కర్నూలు(హాస్పిటల్): ఫోరెన్సిక్ విభాగం అంటే పోలీసులు, వైద్యులు, మీడియా, కొద్దిగా ఉన్నత విద్యావంతులకు మినహా మిగిలిన వారికి పెద్దగా పరిచయం లేని ప్రాంతం. అయితే మార్చురి అంటే దాదాపుగా అందరికీ పరిచయమే. దాని పేరు చెబితేనే...ఆ శవాల గదా..అని ముఖం చిట్లిస్తారు. మరికొందరు అటువైపు వెళ్లాలంటేనే దెయ్యాలంటాయని భయపడతారు. మరికొందరు అక్కడి దుర్వాసనను తట్టుకోలేక అటువైపు వెళ్లాలంటే జంకుతారు. తప్పనిసరైన పరిస్థితుల్లో అక్కడికి వెళ్లే వివిధ వర్గాల ప్రజలు ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో అక్కడే విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఒళ్లు జలదరిస్తుంది. కాస్త లోతుగా ఆలోచిస్తే అయ్యోపాపం అనిపిస్తుంది. వారి జీవితం దయనీయంగా ఉంటుంది.
కర్నూలు మెడికల్ కాలేజి 1954లో స్థాపించారు. కాలేజి ఆవిర్భావంతోనే ఫోరెన్సిక్ విభాగం కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ ఆర్. శంకర్(హెచ్‌వోడి), డాక్టర్ పి. బ్రహ్మాజీ మాస్టర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రాజశేఖర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైకేసి రంగయ్య, మరో నలుగురు కన్సాలిడేట్ పే అసిస్టెంట్ వైద్యులు, ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులు పనిచేస్తున్నారు. మరో నాలుగు ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే గది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉంది.
ఇక్కడికి చికిత్సకు కర్నూలు జిల్లాతో పాటు పక్కనున్న ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప జిల్లా, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, కర్నాటకలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు, ఆత్మహత్యల వల్ల మరణించిన వారి కేసులూ ఉంటాయి. ఈ మేరకు ప్రతిరోజూ సగటున మూడు నుంచి ఐదు, నెలకు 120 దాకా, ఏటా 1200 నుంచి 1500ల దాకా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు.
టిఫిన్ చేసి వస్తే మళ్లీ రాత్రి భోజనమే
ఇక్కడ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తారు. దీంతో పాటు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్నం 1 గంటల వరకు పోస్టుమార్టం చేస్తారు. ఈ మేరకు మొత్తం మృతదేహాలకు పోస్టుమార్టం ముగిశాకే వారు భోజనం చేయాల్సి వస్తోంది. అంటే రోజూ 4 నుంచి 5 గంటల తర్వాతే ఇంటికి వెళ్లి స్నానం చేసిన తర్వాతే భోజనం చేస్తున్నారు. అప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి వీలుండదు. ఈ కారణంగా వారు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత మళ్లీ రాత్రి భోజనంకు మాత్రమే పరిమితమయ్యారు.
పురుగులు పట్టినా చూడాల్సిందే..
పోస్టుమార్టం చేసే సమయంలో కొన్ని మృతదేహాలు కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంటాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తే సామాన్య ప్రజలు జడుసుకుంటారు. కానీ ఫోరెన్సిక్ వైద్యులు, సిబ్బంది మాత్రం వృత్తిధర్మంగా భావించి దుర్వాసనను భరిస్తూ విధులు నిర్వహిస్తారు. ఒక్కోసారి మృతదేహాలను కోసే సమయంలో లీటర్ల కొద్దీ రక్తాన్ని జగ్గుతో తోడిపోయడం వంటి దృశ్యాలను చూస్తూ రిపోర్ట్ రాసుకోవాల్సిందే. ఇలాంటి వాతావరణంలో నుంచి ఇంటికి వెళ్లినా మార్చురి తాలూకు దుర్వాసన శరీరంపై వస్తూనే ఉంటుంది. దీనికితోడు పోస్టుమార్టంకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఒక్కోసారి ఇంట్లోనూ పరిశీలిస్తూ కేసును ఛేదించాల్సిన పరిస్థితి వైద్యులది.
పోస్టుమార్టం ఎలా చేస్తారంటే...!
శవాన్ని ముందుగా నీటితో కడుగుతారు. ముఖాన్ని స్పాంజ్‌తో తుడుస్తారు. శవాన్ని కోశాక మరణానికి కారణాలను గుర్తించేందుకు తమ పరిశోధన కొనసాగిస్తారు. ఏదైనా క్రిమిసంహారక మందు తాగి/తాగించి చనిపోయిన వారి మృతదేహాలకైతే ముందుగా జీర్ణాశయం, 500 గ్రాముల లివర్, 30 సెంటీమీటర్ల చిన్నపేగుల, రెండు కిడ్నీల్లో సగం సగం తీసి ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపిస్తారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుట్టేసి కుటుంబీకులకు అప్పగిస్తారు.
►నీటిలో మునిగి చనిపోయి ఉంటే తనే నీటిలో పడ్డాడా, ఎవ్వరైనా కొట్టి నీటిలో పారవేశారా, లేక మూర్చవ్యాధితో నీటిలో పడ్డారా అని పోస్టుమార్టంలో తెలుస్తుంది.
►ఇటీవల ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌తో చనిపోవడంతో మార్చురికి తీసుకొచ్చారు. అతనికి పొట్టలో పేగులు బయటకు రావడంతో పొడిచి చంపారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతను విద్యుత్ షాక్‌తోనే చనిపోయాడని, విద్యుదాఘాతం వల్లే అతని పొట్టలో పేగులు బయటపడ్డాయని నిర్దారించారు.
►ఇటీవల ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. కానీ అతన్ని బండరాయితో స్నేహితులు కొట్టి చంపారని కుటుంబసభ్యులు కేసు పెట్టారు. అతను రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడని పోస్టుమార్టంలో నిర్దారణ అయ్యింది.
మాసం | పోస్ట్‌మార్టం | ఎగ్జామినేషన్ | ఏజ్ డిటర్నినేషన్ | సెక్సువల్ అఫెన్సెస్ | ఎక్స్‌పర్ట్ ఒపీనియన్స్ |
జనవరి | 123 | 05 | 11 | 12 | |
ఫిబ్రవరి | 141 | 03 | 03 | 09 | |
మార్చి | 118 | 02 | 04 | 07 | |
ఏప్రిల్ | 123 | 06 | 03 | 11 | |
మే | 129 | 02 | 05 | 05 | |
జూన్ | 106 | 04 | 08 | 04 | |
మొత్తం | 740 | 22 | 34 | 47 |
2020లో వివిధ రకాల సెక్షన్లలో కేసులు |
సెక్షన్‌లు | సంఖ్య |
304(ఎ) రోడ్డు ప్రమాదాలు | 394 |
174 సీఆర్‌పీసీ ఆత్మహత్యలు | 694 |
302(ఎ)హత్యలు | 15 |
318(ఎ)అనుమానస్పద మరణాలు | 01 |
498(ఎ), 306 వేదింపుల కారణంగా మహిళల ఆత్మహత్యలు | 04 |
306 ఐపీసీ ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్ల మరణాలు | 15 |
307(ఎ) హత్యాయత్నం | 01 |
నాన్ వెజ్ తినడం మానేశాను –డాక్టర్ ఆర్. శంకర్, ఫోరెన్సిక్ హెచ్‌వోడి, కేఎంసీ
ఫోరెన్సిక్‌లో పనిచేస్తున్నప్పటి నుంచి నేను నాన్‌వెజ్ తినలేక మానేశాను. నాన్‌వెజ్ తిందామని కూర్చున్నా ప్లేట్‌లో మాంసం ముక్కలు చూడగానే మార్చురిలో శవానికి కోసిన శరీర భాగాలు గుర్తుకు వస్తాయి. దీంతో నాన్ వెజ్ అంటేనే విరక్తి కలిగింది. మార్చురిలోని దుర్వాసన మా శరీరానికి అంటుకుపోతుంది. స్నానం చేసినా కూడా దుర్వాసన భావన మనసులోనే ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు వెళ్లడం మానేశాం. సమాజంలో అందరినీ కలవలేని పరిస్థితి. ఇల్లు, ఉద్యోగమే జీవితం. కొన్నిసార్లు కుటుంబసభ్యులకూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మెడికో లీగల్ కేసుల్లో మేమిచ్చే నివేదికలే ఆధారం కాబట్టి మా జీవితం ఇలా అలవాటు పడాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment