దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి? | Hospital Sources Are Looking Into Bodies Of Accused In Disha Murder Case | Sakshi
Sakshi News home page

దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి?

Published Tue, Dec 17 2019 2:04 AM | Last Updated on Tue, Dec 17 2019 2:10 PM

Hospital Sources Are Looking Into Bodies Of Accused In Disha Murder Case - Sakshi

సాక్షి, గాంధీఆస్పత్రి: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని, వాటిని ఏం చేయాలో చెప్పాలని కోరుతూ ప్రభుత్వ ప్లీడర్‌(జీపీ)కి లేఖ రాసేందుకు గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 7న ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహ్మద్‌ అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు అదే రోజు ఫోరెన్సిక్‌ వైద్యులు బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మెడికల్‌ కాలేజీ లో భద్రపరిచారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యం లో ఈనెల 13 వరకు గాంధీ మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు సూచించింది.

చదవండి: దిశ కేసులో ‘ఫైనల్‌ రిపోర్ట్‌’

దీంతో నలుగురి మృతదేహాలను 9న గాంధీ మార్చురీకి తీసుకొచ్చి ఫ్రీజర్‌ బాక్స్‌లో భద్రపరిచారు. ఫ్రీజర్‌ బాక్సుల్లో పెట్టిన మృతదేహాలు వారం రోజుల తర్వాత క్రమంగా కుళ్లిపోతాయి. ఎంబామింగ్‌ చేసి ఫార్మల్‌ డీహైడ్‌ ద్రావకాన్ని రక్తనాళాల ద్వారా మృతదేహాల్లోకి ఎక్కిస్తే పాడవకుండా ఉంటాయి. దీంతో మృతదేహాలకు ఎంబామింగ్‌ చేయాలని ఫోరెన్సిక్‌ వైద్యులు నిర్ణయించారు. అయితే ఎంబామింగ్‌ చేస్తే మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేందుకు అవకాశం ఉండకపోవడం, మరోపక్క మృతదేహాలు కుళ్లిపోవడం ప్రారంభమయ్యే దశకు చేరుకోవడంతో ఫోరెన్సిక్‌ వైద్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు.

ఇలాంటి కేసుల్లో కోర్టు ఆదేశాల మేరకే మృతదేహాలకు ఎంబా మింగ్‌ చేయాలనే నిబంధన ఉందని సంబంధిత వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి పాలన యంత్రాంగం, ఫోరెన్సిక్‌ వైద్య బృందం సోమవారం దీనిపై చర్చించారు. తర్వాత మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని కోరుతూ జీపీకి లేఖ రాయా లని నిర్ణయించారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ నెల 13 వరకు మృతదేహాలను భద్రపరచమని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. గడువు ముగిసింది కనుక మృతదేహాలను ఏం చేయాలో చెప్పాలని మంగళవారం జీపీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు.  

ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్‌
సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. హైదరాబాద్‌కు చెందిన కె.సజయ, మీరా సంఘమిత్ర, వి.సంధ్యారాణి, ఎం.విమల దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావిస్తూ అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ వద్ద పిటిషన్లు ప్రస్తావించాలని ధర్మాసనం ఆదేశించింది.   

చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement