న్యూఢిల్లీ: దివాలా పరిష్కార వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రక్రియలను వేగవంతం చేయడంలో సహాయపడేలా తగిన వాతావారణం నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జాయింట్ సెక్రటరీ అనితా షా అకెల్లా తెలిపాయి.
ఎనిమిది సంవత్సరాల క్రితం– 2016లో అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ (ఐబీసీ) సంబంధిత ఆస్తులకు మార్కెట్–లింక్డ్ అలాగే టైమ్–బౌండ్ (మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, సకాలంలో సమస్య పరిష్కారం జరిగేలా చర్యలు) పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పరిష్కార ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఐబీసీ రికవరీ మెకానిజం కాదు: అనితా షా అకెల్లా
అనితా షా అకెల్లా ఈ విషయంపై మాట్లాడుతూ, ఐబీసీ రికవరీ మెకానిజం కాదని, రెస్క్యూ మెకానిజం అని ఉద్ఘాటించారు. ఐసీఏఐకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఎనిమిదో వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో జరిగిన ఒక సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఐబీసీ పరిష్కార యంత్రాంగాన్ని మరింత మెరుగుపరచడానికి తీసుకున్న వివిధ చర్యలను ప్రస్తావించారు. అయితే కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దివాలా పరిష్కార యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడానికి ఒక సమగ్ర ‘ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫామ్’ ఏర్పాటుకు కృషి చేస్తోందన్నారు.
ప్లాట్‌పామ్ ఇలా...
ప్రతిపాదత ఇంటిగ్రేడెడ్ ఫ్లాట్‌ఫామ్.. ఒక ఫెడరేటెడ్ ఆర్కిటెక్చర్ అనీ, ఇది అవసరమైనప్పుడు తగిన డేటాను అందించగలుగుతుందని అనితా షా అకెల్లా తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇన్‌సాల్వెన్సీ ప్రొఫెషనల్స్‌తో పాటు సంబంధిత అన్ని వర్గాలనూ ఒకే వేదికలాగా కలిపి ఉంచుతుందన్నారు. యాప్‌లో ఆలస్యం, హెచ్చరికల వంటి సందర్భాల్లో రెడ్ ఫ్లాగ్‌లు వంటి వివిధ ఫీచర్లు ఇందులో ఉంటాయని ఆమె తెలిపారు.
ప్రస్తుత దివాలా కేసుల తీరిది...
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్‌సభ తెలిపిన సమాచారం ప్రకారం, మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment