bankruptcy code
-
దివాలా చర్యల ప్రక్రియ ఇక మరింత వేగవంతం
న్యూఢిల్లీ: దివాలా పక్రియలో ఆలస్యాన్ని నివారించడం, మెరుగైన విలువను సాధించడం, ఇందుకు సంబంధించి లిక్విడేషన్ పక్రియ క్రమబద్దీకరణ ప్రయత్నాల్లో భాగంగా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) నిబంధనలను సవరించింది. దివాలా పక్రియలో భాగస్వాములు చురుగ్గా పాల్గొనడానికి కూడా తాజా నిబంధనల సవరణ దోహదపడుతుందని ఒక అధికారికలో ఐబీసీ (ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్– అమలు సంస్థ ఐబీబీఐ పేర్కొంది. సవరణలలో భాగంగా కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్‌పీ) సమయంలో ఏర్పడిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (సీఓసీ), మొదటి 60 రోజులలో వాటాదారుల సంప్రదింపుల కమిటీ (ఎస్సీసీ)గా పని చేస్తుంది. క్లెయిమ్‌ల తుది నిర్ణయం (తీర్పు) తర్వాత (ప్రక్రియ ప్రారంభించిన 60 రోజులలోపు) అంగీకరించిన క్లెయిమ్‌ల ఆధారంగా ఎస్సీసీ పున ర్నిర్మితమవుతుంది. వాటాదారుల మెరుగైన భాగస్వామ్యంతో నిర్మాణాత్మకంగా, సమయానుగుణంగా ఎస్సీసీ సమావేశాలను నిర్వహించే బాధ్యతలు లిక్విడేటర్పై ఉంటాయి. అలాగే, ఎస్సీసీతో లిక్విడేటర్ తప్పనిసరి సంప్రదింపుల పరిధి పెరుగుతుంది. -
వ్యక్తిగత హామీదార్లూ బాధ్యులే..!
న్యూఢిల్లీ: కంపెనీలకు రుణాల విషయంలో ఆయా సంస్థలతో పాటు వ్యక్తిగత గ్యారంటార్ల (హామీగా ఉన్నవారు)పైనా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ (ఐబీసీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ ప్రణాళికలకు ఆమోదముద్ర పడినప్పటికీ, ఐబీసీ నిబంధనావళి కింద చర్యల నుంచి హామీదారులు తప్పించుకోలేరని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఆర్. రవీంద్రలతో కూడిన ధర్మాసనం తన 82 పేజీల ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బడాపారిశ్రామికవేత్తలపై పిడుగు.. తాజా ఉత్తర్వులతో ఇందుకు సంబంధించి కేంద్రం 2019 నవంబర్ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీం తీర్పు సమర్థించినట్లయ్యింది. అలాగే బడా కార్పొరేట్ల రుణాల విషయంలో ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు దివాలా చర్యలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రిలయన్స్ గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీ, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్‌కు కార్పొరేషన్ అధిపతి కపిల్ వాధ్వాన్, భూషన్ పవర్ అండ్ స్టీల్ హెడ్ సంజయ్ సింఘాల్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఆయా పారిశ్రామికవేత్తలపై రుణ గ్రహీతలు దాఖలు చేసిన కేసులు, అప్పిలేట్ స్థాయిలో ఆయా ఉన్నత స్థాయి కోర్టుల్లో ‘స్టే’లో ఉన్నాయి. కంపెనీలతో పాటు గ్యారంటార్లమీదా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్సీఎల్టీ)ల్లో ఒకేసారి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 75 రిట్ పిటిషన్లు, ట్రాన్ఫర్డ్ కేసులు, ట్రాన్స్ఫర్ పిటిషన్లు అన్నింటినీ తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం 2019 నవంబర్ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ, పారిశ్రామికవేత్త లలిత్ కుమార్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధానంగా తీసుకుని సుప్రీం కోర్టు తాజా రూలింగ్ ఇచ్చింది. -
హామీదారు ఆస్తులపై చర్యలేమిటి?
న్యూఢిల్లీ: కంపెనీ తీసుకున్న రుణాలు తీర్చలేని సందర్భాల్లో, ఆ రుణాలకు హామీగా ఉన్న వ్యక్తుల వ్యక్తిగత ఆస్తులను దివాలా చర్యల కిందకు తీసుకురావడం సమంజసం కాదంటూ భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్ఎల్) మాజీ చైర్మన్ సంజయ్ సింఘాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు వీలు కల్పిస్తున్న ఇన్సాలెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ (ఐబీసీ) నిబంధనల రాజ్యాంగ బద్ధతను, ఈ విషయంలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జారీ చేసిన నోటీసును సవాలుచేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖతోపాటు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్ట్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ), ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే సంజయ్ సింఘాల్ వ్యక్తిగత ఆస్తులను దివాలా చట్రంలోకి తీసుకురావడానికి సంబంధించి ఎస్బీఐ ఇచ్చిన నోటీసు అమలు విషయంలో మాత్రం ప్రస్తుత దశలో ‘స్టే’ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు సంబంధించి ఒకపక్క కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ పెండింగులో ఉండగానే మరోవైపు సింఘాల్ వ్యక్తిగత ఆస్తులపై డెట్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఎస్బీఐ ఆశ్రయించడం తగదని హైకోర్టులో దాఖలైన సింఘాల్ పిటిషన్ పేర్కొంది. అక్టోబర్ 6నే అనిల్ కేసులో తీర్పు! అక్టోబర్ 6వ తేదీనే అనిల్ అంబానీకి సంబంధించి ఇదే తరహా దివాలా అంశంపై ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉండడం గమనార్హం. సంబంధిత వ్యాజ్యంలో రానున్న తీర్పు– భూషన్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ మాజీ చైర్మన్ సంజయ్ సింఘాల్ దాఖలు చేసిన ప్రస్తుత పిటిషన్‌కు కూడా వర్తించే అవకాశం ఉంది. అనిల్ కేసు వివరాల్లోకి వెళ్తే... అడాగ్ గ్రూప్‌లోని ఆర్‌కామ్ (రూ.565 కోట్లు), రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రూ.635 కోట్లు)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. దివాలా ప్రక్రియకు సమాంతరంగా గ్యారెంటర్‌పై కూడా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమిస్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27వ తేదీన స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. కేసులో స్పందనకు కేంద్రం, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నెల 17వ తేదీన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. -
రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలి
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ‘ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్(రెండో సవరణ)బిల్లు–2020’కు రాజ్యసభ స్వల్ప చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్ నేపథ్యంలో వాణిజ్య సంస్థల దివాళా ప్రక్రియను మార్చి 25వ తేదీ మొదలుకొని ఆరు నెలలపాటు నిలుపుదల చేసేందుకు వీలు కల్పిస్తూ ఇందులో సవరణలు చేశారు. ఇందుకు సంబంధించి జూన్‌లో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇది అమల్లోకి రానుంది. బిల్లుపై చర్చ సందర్భంగా జరిగిన చర్చలో పలువురు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ మాట్లాడుతూ..‘కోవిడ్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారంగాన్ని, కార్పొరేట్లను గట్టెక్కించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదే విషయాన్ని రైతులకు ఎందుకు వర్తింపజేయరు? రైతులూ దివాలా తీశారు. వారిని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? వారి రుణాలపై వడ్డీని ఎందుకు మాఫీ చేయదు?’ అని నిలదీశారు. పీఎం కేర్స్‌లో పారదర్శకత లేదు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును లోక్‌సభలో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని ఆరోపించాయి. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీకి చెందిన నేతలు పీఎం కేర్స్ ఏర్పాటుపై మండిపడ్డారు. ఈ నిధిని కాగ్ సమీక్ష పరిధికి వెలుపల ఉంచడమేంటని ప్రశ్నించారు. -
మీనా జ్యుయలర్స్‌పై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్‌కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్‌క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్బీఐ పిటిషన్‌ను స్వీకరించిన ఎన్సీఎల్టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్బీఐ తెలిపింది. -
దివాలా కోడ్‌కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్‌ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్‌లో కేంద్రం భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
డీహెచ్ఎఫ్ఎల్ దివాలా దరఖాస్తుకు ఎన్సీఎల్టీ ఓకే
ముంబై: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై (డీహెచ్ఎఫ్ఎల్) దివాలా పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్బీఐ దాఖలు చేసిన దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సోమవారం అనుమతించింది. ఈ పిటిషన్ ప్రవేశానికి అర్హమైనదని ఎన్సీఎల్టీ బెంచ్ స్పష్టం చేసింది. గృహ, ప్రాపర్టీ తనఖా రుణాల్లో డీహెచ్ఎఫ్ఎల్ దేశంలోనే మూడో అతిపెద్ద సంస్థ కావడం గమనార్హం. ఈ సంస్థ రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద ఆర్బీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు ధర బీఎస్ఈలో 5 శాతం క్షీణించింది. రూ.19.70 వద్ద లోయర్ సర్క్యూట్ (ఒక రోజులో స్టాక్ ధర క్షీణించేందుకు గరిష్టంగా అనుమతించిన మేర) వద్దే క్లోజయింది. అటు ఎన్ఎస్ఈలోనూ ఇంతే మొత్తం క్షీణించి రూ.19.75 వద్ద ముగిసింది. -
దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: డిఫాల్టయిన సంస్థల ఆస్తుల వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై మరింత స్పష్టతనిచ్చేలా దివాలా స్మృతి సవరణల బిల్లు (2019)కి పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే దీనికి రాజ్యసభ ఆమోదం తెలపగా.. తాజాగా లోక్‌సభలో కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. స్మృతిలోని ఏడు సెక్షన్లలో సవరణలు ప్రతిపాదించారు. వీటి ప్రకారం డిఫాల్టయిన సంస్థ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన నిధులపై రుణదాతల కమిటీకి పూర్తి అధికారాలు లభించనున్నాయి. ఐబీసీ పరిధిలోకి వచ్చిన కేసులను 330 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై ఎన్నాళ్లలోగా నిర్ణయం తీసుకోవాలి, ఆర్థిక రుణదాతలను ఏ వర్గంగా పరిగణించాలి తదితర నిబంధనలపై ఈ సవరణలతో మరింత స్పష్టత వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) ప్రారంభమైన తర్వాత 330 రోజుల్లోగా కేసు పూర్తి కావాల్సి ఉంటుందని ఆమె వివరించారు. అలాగే రుణ పరిష్కార ప్రణాళిక ఒకసారి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ అధికారిక సంస్థలు కూడా దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు తాజా సవరణలతో గృహ కొనుగోలుదారులకు మరిన్ని హక్కులు సంక్రమించగలవని నిర్మలా సీతారామన్ చెప్పారు. బిల్డర్ల ఆగడాలతో సతమతమవుతున్న కొనుగోలుదారులకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వివాదాస్పద జేపీ గ్రూప్ సంస్థల నుంచి గృహాలు కొనుగోలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. మరోవైపు, దివాలా స్మృతి పనితీరు మిశ్రమంగా ఉందని చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. కంపెనీల వేలం..ముఖ్యంగా రియల్టీ వంటి రంగాల సంస్థల విక్రయం వల్ల కష్టార్జితం పెట్టి ఇళ్లు కొనుక్కున్న కొనుగోలుదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. -
సంస్కరణలతో ఆశించిన ఫలితాలు:ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: జీఎస్టీ, నల్లధనంపై చట్టం, దివాలా కోడ్ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని, భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచమంతా ఆర్థికంగా క్షీణత చవిచూస్తేంటే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మరింత మంది ప్రజలు బ్యాంకింగ్ వైపు వస్తే పన్ను రేటు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు నోట్ల రద్దును సమర్థిస్తూ... దీని ఉద్దేశ్యం నెరవేరిందన్నారు. తలగడల కింద, స్నానాల గదుల్లో దాగి ఉన్న నోట్ల కట్టలు బ్యాంకుల్లోకి వచ్చినట్టు చెప్పారు. ‘‘మొత్తం నగదును బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే నోట్ల రద్దు ఉద్దేశ్యం. అది చాలా వరకు నెరవేరింది’’అని వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్‌లిస్టెడ్ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది. -
పవర్ కంపెనీలకు భారీ షాక్
అలహాబాద్ హైకోర్టు పవర్ కంపెనీలకు షాక్ ఇచ్చింది. ఎన్‌పీఐలపై ఆర్బీఐ చర్యలపై మధ్యంతర ఊరటనిచ్చేందుకు సోమవారం నిరాకరించింది. ఈ తీర్పుతో దాదాపు 60కిపైగా దిగ్గజ కంపెనీలను భారీగా ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్క్యులర్‌ను సమర్ధించిన కోర్టు ప్రధానంగా విద్యుత్ సంస్థలకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. ఆర్బీఐ మంజూరు చేసిన 180 గ్రేస్ పీరియడ్(ఆరునెలలు) నేటితో ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారింది. భారీగా రుణ పడిన సంస్థలు చెల్లింపులను ఆలస్యం చేస్తే వెంటనే చర్యల్నిప్రారంభించాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఒకసర్క్యులర్ జారీ చేసింది. రుణాల చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా మొండిపద్దుల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకులను ఆదేశిస్తూ ఈ సర్క్యులర్ జారీ చేసింది. రూ. 2,000 కోట్ల పైబడిన రుణఖాతాల పరిష్కారానికి 180 రోజుల డెడ్‌లైన్ విధించింది. ఈ గడువు దాటితే ఆయా పద్దులపై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించాలని సూచించింది. దీనిపై కొన్ని విద్యుత్ కంపెనీలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన కంపెనీలపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో దివాలా పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు (మంగళవారం) వాదనలు జరగనున్నాయి. కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ డౌల్ చెప్పారు. ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులు ఐబీసీ క్రింద చర్యల్ని ప్రారంభిస్తాయనీ, అలాగే కంపెనీలు స్వతంత్రంగా పై కోర్టుకు అప్పీల్ చేయవచ్చని ఆయన చెప్పారు. నిరర్దక ఆస్తుల వ్యవహారంలో ఆర్బీఐ సర్క్యులర్‌ను అనుసరించాల్సి ఉంటుందని యుకో బ్యాంకు వెల్లడించింది. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 34 విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు భారీ రుణాల భారంతో సతమతమవుతున్నాయి. విద్యుత్ రంగంలో తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న/నిరర్థక ఆస్తులుగా మారిన ప్రాజెక్టులు ఇపుడు దాదాపు 60 పైచిలుకు కంపెనీలు దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు.. విద్యుత్ రంగానికి ఇచ్చిన రుణాలు దాదాపు 1.74 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. -
‘డర్టీ డజన్’పై చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే
♦ రుణ నాణ్యత మెరుగుపడుతుంది... ♦ మూడీస్ విశ్లేషణ న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో రుణ ఎగవేతలకు పాల్పడిన 12 కంపెనీలపై దివాలా కోడ్ కింద చర్యలు చేపట్టడం బ్యాంకింగ్‌కు క్రెడిట్ పాజిటివ్ అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ– మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సోమవారం పేర్కొంది. దీనివల్ల బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుపడుతుందనీ విశ్లేషించింది. మొత్తం బ్యాంకింగ్ మొండిబకాయిల్లో (ఎన్పీఏ) ఈ 12 కంపెనీల వాటా దాదాపు 25 శాతం. ఈ అకౌంట్లకు సంబంధించి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించడానికి ఆర్బీఐ గత వారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఈ కేసుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 డిఫాల్టర్స్ ఎవరనేది అధికారికంగా పేర్లు వెల్లడించనప్పటికీ, వీటిలో ఎస్సాస్ స్టీల్, భూషణ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, జేపీ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, మోనెత్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్టెక్ ఆటో, ఎరా ఇన్ఫ్రా ఉన్నట్టు సమాచారం. 12 డిఫాల్టర్లపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్బీఐ జాబితాను పంపింది. తాజా పరిణామాలు బ్యాంకింగ్ రుణ నాణ్యతకు దారితీయడమే కాకుండా, చిన్న మొండిబకాయిల సమ స్య పరిష్కారానికి కూడా వీలుకల్పిస్తాయని మూడీస్ వివరించారు. లాభదాయకతపై ఎఫెక్ట్... మొండిబకాయిలకు సంబంధించి అధిక నిధులు కేటాయించాల్సి న పరిస్థితి (ప్రొవిజనింగ్స్) ఉత్పన్నమయితే మాత్రం ఇది వచ్చే ఏడాదిలో బ్యాంకుల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ అంచనా వేసింది. అంతేకాకుండా బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మరింత తాజా మూలధనం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.95,000 కోట్ల తాజా మూలధనం అవసరమవుతుందని మూడీస్ అభిప్రాయపడింది. ఈ పరిమాణం ప్రభుత్వం కేటాయించిన రూ.20,000 కోట్ల కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంద్రధనస్సు ప్రణాళిక కింద 2015 నుంచీ నాలుగేళ్లలో బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల రుణ నాణ్యత గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోందని పేర్కొన్న మూడీస్, అయితే ఇటీవల త్రైమాసికాల్లో ఈ క్షీణత స్పీడ్ కొంత తగ్గిందని వివరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘డర్టీ డజన్’ షేర్లు డౌన్ న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ప్రారంభించడానికి ఆర్బీఐ రూపొందించిన జాబితాలో వున్నాయని భావిస్తున్న 12 కంపెనీల్లో కొన్ని షేర్లు సోమవారం 20 శాతం వరకూ క్రాష్ అయ్యాయి. పతనమైన షేర్లలో ఆమ్టెక్ ఆటో, భూషణ్ స్టీల్, ల్యాంకో ఇన్ఫ్రా, మోన్నెట్ ఇస్పాత్, ఆలోక్ ఇండస్ట్రీస్ వున్నాయి. ఆమ్టెక్ ఆటో 19.97 శాతం క్షీణించి రూ. 23.45 వద్ద ముగియగా, ల్యాంకో ఇన్ఫ్రా 20 శాతం పతనమై రూ. 1.90 వద్ద క్లోజయ్యింది. భూషణ్ స్టీల్ 16 శాతం తగ్గుదలతో రూ. 59 వద్ద ముగిసింది. మోన్నెట్ ఇస్పాత్ 12.37 శాతం క్షీణతతో రూ. 30.10 వద్ద, అలోక్ ఇండస్ట్రీస్ 11.61 శాతం తగ్గుదలతో 2.36 వద్ద ముగిసాయి. ఈ జాబితాలో పేరుందని భావిస్తున్న మరో కంపెనీ ఎలక్ట్రోస్టీల్ 4.94 శాతం నష్టపోయింది. ఎన్పీఏల ప్రగతిపై పీఎంఓ సమీక్ష న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్పీఏ)ల సమస్యపై ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. భారీ రుణ ఎగవేతదారులపై ఆర్బీఐ చర్యలకు దిగిన నేపథ్యంలో వీటికి సంబంధించిన ప్రగతిపై తాజా భేటీ జరగడం గమనార్హం. ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమీక్ష నిర్వహించారని.... పెరిగిపోతున్న ఎన్పీఏలకు కళ్లెం వేసేందుకు పలు రకాల చర్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, తదితర వ్యవస్థల సన్నద్ధతపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరగా, అందులో రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవే ఉన్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఎగవేసిన 12 సంస్థలపై ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీ గత వారం బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే. ఐబీబీఐ ముందుకు ఇంకా రాలేదు... ఆర్బీఐ గుర్తించిన 12 కేసులు తమ ముందుకు రావాల్సి ఉందని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ (ఐబీబీఐ) చైర్మన్ ఎంఎస్ సాహూ తెలిపారు. బ్యాంకులు ముందుగా ఎన్సీఎల్టీ వద్ద కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఐబీసీని అమలు చేసే సంస్థే ఐబీబీఐ. ఎన్సీఎల్టీ మరిన్ని కేసులను డీల్ చేసేవిధంగా సామర్థ్యాన్ని పెంచాలని సాహూ అభిప్రాయపడ్డారు. 12 కేసుల్లో విచారణ కౌంటర్ సివిల్ వ్యాజ్యాల కారణంగా ఆలస్యమవుతుందని తాను భావించడం లేదన్నారు. -
‘డర్టీ డజన్’పై నేటి నుంచి బ్యాంకర్ల సమావేశాలు
ముంబై: భారీగా రుణాలు ఎగవేసిన 12 సంస్థలపై చర్యల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలన్న ప్రణాళికను ఖరారు చేసేందుకు బ్యాంకర్లు సోమవారం నుంచి సమావేశం కానున్నారు. ఈ సంస్థలపై ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్బీఐ గతవారం ఆదేశించడంతో, వెంటనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో కేసులు దాఖలు సహా తీసుకోవాల్సిన చర్యల్ని బ్యాంకర్లు ఖరారు చేయనున్నారు. వీటిలో భూషణ్ స్టీల్ (రూ.44,478 కోట్లు), ఎస్సార్ స్టీల్ (రూ.37,284 కోట్లు), భూషణ్ పవర్ అండ్ స్టీల్ (రూ.37,248 కోట్లు), అలోక్ ఇండస్ట్రీస్ (రూ.22,075 కోట్లు), ఆమ్టెక్ ఆటో (రూ.14,074 కోట్లు), మోనెత్ ఇస్పాత్ (రూ.12,115 కోట్లు) కేసులపై బ్యాంకులు చర్చించనున్నట్టు ఓ బ్యాంకర్ వెల్లడించారు. వీటిపై ఈ నెలాఖరులోపు ఎన్సీఎల్టీని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. ఇన్సాల్వెన్సీ నిపుణులను నియమిస్తామని, పరిష్కార ప్రణాళికను రూపొందించి వారు బ్యాంకులకు సమర్పిస్తారని పేర్కొన్నారు. భారీ రుణ ఎగవేతల కేసులు కావడం, ఒకటికి మించిన బ్యాంకులు రుణాలు ఇచ్చి ఉండటంతో న్యాయ పోరాటం విషయంలో ఉమ్మడి అభిప్రాయం మేరకు వ్యవహరించడంపై చర్చించనున్నారు. ఆర్బీఐ తొలి జాబితాలోని మిగిలిన సంస్థల్లో ల్యాంకో ఇన్ఫ్రా (రూ.44,364 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ స్టీల్స్ (రూ.10,273 కోట్లు), ఎరా ఇన్ఫ్రా (రూ. 10,065 కోట్లు), జైపీ ఇన్ఫ్రాటెక్ (రూ.9,635 కో ట్లు), ఏబీజీ షిప్ యార్డ్ (రూ.6,953 కోట్లు), జ్యోతి స్ట్రక్చర్స్ (రూ.5,165 కోట్లు) ఉన్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. కేవలం ఈ 12 సంస్థలు ఎగ్గొట్టిన మొత్తం రుణాలే రూ.2.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. బ్యాం కుల మొత్తం మొండి బకాయిల్లో ఇవి 25 శాతం. -
‘డర్టీ డజన్’పై దివాలా అస్త్రం!
