ఏపీలో మొదలైన ముసళ్ల పండగ | KSR Comments On The Current Regime Of Andhra Pradesh TDP Govt | Sakshi
Sakshi News home page

ఏపీలో మొదలైన ముసళ్ల పండగ

Published Fri, Jun 28 2024 2:02 PM | Last Updated on Fri, Jun 28 2024 2:41 PM

KSR Comments On The Current Regime Of Andhra Pradesh TDP Govt

గతంలో ఒక ప్రచార ప్రకటన వచ్చేది. ఈ నగరానికి ఏమైంది.. ఎటు చూసిన పొగ, నుసి.. అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. అది కాలుష్యానికి సంబంధించినది అయితే, ఇప్పుడు ఆంద్రప్రదేశ్ కు కూడా ఆ ప్రకటన సూట్ అయ్యేలా ఉంది. ఏపీలో ఎటు చూసినా జరుగుతున్న విధ్వంసం, హింసాకాండ గమనించిన తర్వాత ఈ ప్రకటన మాదిరే ఏపీ తయారైందన్న అభిప్రాయం కలుగుతుంది. 

ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేసేది. కోడ్ అమలులోకి రావడంంతోనే అన్నీ తలకిందులు అవడం ఆరంభమైంది. ప్రభుత్వాన్ని సజావుగా నడవనివ్వకుండా తెలుగుదేశం, జనసేన,  బీజేపీలు అన్ని ప్రయత్నాలు చేసేవి. ఎన్నికల కమిషన్ కూడా ఆ కూటమికి తన వంతు సాయం అందించింది. వలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా వృద్దులు పెన్షన్ పొందడానికి నానా పాట్లు పడేలా చేశారు.

అవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతోనే హింసాకాండ, విద్వంసం వంటివి రాజ్యమేలాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన అరాచక శక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాయి. ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వంటివారు వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ పరిణామాలపై స్పందించకుండా కథ నడుపుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పరస్పరం పొగుడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరో వైపు ఏపీ వ్యాప్తంగా పారిశుద్ద్యం కొరవడి డయారియా వంటి వ్యాధులు ప్రబలాయి. నీటి కాలుష్యం తోడవుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటివి వస్తే వెంటనే వలంటీర్లు ఆరా తీసి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వానికి సమాచారం అందించేవారు. కరోనా వంటి పెద్ద సంక్షోభాన్ని సైతం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆ ప్రభుత్వం ఎదుర్కుంది. కానీ గత పది, పదిహేను రోజులుగా ఈ విషయాలను పట్టించుకున్నవారే ఉన్నట్లు లేరు. కాకినాడ, జగ్గయ్యపేట, నంద్యాల మొదలైన చోట్ల గ్రామాలలో అతిసార వ్యాపించి పది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పరామర్శించారు.

అదొక్కటే సరిపోదు. గ్రామాలలో కలుషిత సమస్య ఎందుకు వచ్చిందో పరిశీలించి చర్యలు చేపట్టాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి ఉండాలి. కానీ ఆయన ఇది తన శాఖకు సంబంధించింది కాదనుకున్నారో, ఏమో కానీ గ్రామాలలో పారిశుధ్ద్యంపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చి గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే పట్టణాలలో అయితే మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించి సిబ్బందితో పని చేయించాలి. లేకుంటే ఈ సమస్యమరింత ప్రబలుతుంది.

ఇక్కడ మరో సంగతి చెప్పాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ టైమ్ లో ఎక్కడైనా కలుషిత సమస్య వచ్చి ఒకరిద్దరు మరణించినా, కొంతమంది ఆస్పత్రిలో చేరినా దానిని బూతద్దంలో చూపించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రస్తుతం తెలుగుదేశం ఏలుబడిలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇవ్వకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఇంకో వైపు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి వందల కోట్ల ఆదాయం తీసుకువస్తే, ప్రస్తుతం అది అంతా అక్రమార్కుల పాలవుతున్నట్లుగా ఉంది.

వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి టైమ్ లో పోగుచేసిన ఇసుక గుట్టలు, గుట్టలుగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఆ ఇసుకను గతంలో ఒక సిస్టమ్ ప్రకారం విక్రయించేవారు. టీడీపీ కూటమి ఇసుకను ఉచితం చేస్తామని హామీ ఇచ్చింది. అది అక్రమార్కులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారు ఆయా చోట్ల విజృంభించి అందుబాటులో ఉన్న ఇసుకను తమ ఇష్టారీతిన అమ్ముకుంటున్నారట. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఇలా లారీ ఒక్కింటికి పదమూడు వేల రూపాయల నుంచి పదహారువేల రూపాయల వరకు వసూలు చేసుకుంటూ అక్రమ రవాణా చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. వీటిపై ప్రభుత్వం స్పందించినట్లు కనిపించలేదు. ఈసరికే సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ఇసుక టీడీపీ, జనసేనలకు చెందిన నేతల పరమైందని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం పనిచేస్తోందో, లేదో అన్నట్లుగా పరిస్థితి ఉంటే అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదు.

ఇదిలా ఉంటే కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత తేలికకాదు. దాంతో ఆ అంశాలను డైవర్ట్ చేసే లక్ష్యంతో కూటమి పెద్దలు, వారికి సపోర్టు చేసే మీడియా కలిసి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పైన, వైఎస్సార్‌సీపీపైన పలు కథలు సృష్టించి జనం మీదకు వదలుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారం చేసిన ఐదేళ్లు వీరు వెంటాడారు. ఓటమి తర్వాత కూడా అదే పనిచేస్తున్నారు. ఉన్నవి, లేనివి కలిపి అబద్దాలను వండి ప్రజలపై రుద్దుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఆఫీస్ ల నిర్మాణంలో ఏవో అక్రమాలు జరిగాయని, అనుమతులు లేకుండా నిర్మించారంటూ స్టోరీలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రభుత్వ స్థలాలు తీసుకున్నట్లు, తెలుగుదేశం అసలు తీసుకోనట్లు చిత్రీకరిస్తున్నారు.

మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్య కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైఎస్సార్‌సీపీ ఆయా జిల్లాలలో నిర్మించిన భవనాలను పాలస్ లతో పోల్చుతూ వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేశారు. విశేషం ఏమిటంటే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు ఇవ్వడానికి అధిక చొరవ తీసుకున్నది చంద్రబాబు నాయుడే. 1997లో ఉమ్మడి ఏపీలో ఎన్.టి.ఆర్ ట్రస్ట్ పేరుతో హైదరాబాద్ లో కెబిఆర్ పార్కు ఎదుట అత్యంత ఖరీదైన హుడా భూమిని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నది చంద్రబాబు నాయుడే. అందులో పార్టీ ఆఫీస్ ను నడిపింది ఆయనే. అది ఏమీ చిన్న ఇల్లు కాదు. ఒక భారీ భవంతి.

ఆ రోజుల్లో విపక్ష నేతగా ఉన్న పి జనార్ధనరెడ్డి ప్రభుత్వ భూమిని టీడీపీ ఆఫీస్ కు కేటాయించుకోవడంపై పెద్ద పోరాటమే చేశారు. కానీ అదేమి ఫలించలేదు. బహుశా లోకేష్ కు ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన అప్పటికి విద్యార్ధిగానే ఉన్నారు. ఆ తర్వాత విభజిత ఏపీలో పలు జిల్లాలలో ప్రభుత్వ భూములలో, కొన్నిచోట్ల అస్సైన్డ్ భూములలో కూడా పార్టీ ఆఫీస్ లు నిర్మించుకున్నారు. ఇందుకోసం జీఓలు కూడా ఇచ్చారు. అంతదాకా ఎందుకు!? పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లి వద్ద చెరువు, డొంక ప్రాంతం కూడా కొంత ఆక్రమించి నిర్మించారన్న అభియోగాలు ఉన్నాయి. తీసుకున్న అనుమతులు మించి అంతస్తులు కట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఇది కానీ, జిల్లాలలో నిర్మించిన భవనాలు కూడా చిన్నవేమీ కాదు.

లోకేష్ పరిభాష ప్రకారమే అయితే అవి కూడా పాలస్ లే అవుతాయి. రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలు నిర్మించుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.  అలాకాకుండా పొరపాట్లు చేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. దీనిని బూతద్దంలో చూపుతూ టీడీపీ కథ నడుపుతోంది. అనేకమార్లు బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు తెచ్చే ప్రభుత్వాలు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ లకు కొంత సమయం ఇచ్చి ఒకవేళ భవనాలకు అనుమతి లేనట్లయితే వాటిని రెగ్యులరైజ్ చేస్తే పద్దతిగా ఉంటుంది. ఎందుకంటే ఇవేమీ ఆక్రమిత స్థలాలు కావు. ఈ భవనాల నిర్మాణ సమయంలో అధికారులు ప్రేక్షకపాత్ర పోషించారని తేలుతున్నందున ఆ బిల్డింగ్ లను క్రమబద్దం చేస్తే బెటర్. కాకపోతే గురివింద గింజ తన నలుపు తెలుసుకోలేదన్నట్లుగా, టీడీపీ వారు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం.

నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయడం ద్వారా తమ విధ్వంస పాలన ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపించారు. పదిహేను రోజులుగా వైఎస్సార్‌సీపీ వారి ఆస్తులు, రైతు భరోస కేంద్రాలు, సచివాలయాల భవనాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు, ఇప్పుడు ప్రభుత్వపరంగా కూడా ధ్వంస రచన సాగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లు తాము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు. ఏదో అరకొరగా చేసి జనాన్ని మభ్యపెట్టే ఆలోచనలే సాగిస్తున్నారన్న అనుమానం ప్రజలలో ఉంది. కొన్ని స్కీములను ఎలా వాయిదా వేయాలా? అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు.

ఉదాహరణకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని అమలు చేసే విషయం పరిశీలనకు మరో నెల పడుతుందని రవాణశాఖ మంత్రి రామ్ ప్రసాదరెడ్డి చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు రోజులలోనే ఉచిత బస్ స్కీమ్ ను అమలు చేసింది. ఏపీలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. నిజానికి ఏపీలోనే ఈ స్కీము అమలు చేయడం తేలిక. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి మార్చడం ద్వారా ఆ సంస్థకు చాలా వెసులుబాటు కల్పించింది. అంటే జీతాల భారం తగ్గిందన్నమాట. అయినా ఈ స్కీమును అమలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అనేదానికి సరైన కారణం కనిపించదు.

ఇలా ఒకటి కాదు.. ఎన్నో విషయాలలో ప్రభుత్వం తీరు అలాగే ఉంది. ప్రజలు నిజంగా గెలిపించారో, లేక ఈవిఎమ్ ల మాయ ఏమైన ఉందో తెలియదు కానీ, టీడీపీ ప్రభుత్వం ఇకనైనా ఈ విధ్వంసపాలన ఆపి ప్రజోపయోగ కార్యక్రమాలకు దిగితే మంచిది.


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement