విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.
ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్‌పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.
ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్‌సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.
ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.
మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.
ఇక సంగతి ఏమిటి?
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్‌పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!
ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్‌కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్‌లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.
నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్‌లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.
కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖ స్టీల్‌పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment