ibc
-
ఐబీసీ రికవరీలు తగ్గుతున్నాయి
ముంబై: దివాలా చట్టాన్ని (ఐబీసీ) ప్రవేశపెట్టిన తర్వాత రుణాల చెల్లింపు సంస్కృతి కొంత మెరుగుపడినప్పటికీ, గత కొన్నేళ్లుగా రికవరీలు క్రమంగా తగ్గుతున్నాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. పైగా పరిష్కారానికి పట్టే సమయం పెరిగిపోతోందని ఒక నివేదికలో పేర్కొంది. ఐబీసీ ప్రవేశపెట్టాక గత ఏడేళ్ల పరిస్థితి చూస్తే 2019 మార్చిలో 43 శాతంగా ఉన్న రికవరీల రేటు 2023 సెప్టెంబర్ నాటికి 32 శాతానికి పడిపోయిందని వివరించింది. అదే సమయంలో పరిష్కార ప్రక్రియకు పట్టే సమయం సగటున 324 రోజుల నుంచి 653 రోజులకు పెరిగిందని పేర్కొంది. న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత, డిఫాల్ట్‌లను గుర్తించడంలో జాప్యం మొదలైన సమస్యలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని వివరించింది. సాధారణంగా ఐబీసీ కేసులు 330 రోజుల్లో పరిష్కారం కావాలి. గత ఏడేళ్లలో 808 కేసుల్లో చిక్కుకుపోయిన రూ. 3.16 లక్షల కోట్ల మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఐబీసీ సహాయపడిందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. ఐబీసీతో రుణ గ్రహీతల ప్రవర్తనలో గణనీయంగా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు చేజారిపోతాయేమోనన్న భయాల కారణంగా ఐబీసీ వద్దకు రావడానికి ముందే రూ. 9 లక్షల కోట్ల పైచిలుకు మొండిబాకీల కేసులు పరిష్కారమైనట్లు మఖీజా చెప్పారు. ఐబీసీ ద్వారా గత ఏడేళ్లలో పరిష్కారమైన వాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని ఆయన పేర్కొన్నారు. గత చట్టాల కింద రుణాల రికవరీ రేటు సగటున 5–20 శాతంగానే ఉండేదని, వాటితో పోలిస్తే ఐబీసీ కింద పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. -
దివాలా కోడ్ అమలుతో...కార్పొరేట్ ‘రుణ’ ఫ్యూడలిజానికి ముగింపు!
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది. చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది. కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. -
దివాలా చట్టంతో రూ.60 వేల కోట్ల వసూలు!
ముంబై: దివాలా చట్టం (ఐబీసీ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రుణదాతలు దాదాపు రూ. 55,000-రూ. 60,000 కోట్ల దాకా రాబట్టుకోగలిగే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. 2020-21లో ఐబీసీలో భాగమైన కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళిక(సీఐఆర్‌పీ) ద్వారా రుణదాతలకు రూ.26,000 కోట్లు మాత్రమే వచ్చాయని.. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు పావు వంతేనని తెలిపింది. ‘విజయవంతంగా పూర్తయ్యే సీఐఆర్పీల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రుణదాతలు రూ. 55,000 - రూ. 60,000 కోట్ల దాకా వసూలు చేసుకోగలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ దఫ్రియా పేర్కొన్నారు. 8-9 భారీ పద్దుల పరిష్కారంపైనే నికరంగా ఎంత వచ్చేది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. వీటి నుంచి సుమారు 20 శాతం పైగా రావాల్సి ఉంటుందని వివరించారు. అంచనాలపై సెకండ్ వేవ్ ప్రభావం.. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి తగ్గకపోతే పరిష్కార ప్రక్రియల అమలు(ముఖ్యంగా చిన్న స్థాయి సంస్థలకు) నెమ్మదించే అవకాశం ఉందని దఫ్రియా చెప్పారు. దీనివల్ల రుణదాతలు మరింత ఎక్కువ వదులుకోవాల్సి రావచ్చన్నారు. ఫలితంగా రికవరీ అంచనాలపైనా ప్రతికూల ప్రభావం పడగలదని దఫ్రియా వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా సీఐఆర్‌పీలో భాగమైన వివిధ వర్గాల విధుల నిర్వహణలో సవాళ్లు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల పరిష్కారమయ్యే కేసుల సంఖ్య తగ్గింన్నారు. గత ఆర్థిక సంవత్సరం కొత్త కేసులపై విచారణ పూర్తిగా నిలిపివేయడంతో.. పరిష్కార ప్రక్రియ నెమ్మదించిందని వివరించారు. ఐబీసీతో సానుకూల ప్రయోజనాలే.. నివేదిక ప్రకారం 2016 డిసెంబర్ నుంచి 4,376 సీఐఆర్పీలను విచారణకు స్వీకరించగా.. 2021 మార్చి ఆఖరు నాటికి 2,653 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. అయితే, జాప్యం ఉన్నప్పటికీ .. ఐబీసీ వల్ల సానుకూల ప్రయోజనాలే కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. ‘నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణకు స్వీకరించిన కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు అప్పీలుకు వెళ్లినప్పుడు సెటిల్ చేయడమో లేదా ఉపసంహరించుకోవడమో జరిగింది. ఐబీసీ కింద చర్యలు ఎదుర్కోవడం ఇష్టం లేక కనీసం కొంత మంది ప్రమోటర్లయినా బాకీలు చెల్లించడానికి ముందుకు వస్తున్నారనడానికి ఇది నిదర్శనం‘ అని పేర్కొంది. పరిష్కారమైన కేసుల విషయంలో రుణ దాతలకు.. క్లెయిమ్ చేసిన మొత్తంలో సగటున 39 శాతం దాకా చేతికొచ్చింది. రాబోయే రోజుల్లో పరిష్కార ప్రణాళికకు పట్టే సమయాన్ని మరింతగా తగ్గించడం, వేలం వేసే అసెట్స్‌పై మార్కెట్ వర్గాల్లో ఆసక్తిని పెంచడం వంటి అంశాలు ప్రస్తుత పరిస్థితుల్లో సవాళ్లుగా ఉండనున్నాయని నివేదిక పేర్కొంది. చదవండి: ఆన్లైన్లో లీకైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ఫీచర్స్, ధర -
అన్ని రంగాల్లో ప్రైవేటు సంస్థలకు ఎంట్రీ
న్యూఢిల్లీ: కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. వ్యూహాత్మక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలను (పీఎస్‌యూ) గరిష్టంగా నాలుగింటికే పరిమితం చేయనుంది. మిగతావాటన్నింటినీ విలీనం చేయడమో లేదా విక్రయించడమో చేయనుంది. వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలన్నింటినీ ప్రైవేటీకరించనుంది. ఈ మేరకు కొత్తగా పీఎస్‌యూ విధానాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు ఉద్దేశించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తుది విడత చర్యల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం వెల్లడించారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి) ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీఎస్‌యూలను తప్పనిసరిగా కొనసాగించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక రంగాల వివరాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ రంగాల్లోనూ ప్రైవేట్ సంస్థలను అనుమతించినప్పటికీ కనీసం ఒక్క పీఎస్‌యూనైనా కొనసాగిస్తారు. ఇక వ్యూహాత్మకయేతర రంగాల్లో పీఎస్‌యూలను సాధ్యాసాధ్యాలను బట్టి తగు సమయంలో ప్రైవేటీకరిస్తామని మంత్రి చెప్పారు. ‘స్వయం సమృద్ధిని సాధించే క్రమంలో దేశానికి సమగ్రమైన విధానం అవసరం. ఇది దృష్టిలో ఉంచుకునే కొత్త పీఎస్‌యూ విధానంలో అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలను అనుమతించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పీఎస్‌యూలు అర్థవంతమైన పాత్ర పోషిస్తున్న వ్యూహాత్మక రంగాల్లో వాటిని కొనసాగిస్తూనే.. అనవసర నిర్వహణ వ్యయాలను తగ్గించుకునే దిశగా సంఖ్యను మాత్రం కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా నాలుగింటికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా వాటన్నింటినీ హోల్డింగ్ కంపెనీల్లోకి చేర్చడం, విలీనం చేయడం లేదా ప్రైవేటీకరించడం జరుగుతుంది’ అని ఆమె వివరించారు. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా 2020–21లో రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యాన్ని సాధించేందుకూ ఇది తోడ్పడనుంది. చిన్న సంస్థలకు ఊరట.. కరోనా వైరస్‌పరమైన పరిణామాలతో వ్యాపారాలు దెబ్బతిని, రుణాలు కట్టలేకపోయిన చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊరట దక్కనుంది. దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి సంబంధించి కనీస బాకీల పరిమాణాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రత్యేకంగా దివాలా పరిష్కార మార్గదర్శకాలను కూడా దివాలా కోడ్‌లోని (ఐబీసీ) సెక్షన్ 240ఎ కింద త్వరలో నోటిఫై చేయనున్నట్లు వివరించారు. ఇక, మహమ్మారి వ్యాప్తి పరిస్థితులను బట్టి కొత్త దివాలా పిటిషన్ల దాఖలును ఏడాది పాటు నిలిపివేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనాపరమైన రుణాల ఎగవేతలను దివాలా కోడ్‌లో (ఐబీసీ) డిఫాల్ట్ పరిధి నుంచి తప్పిస్తూ తగు సవరణలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, కంపెనీల చట్టం ప్రకారం సాంకేతికంగాను, ప్రక్రియపరంగాను తప్పనిసరైన నిబంధనల పాటింపు విషయంలో స్వల్ప ఉల్లంఘనలను క్రిమినల్ చర్యల పరిధి నుంచి తప్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసు కుంది. కార్పొరేట్ సామాజిక కార్యకలాపాల (సీఎస్ఆర్) వివరాల వెల్లడి లోపాలు, బోర్డు నివేదికల్లో లోటుపాట్లు, ఏజీఎంల నిర్వహణలో జాప్యం వంటి స్వల్ప ఉల్లంఘనలను డిక్రిమినలైజ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాల్లో నేరుగా లిస్టింగ్.. లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు తమ షేర్లను నేరుగా నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్ చేసుకునేందుకు అనుమతించనున్నట్లు చెప్పారు. దేశీ కంపెనీలకు ఇది భారీ ముందడుగని ఆర్థిక మంత్రి అన్నారు. -
జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను అధీనంలోకి తీసుకున్న ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం సమకూర్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో మొత్తం కార్యకలాపాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని బ్యాంకులు ఎంతో ఆశతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ బిడ్డింగ్ ప్రక్రియ సఫలం కాకపోతే ప్లాన్ బి (ఐబీసీ వెలుపల పరిష్కారం) దిశగా పనిచేయనున్నట్టు పేర్కొన్నాయి. ఐబీసీ కింద అయితే పరిష్కారానికి ఎన్సీఎల్టీ ఆమోదం అవసరం. పైగా ఈ ప్రక్రియ మార్కెట్ స్పందనపై ఆధారపడి, సమయం తీసుకుంటుంది. జెట్‌కు ఉన్న విమానాలు, ఇతర ఆస్తులను విక్రయించడమే ప్లాన్ బిగా పేర్కొన్నాయి. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ జెట్ ఎయిర్వేస్లో వాటాల పట్ల ఆసక్తి ప్రదర్శించినట్టు సమాచారం. అయితే, బిడ్డర్ల సమాచారం మే 10న అధికారికంగా తెలియనుంది. జెట్ ఆగిపోవడం ఓ స్కామ్: ఆనంద్‌శర్మ జెట్‌ఎయిర్‌వేస్ కూలిపోవడం ఓ స్కామ్‌గా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇది చోటు చేసుకోవడంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇదో పెద్ద స్కామ్‌గా నాకు అనిపిస్తోంది. ఎన్నికల సమయంలో దీన్ని అమలు చేశారు. దీంతో ఎవరూ ప్రశ్నించరు’’ అని శర్మ అన్నారు. ఎయిర్‌లైన్స్‌కు కావాల్సిన అత్యవసర నిధులను అందించేందుకు రుణదాతల కమిటీ తిరస్కరించడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు: ఏఐ ఉద్యోగులు ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రైవేటు రంగంలోని జెట్ ఎయిర్వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడిన ఘటనలు ఇందుకు ఉదాహరణలుగా పేర్కొంది. ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తన ప్రణాళికలపై తక్షణమే పునరాలోచన చేయాలని ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏసీఈయూ) సీనియర్ అధికారి పేర్కొన్నారు. జెట్‌ఎయిర్‌వేస్ 20,000 మంది ఉద్యోగులకు మద్దతుగా మాట్లాడుతూ... ప్రభుత్వ విధానాలు విమానయాన పరిశ్రమలో సంక్షోభానికి, ఉద్యోగాల నష్టానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటిపై పునఃపరిశీలన అవసరమని సూచించారు. ‘‘మొదట కింగ్‌ఫిషర్, ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ప్రైవేటీకరణ కార్యక్రమం వల్ల అర్థం చేసుకోవాల్సినది ఏమంటే... జాతీయీకరణను తొలగించడం ఒక్కటే లాభాలు, సామర్థ్యాన్ని తెచ్చిపెట్టలేవు’’అని ఆ అధికారి పేర్కొన్నారు. -
లాంకో ఇన్ఫ్రా ట్రేడింగ్ నిలిపివేత : ధర ఎంత?
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయి, మూసివేత బాటపట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు చెందిన మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ల్యాంకో ఇన్ఫ్రాకు మరోభారీ షాక్ తగిలింది. త్వరలోనే కంపెనీ మూత పడనున్న నేపథ్యంలో స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ గురువారం లాంకో ఇన్ఫ్రాటెక్ ఈక్విటీ షేర్లలో ట్రేడింగ్ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 14,2018 నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. లిక్విడేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో భవిష్యత్‌లో మార్కెట్ సమస్యలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్టుతెలిపింది. దీంతో లాంకో షేరు 4శాతం క్షీణించి 48 పైసల వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని నమోదు చేసింది. దివాలా ప్రక్రియ స్మృతి (ఐబీసీ) ప్రకారం ఆర్బీఐ గుర్తించిన 12 కంపెనీల్లో లాంకో కూడా ఒకటి. లాంకోకు భారీగా రుణాలిచ్చిన ప్రధాన బ్యాంకు ఐడీబీఐ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేసింది. ఐబిబిఐ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి మొత్తం రూ.49,959 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని వాదించింది. దీన్ని విచారించిన ఎన్సీఎల్టీ ఇటీవల లిక్విడేషన్‌కు ఆదేశాలిచ్చింది. పలు బ్యాంకులకు కనీసం వడ్డీ కూడా చెల్లించే పరిస్థితిలో ఉన్న ల్యాంకో ఇన్ఫ్రా ఆస్తులన్నిటినీ ఆమ్మి అప్పులు తీర్చే ప్రక్రియకు (లిక్విడేషన్) హైదరాబాద్‌లోని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆగస్టు 27న అనుమతినిచ్చింది. ఈ వ్యవహారానికి పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) ఉన్న సావన్ గొడియావాలాను ల్యాంకో ఇన్ఫ్రా లిక్విడేటర్‌గా నియమించింది -
ఉక్కు రంగానికి దివాలా జోష్
న్యూఢిల్లీ: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ).. భారత ఉక్కు రంగంలో ఏకీకరణను వేగవంతం చేస్తోందని ఎర్నస్ట్ అండ్ యంగ్(ఈవై) తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా భారత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న విదేశీ కంపెనీలకు మార్గం సుగమం అవుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా మినరల్స్ అండ్ మెటల్స్ ఫోరమ్ సమావేశంలో ఈవై పార్ట్నర్, ఉక్కు రంగానికి చెందిన అంజనీ అగర్వాల్ ఈ నివేదిక వివరాలను వెల్లడించారు. భారత ఉక్కు రంగంపై ఐబీసీ ప్రభావం, సంబంధిత అంశాలపై ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ►దివాలా ప్రక్రియ కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వస్తున్న కేసుల్లో అధిక భాగం ఉక్కు రంగానికి చెందినవే ఉన్నాయి. ► కొత్త దివాలా చట్టం కారణంగా దివాలా ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఉక్కు రంగంలో సమూల మార్పులు రానున్నాయి. ► దివాలా తీసిన కంపెనీల రుణ భార సమస్య ఐబీసీ కారణంగా వేగవంతంగా పరిష్కారమవుతుంది. కొద్దో, గొప్పో ఉన్న రుణం రెన్యువల్ కావడం సులభమవుతుంది. ►దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీలను కొనుగోలు చేయడానికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ కంపెనీలకు మంచి విలువే దక్కనున్నది. ►భారత్‌లో భవిష్యత్ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తుల తయారీకి అనువుగా పలు కంపెనీలు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనికి కావలసిన భారీ పెట్టుబడులను బ్యాంకింగ్ రంగం సమకూర్చగలదు. ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏకీకరణ జోరుగా సాగుతోంది. ఇది భారత్‌పై ఇంకా ప్రభావం చూపలేదు. అయితే ఐబీసీ కారణంగా భారత్‌లో కూడా ఉక్కు రంగంలో ఏకీకరణ మరింత వేగవంతం కానున్నది. ఇప్పటికే టాటా స్టీల్ ఒక కంపెనీని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ మరొక కంపెనీని కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం. ►ఏడాదిలోపు దివాలా ప్రక్రియ కిందకు మరిన్ని కంపెనీలు రానున్నాయి. ► పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడే కంపెనీల కారణంగా బలమైన లోహ పరిశ్రమ భారత్‌లో నెలకొంటుంది. ► ఈ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న కంపెనీలు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. మరో వైపు ఇతర రంగాల్లోని కంపెనీలు కొత్తగా ఈ రంగంలోకి వస్తుండటంతో ఈ రంగం విస్తృతి మరింతగా పెరగనున్నది. ►దేశంలో గవర్నెన్స్ ప్రమాణాలు ముఖ్యంగా లోహ, ఉక్కు రంగాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి. ► ఉక్కు రంగానికి సంబంధించి భారత్‌లో అపార అవకాశాలు ఉండటంతో దీర్ఘకాలంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు వెనకాడ్డం లేదు. ► మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో ఏడాదికి 30 కోట్ల టన్నుల ఉక్కు వినియోగించాలన్న లక్ష్యం సాకారం కానున్నది. -
ఫోరెన్సిక్ ఆడిట్‌కు గిరాకీ!!
న్యూఢిల్లీ: ఆడిట్ సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు ఏజెన్సీలకు ఫోరెన్సిక్ ఆడిట్ రూపంలో ఇప్పుడు భారీ అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం ఇటీవలే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్‌లో (ఐబీసీ) చేసిన సవరణలు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచాయి. ఈ చట్టం కింద కంపెనీలు తమ ఖాతాల్లోని మొండి బకాయిలను (ఎన్పీఏలు) పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ అంచనా ప్రకారం ఐబీసీ చట్టం కింద ఫోరెన్సిక్ ఆడిట్ వ్యాపారం గత మూడు నెలల్లోనే రెట్టింపయింది. ఇదింకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో భాగంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన, భారీగా బకాయిలున్న కంపెనీల ప్రమోటర్ల వ్యవహారాల పరిశీలన, ఆస్తుల సోదాలు, వాటికి రుణాలు అందజేసిన సంస్థల వివరాల ధ్రువీకరణ, నగదు ప్రవాహాలను శాస్త్రీయంగా పరిశీలించడం జరుగుతుంది. దివాలా కేసులకు సంబంధించి ఇప్పటికే పరిష్కార నిపుణులుగా సేవలందిస్తున్న పెద్ద ఆడిటింగ్ సంస్థలకు ఇప్పుడు ఐబీసీ చట్టం రూపంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రమోటర్ల గురించి ఆరా.. ప్రమోటర్లకు సంబంధించి వ్యక్తిగత వివరాల పరిశీలన, ఇతర వివరాల కోసం ఆరా తీయడం ఐబీసీ చట్టంలో సవరణల తర్వాత పెరిగిపోయింది. ప్రమోటర్లకు సంబంధించిన వ్యక్తులు కంపెనీలను తక్కువ విలువకు సొంతం చేసుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బిడ్డింగ్ వేసే వారు విదేశీ సంస్థలయినా లేదా సంబంధం లేని పరిశ్రమ నుంచి బిడ్డింగ్ వచ్చినా ఈ విధమైన ఆందోళనలు నిజం కావచ్చన్న వాదన ఉంది. ‘‘అధిక శాతం కేసుల్లో బిడ్లర్ల గత చరిత్ర, వారికి ఎవరితో సంబంధాలున్నాయో తనిఖీ చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు’’ అని క్రోల్ సంస్థ దక్షిణాసియా విభాగం హెడ్ రేష్మి ఖురానా తెలిపారు. బిడ్లర్ల నేపథ్యం, వారి ఉద్దేశం, వారికున్న వనరుల మూలాలు, గత చరిత్ర అన్నవి బిడ్డర్ల ఎంపికలో బ్యాంకులు చూసే కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఇలా అయితే కష్టం... కొన్ని భారతీయ కంపెనీలు ఎన్నో సబ్సిడరీలు, అసోసియేట్ కంపెనీల ద్వారా ఒకదానిలో ఒకటి వాటాలతో క్లిష్టమైన నిర్మాణంతో పనిచేస్తున్నాయి. అలాగే, కొన్ని కంపెనీలు సంబంధిత పార్టీలు ఎవరన్నది వెల్లడించడం లేదు. వార్షిక నివేదికల్లో సైతం ఈ వివరాలు ఉండడం లేదు. దీంతో సంబంధిత పార్టీలు ఎవరన్నది గుర్తించడం కష్టం’’ అని ఈవై ఇండియాకు చెందిన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, డిస్ప్యూట్ సర్వీసెస్ పార్ట్నర్ విక్రం బబ్బర్ తెలిపారు. కంపెనీలు, ప్రమోటర్ల నేపథ్యం గురించి తనిఖీలు జరిగిన గత సందర్భాల్లో భారీ మొత్తాల్లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మాయం చేసిన ఘటనలు వెలుగు చూశాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో ఉత్తుత్తి కస్టమర్లు, అమ్మకందారులను సైతం ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘‘బ్యాంకులు, దివాలా పరిష్కార నిపుణులు కంపెనీల లావాదేవీలతో సంబంధం ఉన్న సంస్థల వివరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల ఆస్తుల స్వాధీనం, వాటి మళ్లింపు లేదా తస్కరించేందుకు ఆయా సంస్థలను ఉపయోగించితే తెలుస్తుంది‘‘ అని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ సువీర్ ఖన్నా వివరించారు. -
వ్యక్తిగత దివాలా నిబంధనలపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యక్తిగత దివాలా నిబంధనలను కూడా దశలవారీగా అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇన్సాల్వెన్సీ బోర్డు (ఐబీబీఐ) చైర్పర్సన్ ఎంఎస్ సాహూ వెల్లడించారు. సుమారు ఏడాది క్రితం ప్రవేశపెట్టిన దివాలా చట్టం (ఐబీసీ) కింద ఇప్పటిదాకా 500 కార్పొరేట్ సంస్థలు పరిష్కార మార్గాల అమలుకు సిద్ధమయ్యాయని, దాదాపు 100 కంపెనీలు స్వచ్ఛందంగా దివాలా ప్రక్రియను ప్రారంభించాయని ఆయన వివరించారు. 2018లో వ్యక్తిగత దివాలా నిబంధనావళి అమలు, కార్పొరేట్ దివాలా లావాదేవీ ప్రక్రియను సరళతరం చేయడం మొదలైన వాటికి ఐబీబీఐ ప్రాధాన్యమివ్వనున్నట్లు సాహూ చెప్పారు. తొలి దశలో దివాలా ప్రక్రియ పరిధిలోని కార్పొరేట్లకు హామీదారులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి ఇన్సాల్వెన్సీ నిబంధనలను అమల్లోకి తెస్తామని తెలిపారు. ఆ తర్వాత వ్యాపారాలు చేస్తున్న (ప్రొప్రైటర్‌షిప్ లేదా పార్ట్నర్షిప్ సంస్థలు) వ్యక్తులకు కూడా వీటిని విస్తరిస్తామని పేర్కొన్నారు. -
బ్యాంకులకు పెరగనున్న నష్టాలు
ముంబై: దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలకు నిధుల కేటాయింపులు (ప్రొవిజన్లు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2.4 నుంచి రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని రేటింగ్స్ సంస్థ ఇక్రా అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో ప్రొవిజన్లు రూ.2 లక్షల కోట్ల డాలర్లే. కేంద్ర ప్రభుత్వం ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)ని తీసుకురావడం, దీని కింద రూ.1.75 లక్షల కోట్ల మొండి బకాయిల కేసులపై దివాలా చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రొవిజన్లు పెరుగుతాయన్నది ఇక్రా విశ్లేషణ. ఐబీసీకి తాజాగా చేసిన సవరణలతో బ్యాంకులు నిధుల కేటాయింపులను పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో (జూలై–సెప్టెంబర్) రుణాలకు చేసిన కేటాయింపులు రూ.64,500 కోట్లుగా ఉన్నాయి. క్వార్టర్ వారీగా చూసుకుంటే ఇది 40% అధికం. వార్షిక ప్రాతిపదికన 30 శాతం ఎక్కువ. ఐబీసీ కింద మొత్తం రూ.3 లక్షల కోట్ల ఎన్పీఏల కేసులు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం మీద క్రెడిట్ ప్రొవిజన్స్ రూ.2.6 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు’’ అని ఇక్రా గ్రూప్ హెడ్ కార్తీక్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఐబీసీకి ఇటీవల చేసిన సవరణలతో నష్టాలు పెరుగుతాయ ని, అధిక ప్రొవిజన్లకు అవకాశాలున్నాయని చెప్పారు. -
మొండిబకాయిలపై ‘దివాలా’ కొరడా
♦ రెండో లిస్టులో 26 సంస్థలు ♦ బ్యాంకులకు ఆర్బీఐ లేఖ ♦ జాబితాలో వీడియోకాన్,జేపీ అసోసియేట్స్ మొదలైనవి ♦ ఎన్పీఏలపై పరిష్కారానికి ♦ డిసెంబర్ 13 దాకా గడువు ♦ లేదంటే దివాలా చట్టం కింద చర్యలు ముంబై: భారీగా మొండి బాకీలు పేరుకుపోయిన సంస్థలకు సంబంధించి ఆర్బీఐ బ్యాంకులకు పంపిన రెండో విడత లిస్టులో 26 సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. నిర్దిష్ట పథకాల ద్వారా ఈ సంస్థల నుంచి బకాయిలు రాబట్టేందుకు డిసెంబర్ 13 దాకా రిజర్వ్ బ్యాంక్ గడువు విధించింది. ఆలోగా పరిష్కారం కాకపోతే.. డిసెంబర్ 31లోగా ఆయా సంస్థలపై దివాలా చట్టం కింద (ఐబీసీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను బ్యాంకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. బ్యాంకులకు రాసిన లేఖలో ఆర్బీఐ ఈ అంశాలు పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు రూ. లక్ష కోట్లు పైగా బాకీపడిన 26 కంపెనీల్లో భారీ స్థాయి కోవకి చెందినవాటిల్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్, జేపీ అసోసియేట్స్ (జేఏఎల్) ఉన్నాయి. తమ రుణ చెల్లింపు ప్రణాళికను రుణదాతల ఫోరం జూన్ 22న ఆమోదించిన నేపథ్యంలో తాజా జాబితాపై తాము స్పందించేందుకేమీ లేదని జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్ పేర్కొన్నారు. ఆర్బీఐ లేఖలో పేర్కొన్నట్లుగా వస్తున్న వివరాలు వాస్తవమే అయిన పక్షంలో విషయం దివాలా చట్టం ప్రయోగించే దాకా వెళ్లకుండానే పరిష్కారాన్ని కనుగొనేలా ఇటు రుణదాతలకు, అటు రుణాలు తీసుకున్న సంస్థలను ప్రోత్సహించవచ్చని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. రెండో విడత లిస్టులో 40 దాకా సంస్థలు ఉన్నాయని, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 కంపెనీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబాకీలపై దృష్టి సారించిన ఆర్బీఐ.. టాప్ 500 భారీ ఖాతాల సమస్య పరిష్కారానికి 6 నెలల్లోగా తగు ప్రణాళిక రూపొందించాలంటూ బ్యాంకులను ఆదేశించింది. ఒకవేళ పరిష్కారం లభించకపోతే దివాలా చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీని ఆశ్రయించవచ్చని సూచించింది. విద్యుదుత్పత్తి సంస్థలు .. టెల్కోలు.. ఆర్బీఐ మలివిడత లిస్టులో ప్రధానంగా విద్యుత్, టెలికం, ఉక్కు, ఇన్ఫ్రా సంస్థలు ఉన్నట్లు సమాచారం. లిస్టులోని సంస్థలు జూన్ 30 నాటికి చెల్లించాల్సిన బాకీల్లో సుమారు అరవై శాతం భాగాన్ని బ్యాంకులు నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించాయి. ఈ కోవకి చెందినవాటినే జాబితాలో పొందుపర్చడం జరిగింది. జూన్ ఆఖరు నాటికి బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తుల పరిమాణం 24% ఎగిసి రూ.7.79 లక్షల కోట్లకు చేరింది. వీటికి సంబంధించి తొలివిడతలో భారీగా బాకీపడిన 12 ఖాతాలను ఆర్బీఐ గుర్తించి.. తక్షణ చర్యలు చేపట్టాలని బ్యాంకులను ఆదేశించింది. -
బ్యాంకుల నెత్తిన మరో పిడుగు
♦ భారీ ఎన్పీఏలకు 50 శాతం కేటాయింపులు ♦ నష్టాలుగా భావించి పక్కన పెట్టాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ♦ పరిష్కారం రాకపోతే 100% కేటాయించాల్సిందే ♦ దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కోట్ల భారం ముంబై: ఆర్బీఐ బ్యాంకులకు షాకిచ్చింది. దివాలా చర్యలు చేపట్టనున్న భారీ రుణ ఎగవేతల కేసు(ఎన్పీఏలు)ల్లో 50 శాతం మేర నష్టాలుగా భావించి వాటికి నిధుల కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని బ్యాంకుల చీఫ్‌లను శుక్రవారం రాత్రి ఆదేశించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్బీఐ గోప్యంగా జారీ చేసిన ఈ ఆదేశాల గురించి బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల రూపేణా బ్యాంకులు తమ ఆదాయాల్లోంచి రూ.50,000 కోట్లను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద 12 భారీ రుణ ఎగవేత కేసులపై చర్యలు చేపట్టాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఇన్సాల్వెన్సీ చర్యలు చేపట్టబోయే కేసులకు సంబంధించిన రుణాల్లో 50 శాతాన్ని నష్టాలుగా ప్రకటించి నిధులు కేటాయింపులు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ తాజాగా కోరడం గమనార్హం. అంతేకాదు, అంతిమంగా రుణదాతలు, రుణగ్రహీతలు ఓ పరిష్కారానికి రాలేకపోతే... ఆస్తుల లిక్విడేషన్‌కు ఎన్సీఎల్టీ ఆదేశిస్తే బ్యాంకులు ఆయా కేసుల్లో 100 శాతం కేటాయింపులు చేయాల్సిందేనని వాణిజ్య బ్యాంకుల సీఈవోలకు పంపిన లేఖలో ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే, ఈ కేటాయింపులకు మూడు త్రైమాసికాలు సమయం (2018 మార్చి వరకు) ఇవ్వడం కొంచెం ఊరటగా ఓ బ్యాంకర్ పేర్కొన్నారు. నిజానికి ఈ ఆదేశాలు బ్యాంకులు ఊహించనివే. ఐబీసీ కింద చర్యలు చేపట్టే చాలా కేసుల్లో నిర్ణీత సమయంలోగా పరిష్కారం లభించకపోవచ్చని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో పరిష్కారం కాకపోతే నూరు శాతం కేటాయింపులు చేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో... వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ రెట్టింపు స్థాయిలో నిధుల కేటాయింపులు చేయాల్సి ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కేటాయింపులు ఏ మేరకు...? ఆర్బీఐ ఇన్సాల్వెన్సీ చర్యలకు ఆదేశించిన కేసుల్లో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు), ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ.10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కోట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్న విషయం తెలిసిందే. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాంకుల మొత్తం మొండి బాకాయిల్లో ఇవి 25 శాతం. ప్రస్తుతం ఈ ఎన్పీఏ ఖాతాలకు కేటాయింపులు 30–40 శాతం స్థాయిలో ఉన్నట్టు బ్యాంకర్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరం(2017–18) చివరికి మరో రూ.30,000–50,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముందుకు వెళ్లే ఇతర కేసులకూ కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఓ బ్యాంకర్ తెలిపారు. ఆర్బీఐ తాజా ఆదేశాల నేపథ్యంలో బ్యాంకులు మొండి బకాయిల కేసులను ఎస్సీఎల్టీకి నివేదించే విషయంలో చాలా జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంటుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇందుకు అధిక కేటాయింపులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2017 మార్చి నాటికి లిస్టెడ్ వాణిజ్య బ్యాంకులు ఎన్పీఏల కోసం చేసిన కేటాయింపులు రూ.1.95 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల అవినీతిపై సీవీసీ దర్యాప్తు న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) ఇక నుంచి దర్యాప్తు చేపడుతుంది. ఈ మేరకు తమకు అనుమతులు లభించినట్టు సీవీసీ కమిషనర్ టీఎం భాసిన్ మీడియాకు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం – 1988 కింద ప్రైవేటు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, ఇతర అధికారులు సైతం ప్రజా సేవకుల కిందకే వస్తారంటూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పు ఇవ్వడంతో తాజా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేటు బ్యాంకైనా ప్రజలకు సంబంధించిన విధుల్లోనే ఉన్నారని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల (ప్రభుత్వ రంగ బ్యాంకులు) ఉద్యోగుల అవినీతి కేసులను విచారించే అధికారం సీవీసీకి ఉంది. ఇకపై ప్రైవేటు రంగ బ్యాంకులు, వాటి యాజమాన్యాలపై వచ్చే అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు చేయనున్నట్టు భాసిన్ తెలిపారు. ఈ మేరకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగాలు నిబంధనల్లో మార్పులు చేసినట్టు చెప్పారు. ఎన్పీఏల కోసం 25శాతం అదనపు కేటాయింపులు: క్రిసిల్ ముంబై: ఎన్పీఏల పరిష్కారానికి ఆర్బీఐ కఠిన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది. ఎన్పీఏ కేసుల్లో బ్యాంకులు 60 శాతం వరకు హేర్‌కట్ (రుణంలో నిర్ణీత మేర నష్టం)ను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. టాప్ 50 ఎన్పీఏ కేసుల్లో 60 శాతం హేర్‌కట్ అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు అదనంగా 25 శాతం కేటాయింపులు చేయాల్సి ఉంటుందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. భారీ హేర్‌కట్ నేపథ్యంలో ఎన్పీఏలకు కేటా యింపులకు గాను బ్యాంకులకు ఆరు నుంచి ఎనిమిది క్వార్టర్ల సమయం ఇస్తే వాటికి ఉపశమనంగా ఉంటుందని సీతారామన్ అన్నారు. -
‘డర్టీ డజన్’పై నేటి నుంచి బ్యాంకర్ల సమావేశాలు
ముంబై: భారీగా రుణాలు ఎగవేసిన 12 సంస్థలపై చర్యల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలన్న ప్రణాళికను ఖరారు చేసేందుకు బ్యాంకర్లు సోమవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ సంస్థలపై ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ గతవారం ఆదేశించడంతో, వెంటనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు సహా తీసుకోవాల్సిన చర్యల్ని బ్యాంకర్లు ఖరారు చేయనున్నారు. వీటిలో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు) కేసులపై బ్యాంకులు చర్చించనున్నట్టు ఓ బ్యాంకర్ వెల్లడించారు. వీటిపై ఈ నెలాఖరులోపు ఎన్సీఎల్టీని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. ఇన్సాల్వెన్సీ నిపుణులను నియమిస్తామని, పరిష్కార ప్రణాళికను రూపొందించి వారు బ్యాంకులకు సమర్పిస్తారని పేర్కొన్నారు. భారీ రుణ ఎగవేతల కేసులు కావడం, ఒకటికి మించిన బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉండటంతో న్యాయ పోరాటం విషయంలో ఉమ్మడి అభిప్రాయం మేరకు వ్యవహరించడంపై చర్చించనున్నారు. ఆర్బీఐ తొలి జాబితాలోని మిగిలిన సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ. 10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కో ట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాం కుల మొత్తం మొండి బకాయిల్లో ఇవి 25 శాతం. -
ఇప్పట్లో మరో జాబితా లేదు: ఆర్బీఐ
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తాల్లో రుణాలను ఎగ్గొట్టిన 12 సంస్థలపై ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ, ఇప్పట్లో మరో జాబితాను విడుదల చేసే ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. ఇతర రుణ ఎగవేత కేసులను ఆరు నెలల కాల వ్యవధిలోపు పరిష్కరించుకోవాలని బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే రెండో జాబితాను వెల్లడించాల్సిన అవసరమేముందన్నారు. ఢిల్లీలో శుక్రవారం అసోచామ్ నిర్వహించిన బ్యాంకర్లు, రుణగ్రహీతల వ్యాపార సదస్సు – 2017కు హాజరైన సందర్భంగా ముంద్రా మాట్లాడారు. జాబితాలోని 12 మంది పేర్ల గురించి అడగ్గా సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. రూ.10,000 కోట్లు చాలవు... ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్బీ)కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల కంటే ఎక్కువే నిధుల అవసరం ఉంటుందని ముంద్రా అన్నారు. మొండి బాకీలకు నిధుల కేటాయింపులు చేయాల్సి రావడం, ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణాలపై హేర్కట్స్ రూపేణా అదనపు నిధులు అవసరమన్నారు. అవసరమైతే అదనపు నిధుల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి సైతం చెబుతున్నారని ముంద్రా గుర్తు చేశారు. విలీనమా, పునరుద్ధరణా, హేర్ కట్ (ఒత్తిడిలో ఉన్న రుణాలపై నిర్ణీత శాతం నష్టపోవడం) లేక నిధుల కేటాయింపు వీటిలో ఏదన్నది ఐబీసీలో భాగంగా అనుసరించే విధానాన్ని బట్టి ఉంటుందన్నారు. డర్టీ డజన్ ఇవే? బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసిన ‘డర్టీ డజన్’ (12 మంది) పేర్లు వెలుగు చూశాయి. వీటిలో ఎస్సాస్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్టు సమాచారం. నిజానికి ఈ సంస్థల పేర్లను ఆర్బీఐ వెల్లడించలేదు. కానీ, వీటిపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు జాబితాను పంపింది. -
ఎన్పీఏలపై త్వరలోనే చర్యలు: జైట్లీ
♦ ఈ దిశగా ఆర్బీఐ చురుగ్గా పనిచేస్తోంది ♦ రుణమాఫీకి కేంద్ర సాయం ఉండదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాల్సిన రుణ ఎగవేతదారుల జాబితాను ఆర్బీఐ రూపొందిస్తోందని, ఇందుకు సంబంధించి త్వరలోనే నిర్ణయాలు వెలువడతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండిబకాయిలు (ఎన్పీఏలు) రూ.6 లక్షల కోట్లను దాటిపోయిన నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునే అధికారాన్ని ఆర్బీఐకి కట్టబెడుతూ కేంద్రం ఇటీవలే బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌తో ఆర్బీఐ మరింత మెరుగైన స్థితిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. జైట్లీ సోమవారం ఢిల్లీలో ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఎన్పీఏలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు, సైబర్ భద్రత సహా పలు అంశాలపై ఈ సందర్భంగా సమీక్ష జరిగింది. అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడారు. ఎన్పీఏల ఆర్డినెన్స్ అమలు విషయంలో మౌలిక సదుపాయాలపై పలువురు బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఐబీసీ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో 81 కేసులు దాఖలయ్యాయని, వీటిలో 18 రుణదాతలు దాఖలు చేసినవిగా జైట్లీ తెలిపారు. ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా కఠినచర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ముంద్రా మాట్లాడుతూ.. ఎన్పీఏలపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రైతు రుణాల మాఫీ భారం రాష్ట్రాలదే రైతుల రుణాల మాఫీ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయదని, ఇందుకు సంబంధించిన వ్యయమంతా ఆయా రాష్ట్రాలే భరించాల్సి ఉంటుందని జైట్లీ స్పష్టం చేశారు. మహారాష్ట్ర సర్కారు రైతు రుణాలను మాఫీ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే డిమాండ్‌తో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జైట్లీతో ఇన్ఫీ సిక్కా భేటీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా సోమవారం ఆర్థిక మంత్రి జైట్లీతో సమావేశమయ్యారు. దేశీ ఐటీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు, కీలకమైన అమెరికా తదితర మార్కెట్లలో వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటం మొదలైన అంశాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ఇన్ఫోసిస్ సీవోవో యూబీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రో కబడ్డీ తరహాలో ప్రో బాక్సింగ్..
హైదరాబాద్: క్రీడాభిమానులచే విశేష ఆదరణ పొందిన ప్రో కబడ్డీ (ప్రొఫెషనల్ కబడ్డీ) పోటీలు నిరాటంకంగా సాగుతున్న తరుణంలోనే ప్రొ బాక్సింగ్ (ప్రొఫెషనల్ బాక్సింగ్) లీగ్స్‌కు తెరతీసే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియన్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్) మాజీ కార్యదర్శి జనరల్ బ్రిగేడియర్ పీకే మురళీధరన్ రాజా బుధవారం హైదరాబాద్‌లో పలువురు బాక్సర్లు, బాక్సింగ్ సమాఖ్యల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గత నెలలో ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) ఏర్పాటుతో ఇన్నాళ్లూ అమెచ్యూర్కే పరిమితమైన బాక్సర్లు ఇకపై కాసులు కురిపించే ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు అడుగులు వేసేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ హైదరాబాద్ క్లబ్ కల్చర్‌తో బాక్సింగ్‌కు మేలు జరుగుతుందన్నారు. అమెచ్యూర్లుగా తమ కెరీర్లకు ముగింపు పలికిన ఆటగాళ్లకు ప్రొ బాక్సింగ్ ఆదాయ మార్గంగా నిలుస్తుందని, తద్వారా క్రీడాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.