‘డర్టీ డజన్’పై నేటి నుంచి బ్యాంకర్ల సమావేశాలు
ముంబై: భారీగా రుణాలు ఎగవేసిన 12 సంస్థలపై చర్యల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలన్న ప్రణాళికను ఖరారు చేసేందుకు బ్యాంకర్లు సోమవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ గతవారం ఆదేశించడంతో, వెంటనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)లో కేసులు దాఖలు సహా తీసుకోవాల్సిన చర్యల్ని బ్యాంకర్లు ఖరారు చేయనున్నారు. వీటిలో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్‌టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు) కేసులపై బ్యాంకులు చర్చించనున్నట్టు ఓ బ్యాంకర్
వెల్లడించారు.
వీటిపై ఈ నెలాఖరులోపు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. ఇన్‌సాల్వెన్సీ నిపుణులను నియమిస్తామని, పరిష్కార ప్రణాళికను రూపొందించి వారు బ్యాంకులకు సమర్పిస్తారని పేర్కొన్నారు. భారీ రుణ ఎగవేతల కేసులు కావడం, ఒకటికి మించిన బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉండటంతో న్యాయ పోరాటం విషయంలో ఉమ్మడి అభిప్రాయం మేరకు వ్యవహరించడంపై చర్చించనున్నారు. ఆర్‌బీఐ తొలి జాబితాలోని మిగిలిన సంస్థల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్‌ఫ్రా (రూ. 10,065 కోట్లు), జైపీ ఇన్‌ఫ్రాటెక్ (రూ.9,635 కో ట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాం కుల మొత్తం మొండి బకాయిల్లో ఇవి 25 శాతం.