రిజల్యూషన్ ప్రొఫెషనల్ మధుసూదనరెడ్డికి ఎన్‌సీఎల్‌టీ సూచన
వాటిని సుజనా ఎలా తీరుస్తారో బెంచ్‌కు తెలియజేయాలి
ఆయన పరిష్కారానికి రుణదాతలు అంగీకరిస్తే సరి
లేదంటే దివాలా ప్రక్రియ మరింత ముందుకు
తీర్పు పూర్తి కాపీని విడుదల చేసిన ఎన్‌సీఎల్‌టీ
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్‌సీఎల్‌టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది.
దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్‌సీఎల్‌టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్‌పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు స్పష్టంగా వివరించింది.
దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్‌బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్‌పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది.
వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్‌పీ నివేదిక అందజేశారు. పిటిషన్‌ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్‌సీఎల్‌టీ తీర్పు వెలువరించింది.
తీర్పులో ప్రధానాంశాలు..
సుజనా చౌదరిపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నందున అన్ని అప్పులపై 180 రోజుల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరులకు బదిలీ వంటి లావాదేవీలు నిషేధం. మా ఉత్తర్వుల కాపీ ఎన్‌సీఎల్‌టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన 7 రోజుల్లోగా సుజనాకు అప్పులు ఇచ్చిన వారి నుంచి వివరాలు కోరుతూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ పూర్తి వివరాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలి.
వ్యక్తిగత హామీదారు సుజనా, కార్పొరేట్ రుణగ్రహీత స్ప్లెండిడ్ కంపెనీ ఉంటున్న రాష్ట్రంలో విస్తృత సర్కులేషన్ ఉన్న ఆంగ్ల, మాతృ భాష (తెలుగు) పత్రికల్లో ఈ నోటీసులు ప్రచురించాలి. ఆ తర్వాత రుణ దాతలు క్లెయిమ్‌లు సమర్పించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాలి. 30 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల జాబితా, ఇతర వివరాలన్నీ సిద్ధం చేయాలి. రుణదాతలకు ఎలా చెల్లింపులు చేస్తారో సుజనా నివేదిక ఇవ్వాలి.
రుణదాతల జాబితా, సుజనా నివేదికను ఎన్‌సీఎల్‌టీ బెంచ్ (అడ్జ్యుడికేటింగ్ అథారిటీ)కి రిజల్యూషన్ ప్రొఫెషనల్ అందజేస్తారు. చివరి క్లెయిమ్ అందిన 21 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అప్పటి నుంచి 28 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం అవసరం లేదని రిజల్యూషన్ ప్రొఫెషనల్ సిఫార్సు చేస్తే, దానికి కారణాలను తెలపాలి.
సుజనా నివేదికను రుణదాతలకు అందజేసి, వారి అభిప్రాయం తీసుకుని, ఆ వివరాలను ఎన్‌సీఎల్‌టీకి సమర్పించాలి’ అని పేర్కొంది. సుజనా చెల్లింపుల విధానానికి రుణదాతలు అంగీకరిస్తే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది. లేదంటే ఆస్తులు వేలం వేసి చెల్లించేలా దివాలా ప్రక్రియ ముందుకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment