డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ మొదలైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మేరకు తాత్కాలిక పరిష్కార నిపుణుడిని (ఐఆర్‌పీ) నియమించింది. అలాగే 180 రోజులపాటు మారటోరియం విధించింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఈ మీడియా సంస్థపై ఉన్న ఇతర కేసుల విచారణ 180 రోజులపాటు నిలిచిపోనుంది. డెక్కన్ క్రానికల్‌కు రుణమిచ్చిన కెనరా బ్యాంకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుకు డెక్కన్ క్రానికల్ రూ.723.75 కోట్లు బాకీ పడింది.
ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ కోడ్ 2016 ప్రకారం దివాలా ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇంటెరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌కు డెక్కన్ క్రానికల్ బోర్డుపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఐఆర్‌పీ నిర్దేశిత సమయంలో రుణదాతలతో చర్చించడంతోపాటు బాకీ పడ్డ కంపెనీ ఆర్థిక స్థితిని అధ్యయనం చేసి మూసివేయాలా లేదా పునరుద్ధరించాలా అన్న అంశాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. నిజానికి డెక్కన్‌క్రానికల్‌కు కెనరా బ్యాంక్‌తో పాటు పలు ఇతర బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థలు కూడా రుణాలు మంజూరు చేశాయి.