♦ ఆ 12 ఖాతాల సంగతి ముందు చూడండి ♦ వారిపై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోండి ♦ ఎన్పీఏలపై బ్యాంకుల్ని ఆదేశించిన రిజర్వు బ్యాంకు ♦ మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరునెలల్లో ప్రణాళిక ♦ అప్పటికీ పరిష్కారం కాకుంటే వారిపైనా దివాలా కోడ్ ♦ కంపెనీ లా ట్రిబ్యునల్‌లోనూ ఈ కేసులకు ప్రాధాన్యం ♦ ఎట్టకేలకు మొండి బకాయిలపై కార్యాచరణ షురూ! న్యూఢిల్లీ, మొండి బకాయిల పని పట్టడంలో భాగంగా కింగ్‌ఫిషర్ గ్రూపు అధినేత విజయ్ మాల్యాపై ఇప్పటికే బ్యాంకులు చట్టపరమైన చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో... అతనికంటె ఘనులు మరో 12 మందిని రిజర్వు బ్యాంకు గుర్తించింది. వారందరిపై దివాలా కోడ్ ప్రకారం చర్యలు ప్రారంభించాల్సిందిగా బ్యాంకుల్ని ఆదేశించింది. చిత్రమేంటంటే దేశవ్యాప్తంగా మొత్తం బ్యాంకులిచ్చిన బకాయిల్లో దాదాపు రూ.8 లక్షల కోట్లు మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ 8 లక్షల కోట్లలో 25 శాతం... అంటే దాదాపు రూ.2 లక్షల కోట్లను ఎగవేసింది కేవలం 12 మంది!!. ‘‘ఈ 12 ఖాతాలపైనా తక్షణం దివాలా చట్టం కింద (ఐబీసీ) చర్యలు ఆరంభించవచ్చునని గుర్తించాం’’ అని ఆర్బీఐ స్పష్టంచేసింది. అయితే ఈ 12 మంది పేర్లు మాత్రం వెల్లడించలేదు. నిరర్ధక ఆస్తులుగా మారిన రూ.8 లక్షల కోట్లలో 75 శాతం... అంటే రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులిచ్చినవే. దివాలా చట్టం కింద ఎవరెవరిపై చర్యలు చేపట్టవచ్చో సూచించేందుకు రిజర్వు బ్యాంకు ఇటీవలే అంతర్గతంగా ఓ అడ్వైజరీ కమిటీని నియమించింది. దీన్లో అత్యధికులు ఆర్బీఐలోని స్వతంత్ర సభ్యులే. ఈ కమిటీ అన్నిటినీ పరిశీలించిందని, ఎలాంటి వివక్షకూ తావివ్వకుండా, అధ్యయనానంతరం ఈ నిర్ణయానికి వచ్చిందని బ్యాంకు తెలియజేసింది. ‘‘ఈ కమిటీ అన్ని ఖాతాలనూ పరిశీలించింది. 2016 మార్చి 31 నాటికి రూ.5వేల కోట్లు అంతకన్నా ఎక్కువ అప్పులుండి, వాటిలో 60 శాతానికి పైగా అప్పులు ఎన్పీఏలుగా మారిన పక్షంలో... అలాంటి ఖాతాల్ని ఈ దివాలా చట్టం కింద విచారించవచ్చని సూచించింది. కమిటీ సూచన మేరకు... ఆయా ఖాతాలపై దివాలా చట్టం కింద కేసులు పెట్టాల్సిందిగా మేం బ్యాంకులను కోరుతున్నాం’’ అని ఆర్బీఐ వివరించింది. లా ట్రిబ్యునల్‌లో ప్రాధాన్యం ఇలా బ్యాంకులు దివాలా కేసు పెట్టిన ఖాతాలపై విచారణకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ అధిక ప్రాధాన్యమిస్తుందని కూడా ఆర్బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ 12 ఖాతాలూ కాకుండా మిగిలిన ఎన్పీఏలకు సంబంధించి ఆరు నెలల్లోగా బ్యాంకులు పరిష్కార ప్రణాళికను తయారు చేయాల్సిందిగా కూడా రిజర్వు బ్యాంకు అడ్వైజరీ కమిటీ సిఫారసు చేసింది. ‘‘ఒకవేళ ఆయా ఖాతాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరకకపోతే... ఆయా ఖాతాలపై కూడా దివాలా చట్టం కింద చర్యలు చేపడతాం’’ అని ఆర్బీఐ తెలియజేసింది. టాప్–500 ఖాతాల్ని పరిశీలించాకే... భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి, స్ట్రెస్డ్ అసెట్స్ ఖాతాలుగా బ్యాంకులు గుర్తించిన 500 ఖాతాలను అడ్వైజరీ కమిటీకి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఆర్బీఐ తెలిపింది. ‘‘ఆ స్ట్రెస్డ్ రుణాల్లో చాలావాటిని బ్యాంకులు ఇప్పటికే ఎన్పీఏలుగా కూడా ప్రకటించేశాయి. వాటన్నిటినీ చూశాకే అడ్వైజరీ కమిటీ తాజా సిఫారసు చేసింది’’ అని ఆర్బీఐ వివరించింది. నిజానికి ఈ 12 ఖాతాల పేర్లను ఆర్బీఐ గానీ, బ్యాంకులుగానీ వెల్లడించలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా భారీగా రుణాల్లో కూరుకుపోయి, చాలావరకూ రుణాలను ఇప్పటికే ఎగ్గొట్టి స్ట్రెస్డ్ ఖాతాలుగా మారిన టాప్–14 సంస్థల వివరాలు పై బాక్స్‌లో చూడవచ్చు. (విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ గ్రూప్‌పై ఇప్పటికే చర్యలు ఆరంభించిన నేపథ్యంలో దాన్ని ఈ జాబితాలో చేర్చలేదు)