
సాక్షి, హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ఆర్థిక అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు సోమవారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ)కి ఫిర్యాదు చేశారు. కంపెనీల చట్టం కింద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ద్వారా విచారణకు ఆదేశించాలని ఆయన ఆర్వోసీని కోరారు. సుజనా గ్రూపు కంపెనీలు, వాటి యాజమాన్యాలు, ఆస్తి అప్పుల పట్టీలు, వార్షిక నివేదికలు, కంపెనీ మధ్య జరిగిన లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, కంపెనీల విలీనం తదితర అంశాలకు సంబంధించి లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుజనా గ్రూపునకు చెందిన 49 కంపెనీల ద్వారా మోసపూరిత వ్యాపార లావాదేవీలు, పన్ను ఎగవేతకు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం చేకూర్చారని ఆయన తెలిపారు.
సుజనా చౌదరి రెండు డిన్ (డైరెక్టర్ ఐడెన్టిఫికేషన్ నంబర్) కలిగి ఉన్నారని, వాస్తవానికి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే డిన్ ఉండాలన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఇలా చేశారన్నారు. ప్రస్తుతం సుజనా చౌదరి దాదాపు 15 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. మరో 30 కంపెనీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కలిగి ఉన్నారని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక సుజనా చౌదరి తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వాటాల విలువలకు, ఆయన కుటుంబ సభ్యులు కలిగి ఉన్న వాటాల విలువలకు ఎంతో తేడా ఉందని వివరించారు. సుజనా ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే అతని అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్వోసీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment