్టణ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించినట్లు తెలిపారు. ఎల్‌బీనగర్‌లో కామినేని ఆస్పత్రి వద్ద రూ.49 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ... 2030 నాటికి హైదరాబాద్ మెగా సిటీగా అవతరిస్తుందని, దానికనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. ప్రజారవాణా మెరుగుపడి, ప్రైవేట్ వాహనాలు తగ్గితేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
వచ్చే నెల మొదటి వారంలో మెట్రో రైలు..
అమీర్‌పేట–ఎల్‌బీనగర్ మెట్రో రైలు ఆగస్టు 15న ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, సీఎంఆర్‌ఎస్ అనుమతి జాప్యంతో మరో 15 రోజులు ఆలస్యం కానుందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ మార్గం ప్రారంభం అవనుందన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నాగోలు నుంచి ఎల్‌బీనగర్, ఎల్‌బీనగర్ టూ ఫలక్‌నుమా, శంషాబాద్ వరకు మెట్రో ప్రయాణానికి రూపకల్పన చేస్తున్నామన్నారు.
వేగంగా ఎస్సార్‌డీపీ పనులు..
నగరంలో ఎస్సార్‌డీపీ పనులు వేగంగా జరుగుతున్నాయని, రూ.23 వేల కోట్ల ఈ ప్రాజెక్టులో రూ.3 వేల కోట్లకు పైగా పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. మరో రూ.4 వేల కోట్ల పనులు పరిపాలన అనుమతి దశలో ఉన్నాయన్నారు. కేంద్రంతో కలసి సంయుక్తంగా రూ.1,500 కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో ఎక్కడా ఖర్చుపెట్టని విధంగా ఎల్‌బీనగర్‌లో రూ.450 కోట్లు రోడ్ల విస్తరణకు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. పాదచారుల హక్కులను పరిరక్షించేందుకు ఫుట్‌ఫాత్‌లపై 8వేలకు పైగా ఆక్రమణలను తొలగించడంతో పాటు, రూ.100 కోట్లను నిర్మాణ పనులకు కేటాయించినట్లు చెప్పారు. ‘మన నగరం’లో భాగంగా మంజూరైన రూ.42 కోట్లతో ఎల్‌బీనగర్‌కు పలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రికార్డు స్థాయిలో వేగంగా కామినేని ఫ్లైఓవర్‌ను నిర్మించిన నిర్మాణ సంస్థను అభినందించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రూ.46 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి..
రంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.46 వేల కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శివారు ప్రాంతాల్లో రూ.1,900 కోట్లతో ఇంటింటికి మంచినీరు అందించామన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోని గ్రామాలకు రూ.600 కోట్లతో మంచినీటిని అందిస్తున్నట్లు వివరించారు.
కేటీఆర్‌కు కితాబు..: విశ్వనగరంలో భాగంగా ఎల్‌బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,600 కోట్లను వెచ్చించడం జరిగిందని ఎల్‌బీ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఎల్‌బీనగర్ అభివృద్ధి పథంలో ముందుందని కితాబిచ్చారు. సీఎం వినూత్న విధానాలకు ప్రజల మద్దతుతో పాటు తమ మద్దతు ఉంటుందన్నారు.
శ్రీకాంతాచారి పేరు పెట్టాలి..
కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని అతని తల్లి శంకరమ్మ డిమాండ్ చేశారు. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి మద్దతుదారులతో వచ్చిన ఆమె ప్లకార్డులతో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని పక్కకు జరిపారు. కేటీఆర్ తిరిగి వెళ్లిన అనంతరం ఆందోళన చేశారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రతినిధుల నిరసన..
కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగులకు గుర్తింపు కార్డులివ్వాలని కోరుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మహిళా ఉద్యోగులు మంత్రి కేటీఆర్ సభ వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరడానికొస్తే పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment