15,724 ఇవేవో అంకెలనుకుంటే పొరబడినట్లే. అమెరికాలో దివాళా తీసిన సంస్థల సంఖ్య. ఆ జాబితాలో తాజాగా వివర్క్ చేరింది. పైన పేర్కొన్న సంస్థలు ప్రాజెక్ట్‌ల కొరత, ఆర్ధిక మాంద్యం కారణంగా అప్పులు పాలైతే.. వివర్క్ మాత్రం అలా కాదు. ఆ కంపెనీ కో-ఫౌండర్, మాజీ సీఈఓ ఆడమ్ న్యూమాన్ 4 ఏళ్ల క్రితం తీసుకున్న మతిలేని నిర్ణయం వల్ల లక్షల కోట్ల కంపెనీ కాస్త అప్పుల కుప్పగా మారింది. ఇంతకి వివర్క్‌లో ఏం జరిగింది? ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం పదండి.
అమెరికాకు చెందిన ప్రముఖ కోవర్కింగ్ స్టార్టప్ 'వివర్క్' అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివర్క్ ఒకానొక దశలో రూ. 3. 91 లక్షల కోట్లు (47 బిలియన్ల) విలువైన స్టార్టప్‌గా అవతరించింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ విలువ భారీగా పడిపోవడంతో చేసేది లేక ఉన్న అప్పుల్ని తీర్చలేమంటూ న్యూజెర్సీ న్యాయ స్థానంలో చాప్టర్ 11 దివాళా పిటిషన్ దాఖలు చేసింది. వివర్క్ సీఈఓ డేవిడ్ టోల్లే తరుపున ప్రముఖ లా సంస్థ కాడ్వాలాడర్, వికర్‌షామ్ అండ్ టాఫ్ట్ దివాలా ఫైలింగ్‌ను నమోదు చేసింది.
వివర్క్ అమెరికా, కెనడాలలో 10 బిలియన్ల నుంచి 50 బిలియన్ల అప్పులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు తాము గతంలో చేపట్టిన నాన్ ఆపరేషనల్ లీజింగ్ ఒప్పొందాలను తగ్గించుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించింది.
సిలికాన్ వ్యాలీలో సంచలనం
అయితే లక్షల కోట్ల కంపెనీ ఎదిగి ఓకానొక దశలో సిలికాన్ వ్యాలీలో సంచలనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ స్టార్టప్ అప్పుల కుప్పగా మారడానికి కారణం వివర్క్ మాజీ కో-ఫౌండర్,సీఈఓ ఆడమ్ న్యూమాన్ తీసుకున్న మతిలేని నిర్ణయమే కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
అది ఆగస్ట్ 14 2019, న్యూయార్క్ నగరం. సమయం ఉదయం 7:12 గంటలు. అప్పుడే వివర్క్ ఐపీవోకి వెళుతుందంటూ ఆ సంస్థ సీఈవో ఆడమ్ న్యూమన్ ఐపీవో కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ వెబ్‌సైట్‌ట్‌లో దాఖలు చేశారు. ఓవైపు విజృంభిస్తున్న మాయదారి కరోనా మహమ్మారి. పైగా లాక్‌డౌన్. ఆపై తినడానికి తిండి లేక సామాన్యుల అవస్థలు. ఆక్సీజన్ అందక ప్రాణాలు పోతున్నాయని గగ్గొలు పెట్టిన ప్రభుత్వం స్పందించలేని దుస్థితి. ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో సామాన్యులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారా?
ప్రపంచాన్ని మారుస్తా
కానీ ఆడమ్ న్యూమాన్ మాత్రం రూ. 3. 91 లక్షల కోట్లు కంపెనీ ఐపీవోకి వెళుతుంది. మా లక్ష్యం డబ్బు సంపాదించడం లేదా కార్యాలయ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం మాత్రమే కాదు ‘ప్రపంచాన్ని మార్చడం’ అని పేర్కొన్నాడు. ఈ ప్రకటనే.. సముద్రంలో గులకరాయి ఎంతటి అలజడని సృష్టిస్తుందో..ఆడమ్ నిర్ణయంతో అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో తీవ్ర అలజడిని రేపింది. దీంతో దిగ్గజ కంపెనీలు ఆడమ్ నిర్ణయంపై ముక్కున వేలేసుకుంటే.. ఆర్ధిక వేత్తలు వివర్క్ సీఈఓది మతిలేని చర్య అంటూ మండి పడ్డారు.
వెనక్కి తగ్గలేదు
అయినా, ఆడమ్ వెనక్కి తగ్గలేదు. ఐపీవోకి వెళ్లే ముందు ఆయా కంపెనీలు వాటి స్థితిగతుల గురించి పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తాయి. ఆడమ్ సైతం అదే పనిచేశారు. అందులో కంపెనీ 2019 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 900 మిలియన్లు నష్టపోగా ఆదాయం 1.54 బిలియన్లని పేర్కొంది. లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడంతో షేర్లు భారీగా పతనమయ్యాయి.
చేసేది లేక సెప్టెంబరు 17, 2019న, వివర్క్ మాతృ సంస్థ దివి కంపెనీ ఐపీవోని ఏడాది చివరి నాటికి వాయివా వేయాలని నిర్ణయించింది. ఫలితంగా వివర్క్ బుడగ టప్ మని పేలింది. కంపెనీ సైతం విలువ అమాంతం కరిగింది. ఆడమ్ మాత్రం భారీ లాభాల్ని అర్జించారు. ఆయన ఆస్తి రెండింతలైంది. ముందుగా చెప్పినట్లుగానే సెప్టెంబరు 24, 2019 ఐపీవోని నిలిపివేసింది. కో-ఫౌండర్ సీఈఓ ఆడమ్ న్యూమాన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ నుంచి వెళ్లిపోయారు.
అలా.. నాటి నుంచి వివర్క్ పడ్తూ లేస్తూ కొనసాగింది. సాఫ్ట్‌బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలు ఎంత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినా లాభం లేకపోయింది. తాజాగా అప్పులు పెరిగిపోయి వాటిని తీర్చలేక దివాలా తీస్తూ కోర్టును ఆశ్రయించడం స్టార్టప్ పరిశ్రమలో మాయని మచ్చగా నిలిచిపోయింది.
మొత్తం 15,724 కంపెనీల దివాలా
అమెరికా సంస్థల దివాలా ఫైలింగ్ డేటాను అందించే ఎపిక్ దివాలా (Epiq Bankruptcy) డేటా ప్రకారం.. ఈ ఆగస్టులో మొత్తం 2,328 మొత్తం సంస్థలు దివాలా ఫైలింగ్ చేశాయి. గత ఏడాది జులై 14 శాతం నుంచి ఆగస్ట్ నెలలో 17 శాతం పెరిగినట్లు డేటా హైలెట్ చేసింది. ఇక ఈ ఏడాది జూన్ 30, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15,724 దివాలాలు దాఖలైనట్లు అమెరికా దివాలా కోర్టు నివేదించింది. ఇది గత సంవత్సరం కంటే 23శాతం పెరిగినట్లు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment