విశాఖపట్నం, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రతీకార దాడులు మరో మలుపు తిరిగాయి. నిష్పక్షపాతంగా కథనాలు రాసే మీడియా సంస్థలనూ ఎల్లో బ్యాచ్ వదలడం లేదు. తాజాగా.. ఇవాళ నగరంలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి తెగబడ్డారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని డీసీ ఈ మధ్య ఒక వార్తను ప్రచురించింది. దీంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు దౌర్జన్యానికి తెగబడ్డాయి. టీడీపీకి సంబంధించిన టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ విభాగాలు.. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించాయి. ఒక్కసారిగా లోపలికి చొచ్చుకుపోవాలని చూశాయి.
ఈ క్రమంలో సిబ్బంది అడ్డుకోవడంతో.. వాళ్లలో టీడీపీ కేడర్ వాగ్వాదానికి దిగారు. ఆపై ఆగ్రహంతో టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన కొందరు సంస్థ కార్యాలయంపై రాళ్లు రువ్వి.. బయట ఆ సంస్థ బోర్డును కాల్చేశారు. భవిష్యత్తులో ఇలాంటి కథనాలు రాస్తే.. బాగోదంటూ హెచ్చరిస్తూ వాళ్లు బహిరంగంగానే నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో డీసీ సంస్థ ఫిర్యాదు చేసింది. ఇలాంటి చర్యలు తమ కర్తవ్యాల్ని ఆపలేవంటూ డీసీ తన ఎక్స్‌ఖాతాలో సందేశం ఉంచింది.
.@JaiTDP goons attacked Deccan Chronicle office after we published an unbiased report on VSP privatisation
Intimidation tactics won’t silence us, @JaiTDP, @BJP4India, @JanaSenaParty...
#PressFreedom #StandWithJournalism pic.twitter.com/RTh0rE0kMB— Deccan Chronicle (@DeccanChronicle) July 10, 2024
దాడిని ఖండించిన జర్నలిస్ట్ యూనియన్లు
ఇదిలా ఉంటే.. క్రానికల్ కార్యాలయంపై టీడీపీ అనుబంధ విభాగాల దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ) ఏపీయూడబ్ల్యూజే ఖండించింది. ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు కొందరు విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’’ అని యూనియన్ పోలీస్ శాఖను కోరింది.
అలాగే.. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా తమ కార్యకర్తలను అదుపుచేయాలని రాజకీయ పార్టీలకూ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ,ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఎ.పి.ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. మరోవైపు..
ప్రజాస్వామ్యంలో దాడులనేవే సమంజసం కాదని జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ (జాప్ )అంటోంది. డెక్కన్ క్రానికల్ పై దాడిని ఖండింస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఒక వార్త తమకు వ్యతిరేకంగా వచ్చిందని దాడికి దిగారు. విశాఖలోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై రాళ్లు విసిరి, సంస్థ బోర్డును తగలబెట్టడం పత్రికా కార్యాలయంలో పనిచేసేవారితో పాటు ప్రజాస్వామ్య వాదులను భయాందోళనకు గురిచేసింది. దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణిస్తున్నాం.
.. దాడికి పాల్పడిన బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమ కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ఈ తరహా దాడులు ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధం. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇలాంటి సంఘటనల్ని సమర్థించరని భావిస్తున్నాం అని జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నంరాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డిలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment