జీజీహెచ్‌లోని శవాగారం
గుంటూరు మెడికల్ : రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన వారికి పోస్టుమార్టం చేయాల్సినప్పుడు మృతదేహాం తారుమారు కాకుండా ఉండేందుకు ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్‌కుమార్, ఫోరెన్సిక్ వైద్య విభాగాధిపతి డాక్టర్ టీటీకె రెడ్డి ట్యాగ్‌లు ఏర్పాటు చేయటంపై చర్చించారు. కొన్ని రకాల ట్యాగింగ్‌లను పరిశీలించారు.
కాగితాలపై నమోదుతో తారుమారు!
గుంటూరు జీజీహెచ్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి, కత్తిపోట్లకు గురై, శరీరం కాలి, విషప్రభావానికి గురై, కొట్లాటలో గాయపడి, ఇతర సందర్భాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి చనిపోయిన పిదప మెడికో లీగల్ కేసులను తప్పనిసరిగా పోస్టుమార్టం చేయాల్సి ఉంటుంది. జీజీహెచ్‌లో ప్రతిరోజూ పదిమందికి పోస్టుమార్టం చేస్తున్నారు. పోలీసులు వచ్చి విచారణ చేసి ఇంక్వెస్టు రిపోర్టు వైద్యులకు ఇచ్చే సరికి ఒక రోజు లేదా ఒక పూట సమయం పడుతుంది. కొన్ని క్లిష్టమైన కేసులకు రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని శవాగారంలో భద్రం చేసేందుకు కాగితాలపై పెన్నుతో వివరాలు రాసి మృతదేహం ఉంచిన బాక్స్ వద్ద అంటిస్తున్నారు. ఆస్పత్రి శవాగారంలో 30 మృతదేహాలను నిల్వచేసే సామర్థ్యం ఉంది. మృతదేహాలు పాడవ్వకుండా అతిశీతలీకరణం చేయటం వల్ల కొన్నిసార్లు కాగితాలపై మృతదేహానికి సంబం«ధించిన వివరాలు చెరిగిపోతున్నాయి. దీని వల్ల మృతదేహాలకు సంబంధించిన వివరాలు కొన్నిసార్లు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ట్యాగ్‌లు ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రి అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ఉచితంగా చాపలు, వస్త్రాలు..
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రెండు చాపల్లో చుట్టి, తెల్లటి గాజు వస్త్రంలో చుట్టి అందజేస్తారు. గతంలో చాపలు, వస్త్రాలను ఆస్పత్రి అధికారులే హెచ్‌డీఎస్ నిధుల నుంచి కొనుగోలు చేసి ఉచితంగా అందజేశారు. ఇలా చేయటం ద్వారా శవాగారంలో వస్త్రాలు, చాపలు, విస్రా బాటిల్స్ కోసం చనిపోయిన వారి బంధువుల నుంచి వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేయటాన్ని నిలువరించారు. మూడేళ్ళపాటు సత్ఫలితాలు ఇచ్చిన ఈ విధానాన్ని రెండున్నరేళ్ళ కిత్రం అర్ధాంతరంగా ఆపివేశారు. కొంతమంది ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది చాపలు, వస్త్రాలను సైడ్ బిజినెస్‌గా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్చురీ ఎదురుగా ఉంటే షాపుల్లో వాటిని అందుబాటులో ఉంచి వైద్య సిబ్బంది అమ్మిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలంలో చాపలు, వస్త్రాల కోసం మార్చురీలో డబ్బులు అడుగుతున్నారనే కథనాలు మీడియాలో రావటంతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్( డీఎంఈ) అధికారులు చాపలు, వస్త్రాలను ఉచితంగా అందించాలనే ఆలోచనలోకి వచ్చారు. గతంలో గుంటూరు జీజీహెచ్‌లో ఈ విధానం విజయవంతంగా అమలు చేయటంతో ఆస్పత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇలా చేయటం ద్వారా పోస్టుమార్టం వద్ద జరిగే మాముళ్లను కట్టడి చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment