న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది.
చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది.
కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ
సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment