చిక్కుల్లో ల్యాంకో బబంధ్‌ పవర్‌...   | Lanco Babandh faces insolvency proceedings; NCLT appoints IRP | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో ల్యాంకో బబంధ్‌ పవర్‌...  

Published Thu, Aug 30 2018 1:47 AM | Last Updated on Thu, Aug 30 2018 4:54 AM

Lanco Babandh faces insolvency proceedings; NCLT appoints IRP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ల్యాంకో గ్రూపునకు చెందిన మరో కంపెనీ చిక్కుల్లో పడింది. ల్యాంకో బబంధ్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) సానుకూలంగా స్పందించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.1428 కోట్లను తిరిగి చెల్లించడంలో విఫలమైనందున ల్యాంకో బబంధ్‌ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార ప్రక్రియ నిపుణుడిగా (ఐఆర్‌పీ) ముంబాయికి చెందిన యు.బాలకృష్ణ భట్‌ను నియమించింది. ల్యాంకో బబంధ్‌ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది కూడా.

ఇప్పటికే ఏవైనా ఆస్తులను తాకట్టుపెట్టి ఉంటే వాటిని విక్రయించడం గానీ, తాకట్టు పెట్టుకున్న వారు ఆ ఆస్తులను సర్ఫేసీ చట్టం కింద అమ్మడం గానీ చేయరాదని స్పష్టంచేసింది. దివాలా ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ మారటోరియం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన వివరాలతో పత్రికా ప్రకటన జారీ చేయాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ జుడీషియల్‌ సభ్యులు బిక్కి రవీంద్రబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.   



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement