IRP
-
చిక్కుల్లో ల్యాంకో బబంధ్ పవర్...
సాక్షి, హైదరాబాద్: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ చిక్కుల్లో పడింది. ల్యాంకో బబంధ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సానుకూలంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1428 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ల్యాంకో బబంధ్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా (ఐఆర్పీ) ముంబాయికి చెందిన యు.బాలకృష్ణ భట్‌ను నియమించింది. ల్యాంకో బబంధ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది కూడా. ఇప్పటికే ఏవైనా ఆస్తులను తాకట్టుపెట్టి ఉంటే వాటిని విక్రయించడం గానీ, తాకట్టు పెట్టుకున్న వారు ఆ ఆస్తులను సర్ఫేసీ చట్టం కింద అమ్మడం గానీ చేయరాదని స్పష్టంచేసింది. దివాలా ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ మారటోరియం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ జుడీషియల్ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐఆర్పీలు.. అడ్డగోలు ఫీజులు
సాక్షి, హైదరాబాద్: పావలా కోడికి ముప్పావలా మసాలా చందంగా తయారైంది దివాలా పరిష్కారదారు(ఐఆర్పీ)ల తీరు. నిర్దిష్టమైన నిబంధనలు, మార్గదర్శకాలు లేకపోవడంతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇటీవల మధుకాన్ కంపెనీ దివాలా ప్రక్రియలో ఐఆర్పీ కోరుతున్న ఫీజు చెల్లించాల్సిన రుణానికి 3 రెట్లు ఎక్కువగా ఉండటంతో విస్మయం వ్యక్తం చేసిన హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ).. ఈ వ్యవహారాన్ని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డు (ఐబీబీఐ)కు నివేదించింది. సమస్యకు పరిష్కారం చూపి ఫీజు ఎక్కువగా ప్రతిపాదించిన ఐఆర్‌పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఎన్సీఎల్టీ సభ్యులు విత్తనాల రాజేశ్వరరావు, రవికుమార్ దురైస్వామిల ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మధుకాన్ సంస్థ తీసుకున్న రుణం రూ.4.17 కోట్లు చెల్లించడంలో విఫలమైనందుకుగాను దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ ఎన్సీఎల్టీలో ముంబైకి చెందిన శ్రీకృష్ణ రైల్ ఇంజనీర్స్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించి దివాలా పరిష్కారదారుగా నియమితులైన భావనా సంజయ్ రుయా.. రుణదాతల కమిటీ మొదటి సమావేశం వరకు రూ.5 కోట్లు, తర్వాత నెలకు రూ.1.75 కోట్ల ఫీజు చెల్లించాలని ప్రతిపాదించారు. మధుకాన్ చెల్లించాల్సిన రుణం వడ్డీ సహా రూ.4.17 కోట్లేనని ధర్మాసనం తెలిపింది. మధుకాన్ ఎండీ, సీఈవోల వేతనం ఏడాదికి రూ.60 లక్షలు, పూర్తిస్థాయి డైరెక్టర్ల వేతనం రూ.50 లక్షలు.. వీరి వేతనాలు ఏడాదికి రూ.1.10 కోట్లు అవుతుందని, ఐఆర్పీ మాత్రం రూ.14 కోట్లు ఫీజుగా ప్రతిపాదించారని ఆక్షేపించింది. ఐఆర్పీ భావనా రుయా పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్ రుయా భార్యని.. సంజయ్ కూడా ఐఆర్‌పీగా రూ.85 లక్షలు ఫీజు ప్రతిపాదించగా రూ.9లక్షలకు తగ్గించినట్లు గుర్తు చేసింది. భావన ప్రతిపాదించిన అసాధారణ ఫీజుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఐబీబీఐకి సిఫార్సు చేసింది. -
డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ షురూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీడియా సంస్థ డెక్కన్ క్రానికల్ దివాలా ప్రక్రియ మొదలైంది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మేరకు తాత్కాలిక పరిష్కార నిపుణుడిని (ఐఆర్పీ) నియమించింది. అలాగే 180 రోజులపాటు మారటోరియం విధించింది. ట్రిబ్యునల్ తీర్పుతో ఈ మీడియా సంస్థపై ఉన్న ఇతర కేసుల విచారణ 180 రోజులపాటు నిలిచిపోనుంది. డెక్కన్ క్రానికల్‌కు రుణమిచ్చిన కెనరా బ్యాంకు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుకు డెక్కన్ క్రానికల్ రూ.723.75 కోట్లు బాకీ పడింది. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ 2016 ప్రకారం దివాలా ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇంటెరిమ్ రిజొల్యూషన్ ప్రొఫెషనల్‌కు డెక్కన్ క్రానికల్ బోర్డుపై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఐఆర్పీ నిర్దేశిత సమయంలో రుణదాతలతో చర్చించడంతోపాటు బాకీ పడ్డ కంపెనీ ఆర్థిక స్థితిని అధ్యయనం చేసి మూసివేయాలా లేదా పునరుద్ధరించాలా అన్న అంశాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. నిజానికి డెక్కన్క్రానికల్కు కెనరా బ్యాంక్‌తో పాటు పలు ఇతర బ్యాంకులు, ప్రయివేటు ఆర్థిక సంస్థలు కూడా రుణాలు మంజూరు చేశాయి.