bankruptcy process
-
సుజనా అప్పుల లెక్క తీయండి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్‌సీఎల్‌టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది. దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్‌పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు స్పష్టంగా వివరించింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది. వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్పీ నివేదిక అందజేశారు. పిటిషన్‌ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తీర్పు వెలువరించింది. తీర్పులో ప్రధానాంశాలు.. సుజనా చౌదరిపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నందున అన్ని అప్పులపై 180 రోజుల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరులకు బదిలీ వంటి లావాదేవీలు నిషేధం. మా ఉత్తర్వుల కాపీ ఎన్సీఎల్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన 7 రోజుల్లోగా సుజనాకు అప్పులు ఇచ్చిన వారి నుంచి వివరాలు కోరుతూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ పూర్తి వివరాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలి. వ్యక్తిగత హామీదారు సుజనా, కార్పొరేట్ రుణగ్రహీత స్ప్లెండిడ్ కంపెనీ ఉంటున్న రాష్ట్రంలో విస్తృత సర్కులేషన్ ఉన్న ఆంగ్ల, మాతృ భాష (తెలుగు) పత్రికల్లో ఈ నోటీసులు ప్రచురించాలి. ఆ తర్వాత రుణ దాతలు క్లెయిమ్‌లు సమర్పించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాలి. 30 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల జాబితా, ఇతర వివరాలన్నీ సిద్ధం చేయాలి. రుణదాతలకు ఎలా చెల్లింపులు చేస్తారో సుజనా నివేదిక ఇవ్వాలి. రుణదాతల జాబితా, సుజనా నివేదికను ఎన్సీఎల్టీ బెంచ్ (అడ్జ్యుడికేటింగ్ అథారిటీ)కి రిజల్యూషన్ ప్రొఫెషనల్ అందజేస్తారు. చివరి క్లెయిమ్ అందిన 21 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అప్పటి నుంచి 28 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం అవసరం లేదని రిజల్యూషన్ ప్రొఫెషనల్ సిఫార్సు చేస్తే, దానికి కారణాలను తెలపాలి. సుజనా నివేదికను రుణదాతలకు అందజేసి, వారి అభిప్రాయం తీసుకుని, ఆ వివరాలను ఎన్సీఎల్టీకి సమర్పించాలి’ అని పేర్కొంది. సుజనా చెల్లింపుల విధానానికి రుణదాతలు అంగీకరిస్తే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది. లేదంటే ఆస్తులు వేలం వేసి చెల్లించేలా దివాలా ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. -
రిలయన్స్ క్యాపిటల్ నిర్వాకం.. ఈపీఎఫ్‌వోకి రూ.3,000 కోట్ల నష్టం?
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా అండ్ బ్యాంక్రప్టసీ చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కోరింది. రిలయన్స్ క్యాపిటల్ బాండ్లలో ఈపీఎఫ్‌వో రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈపీఎఫ్‌వో పెట్టుబడులపై 2019 అక్టోబర్ నుంచి చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమవుతూ వచ్చినట్టు వివరించారు. ఈపీఎఫ్‌వోకు అసలు పెట్టుబడి, వడ్డీ చెల్లింపుల్లో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందా? అంటూ ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ జా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2021 నవంబర్ 30 నాటికి ఎన్‌సీడీలపై రిలయన్స్ క్యాపిటల్ రూ.534 కోట్ల వడ్డీని చెల్లించడంలో వైఫల్యం చెందినట్టు చెప్పారు. అసలు వడ్డీతో కలిసి సుమారు రూ.3,000 కోట్లు ఈపీఎఫ్‌వో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రిలయన్స్ క్యాపిటల్‌కు వ్యతిరేకంగా దివాలా చర్యలు ప్రారంభించాలని కోరుతూ ఆర్బీఐ ఇటీవలే ఎన్సీఎల్టీని ఆశ్రయించడం తెలిసిందే. చదవండి: రిలయన్స్ క్యాపిటల్ దివాలా ప్రొసీడింగ్స్ షురూ! -
దివాలా కోడ్ అమలుతో...కార్పొరేట్ ‘రుణ’ ఫ్యూడలిజానికి ముగింపు!
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది. చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది. కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. -
దివాలా సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) దివాలా ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రవేశపెట్టిన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (సవరణ) బిల్లు, 2021ను లోక్‌సభ ఎటువంటి చర్చా లేకుండా బుధవారం ఆమోదించింది. రుణ చెల్లింపుల వైఫల్య పరిమితి రూ.కోటికి లోబడి ప్రీ–ప్యాకేజ్డ్ రిజల్యూషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. పెగాసస్‌పై సభ్యుల తీవ్ర ఆందోళనల నడుమ కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఇంద్రజిత్ సింగ్ దివాలా చట్ట సవరణ బిల్లును సభ ఆమోదం నిమిత్తం ప్రవేశపెట్టారు. మహమ్మారి ప్రేరిత సవాళ్లను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఊరట కలిగిస్తూ, ఏప్రిల్ 4న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును తీసుకువచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. రూ.కోటి లోపు రుణ వైఫల్యం జరిగిన ఎంఎస్ఎంఈ దివాలా పక్రియను తాజా బిల్లు సులభతరం చేస్తుంది. తమ రుణాలను పునర్ వ్యవస్థీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
దివాలా ప్రక్రియపై ఐఐసీఏ ప్రత్యేక కోర్సు
ముంబై: దివాలా ప్రక్రియ నిర్వహించే నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) తాజాగా గ్రాడ్యుయేట్ ఇన్సాల్వెన్సీ ప్రోగ్రాం (జీఐపీ) పేరిట ప్రత్యేక కోర్సు ప్రారంభించింది. రెండేళ్ల ఈ కోర్సుకు దీనికి భారతీయ ఇన్సాల్వెన్సీ బోర్డు (ఐబీబీఐ) కూడా ఆమోదముద్ర వేసింది. కార్పొరేట్ రంగ నియంత్రణకు సంబంధించి తగు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ పలువురు మేధావులతో ఐఐసీఏని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశీయంగా 2,500 మంది దివాలా ప్రొఫెషనల్స్ ఉన్నారని, దీనికి డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని ఐబీబీఐ చైర్పర్సన్ ఎంఎస్ సాహూ తెలిపారు. -
డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ మొదలైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మేరకు తాత్కాలిక పరిష్కార నిపుణుడిని (ఐఆర్పీ) నియమించింది. అలాగే 180 రోజులపాటు మారటోరియం విధించింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఈ మీడియా సంస్థపై ఉన్న ఇతర కేసుల విచారణ 180 రోజులపాటు నిలిచిపోనుంది. డెక్కన్ క్రానికల్‌కు రుణమిచ్చిన కెనరా బ్యాంకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుకు డెక్కన్ క్రానికల్ రూ.723.75 కోట్లు బాకీ పడింది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ 2016 ప్రకారం దివాలా ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇంటెరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌కు డెక్కన్ క్రానికల్ బోర్డుపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఐఆర్పీ నిర్దేశిత సమయంలో రుణదాతలతో చర్చించడంతోపాటు బాకీ పడ్డ కంపెనీ ఆర్థిక స్థితిని అధ్యయనం చేసి మూసివేయాలా లేదా పునరుద్ధరించాలా అన్న అంశాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. నిజానికి డెక్కన్క్రానికల్కు కెనరా బ్యాంక్‌తో పాటు పలు ఇతర బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థలు కూడా రుణాలు మంజూరు చేశాయి.