మాన్సాస్‌ ట్రస్ట్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌  | Forensic audit on the MANSAS Trust | Sakshi
Sakshi News home page

మాన్సాస్‌ ట్రస్ట్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ 

Published Thu, Jun 17 2021 4:45 AM | Last Updated on Thu, Jun 17 2021 4:45 AM

Forensic audit on the MANSAS Trust - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. చిత్రంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి

సాక్షి, విశాఖపట్నం: అక్రమాల పుట్టగా మారిన మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇందుకోసం దేవదాయశాఖ కమిషనర్‌ ప్రత్యేకాధికారిగా నలుగురు జాయింట్‌ కమిషనర్లతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరునాటికి ఈ కమిటీ నివేదిక ఇస్తుందని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రస్ట్‌ వ్యవహారాలపై పదేళ్లుగా ఆడిట్‌ జరగలేదని చెప్పారు. విశాఖ జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం విశాఖఫట్నం, విజయనగరం జిల్లాల్లో దేవదాయశాఖ భూముల పరిరక్షణ, ఆలయాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది. మాన్సాస్‌ ట్రస్టు భూముల వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలోను, అనంతరం మీడియా సమావేశంలోను ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కోర్టు తీర్పును అడ్డంపెట్టుకుని ఈరోజు దొడ్డిదారిన చైర్మన్‌ అయిన అశోక్‌గజపతిరాజు పంచగ్రామాల్లో 12 వేల ఇళ్లలో నివసిస్తున్న వారి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. కోర్టు తీర్పుపై డివిజన్‌ బెంచ్‌లో విజయం సాధించి అశోక్‌గజపతిరాజును ఆ కుర్చీ నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు ఉన్న 14 వేల ఎకరాలకుపైగా భూములను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవస్థానం, శ్రీకాకుళం సీతారామస్వామి దేవస్థానాల నుంచి సుమారు 6 వేల ఎకరాలను బొబ్బిలి సంస్థానం నుంచి విజయనగరం సంస్థానానికి చెందిన పీవీజీ రాజుకు లీజుకు ఇచ్చారని తెలిపారు.

ఈ లీజు భూములు ఎవరి పేరుమీద ఉన్నాయో, అర్బన్‌ ల్యాండ్‌సీలింగ్‌ కింద ఎందుకు ప్రకటించలేదో అశోక్‌గజపతిరాజు చెప్పాలన్నారు. పీవీజీ రాజు ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ వచ్చినప్పుడు ఒకరోజు ముందు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన భూముల్లో కొన్ని మాన్సాస్‌ ట్రస్ట్‌కు, కుటుంబసభ్యులకు ఇచ్చారని, కొన్ని భూములు ఆయన పేరు మీదే ప్రభుత్వ రికార్డుల్లో ఉంచేశారని చెప్పారు. ఆ భూముల్ని ఎన్‌వోసీల పేరుతో అమ్ముకుంటూ ఏడుగురు కుటుంబసభ్యులు వాటాలు పంచుకుంటున్నారని తెలిపారు. విజయనగరంలో లెప్రసీ ఇన్‌స్టిట్యూట్‌కు ఉన్న 100 ఎకరాలకుపైగా భూమి తనదేనని ప్రకటించుకుని కాజేసేందుకు అశోక్‌గజపతిరాజు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని, వీటన్నింటిపైనా విచారణ నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

సింహాచలం భూముల సమస్య త్వరలోనే తీరుతుంది 
దేవదాయ, ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ, విజయనగరం జిల్లాల్లో గ్రామ దేవతల నుంచి పెద్ద ఆలయాల వరకు ఉన్న భూములు, వాటిలో ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయనే వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సింహాచల భూముల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా ట్రస్టు ఆస్తుల్ని సొంత ఆస్తులుగా అనుభవించడం మంచిపద్ధతి కాదని అశోక్‌గజపతిరాజు తెలుసుకోవాలని సూచించారు. పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాన్సాస్‌ ట్రస్టుకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ ఇసుక మైనింగ్‌ చేస్తున్నారంటే.. అశోక్‌గజపతిరాజు ధనదాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. సమీక్ష సమావేశంలో మాన్సాస్‌ ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాల వరకు మాత్రమే తనకు అధికారాలున్నాయని, విద్యాసంస్థల కార్యకలాపాలను కరెస్పాండెంట్‌ ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్‌ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement