‘డర్టీ డజన్‌’పై చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే | Moody's: India's new bankruptcy code to boost significantly bargaining | Sakshi
Sakshi News home page

‘డర్టీ డజన్‌’పై చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే

Published Tue, Jun 20 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM

‘డర్టీ డజన్‌’పై  చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే

‘డర్టీ డజన్‌’పై చర్యలు... బ్యాంకింగ్‌కు మంచిదే

రుణ నాణ్యత మెరుగుపడుతుంది...
మూడీస్‌ విశ్లేషణ

న్యూఢిల్లీ:  భారీ పరిమాణంలో రుణ ఎగవేతలకు పాల్పడిన 12 కంపెనీలపై దివాలా కోడ్‌ కింద చర్యలు చేపట్టడం బ్యాంకింగ్‌కు క్రెడిట్‌ పాజిటివ్‌ అని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ– మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సోమవారం పేర్కొంది. దీనివల్ల బ్యాంకింగ్‌ రుణ నాణ్యత మెరుగుపడుతుందనీ విశ్లేషించింది. మొత్తం బ్యాంకింగ్‌ మొండిబకాయిల్లో (ఎన్‌పీఏ) ఈ 12 కంపెనీల వాటా దాదాపు 25 శాతం. ఈ అకౌంట్లకు సంబంధించి ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించడానికి ఆర్‌బీఐ గత వారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఈ కేసుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఈ 12 డిఫాల్టర్స్‌ ఎవరనేది అధికారికంగా పేర్లు వెల్లడించనప్పటికీ, వీటిలో  ఎస్సాస్‌ స్టీల్, భూషణ్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్‌ స్టీల్, అలోక్‌ ఇండస్ట్రీస్, జేపీ ఇన్‌ఫ్రా, ల్యాంకో ఇన్‌ఫ్రా, మోనెత్‌ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఆమ్‌టెక్‌ ఆటో, ఎరా ఇన్‌ఫ్రా ఉన్నట్టు సమాచారం. 12 డిఫాల్టర్లపై ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‌ కింద చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్‌బీఐ జాబితాను పంపింది. తాజా పరిణామాలు బ్యాంకింగ్‌ రుణ నాణ్యతకు దారితీయడమే కాకుండా, చిన్న మొండిబకాయిల సమ స్య పరిష్కారానికి కూడా వీలుకల్పిస్తాయని మూడీస్‌ వివరించారు.

లాభదాయకతపై ఎఫెక్ట్‌...
మొండిబకాయిలకు సంబంధించి అధిక నిధులు కేటాయించాల్సి న పరిస్థితి (ప్రొవిజనింగ్స్‌) ఉత్పన్నమయితే మాత్రం ఇది వచ్చే ఏడాదిలో బ్యాంకుల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్‌ అంచనా వేసింది. అంతేకాకుండా బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మరింత తాజా మూలధనం సమకూర్చాల్సి ఉంటుందని పేర్కొంది. 2019 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.95,000 కోట్ల తాజా మూలధనం అవసరమవుతుందని మూడీస్‌ అభిప్రాయపడింది.

ఈ పరిమాణం ప్రభుత్వం కేటాయించిన రూ.20,000 కోట్ల కన్నా  ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంద్రధనస్సు ప్రణాళిక కింద 2015 నుంచీ నాలుగేళ్లలో బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మూలధనం సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల రుణ నాణ్యత గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోందని పేర్కొన్న మూడీస్, అయితే ఇటీవల త్రైమాసికాల్లో ఈ క్షీణత స్పీడ్‌ కొంత తగ్గిందని వివరించింది.  2016–17 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  మొండిబాకీలు రూ. 1 లక్ష కోట్ల పైగా పెరిగి రూ. 6.06 లక్షల కోట్లకు ఎగిశాయి.  
‘డర్టీ డజన్‌’ షేర్లు డౌన్‌
న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియను ప్రారంభించడానికి ఆర్‌బీఐ రూపొందించిన జాబితాలో వున్నాయని భావిస్తున్న 12 కంపెనీల్లో కొన్ని షేర్లు సోమవారం 20 శాతం వరకూ క్రాష్‌ అయ్యాయి. పతనమైన షేర్లలో ఆమ్‌టెక్‌ ఆటో, భూషణ్‌ స్టీల్, ల్యాంకో ఇన్‌ఫ్రా, మోన్నెట్‌ ఇస్పాత్, ఆలోక్‌ ఇండస్ట్రీస్‌ వున్నాయి. ఆమ్‌టెక్‌ ఆటో 19.97 శాతం క్షీణించి రూ. 23.45 వద్ద ముగియగా, ల్యాంకో ఇన్‌ఫ్రా 20 శాతం పతనమై రూ. 1.90 వద్ద క్లోజయ్యింది. భూషణ్‌ స్టీల్‌ 16 శాతం తగ్గుదలతో రూ. 59 వద్ద ముగిసింది. మోన్నెట్‌ ఇస్పాత్‌ 12.37 శాతం క్షీణతతో రూ. 30.10 వద్ద, అలోక్‌ ఇండస్ట్రీస్‌ 11.61 శాతం తగ్గుదలతో 2.36 వద్ద ముగిసాయి. ఈ జాబితాలో పేరుందని భావిస్తున్న మరో కంపెనీ ఎలక్ట్రోస్టీల్‌ 4.94 శాతం నష్టపోయింది.

ఎన్‌పీఏల ప్రగతిపై పీఎంఓ సమీక్ష
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిల (ఎన్‌పీఏ)ల సమస్యపై ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. భారీ రుణ ఎగవేతదారులపై ఆర్‌బీఐ చర్యలకు దిగిన నేపథ్యంలో వీటికి సంబంధించిన ప్రగతిపై తాజా భేటీ జరగడం గమనార్హం. ప్రధాన మంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమీక్ష నిర్వహించారని.... పెరిగిపోతున్న ఎన్‌పీఏలకు కళ్లెం వేసేందుకు పలు రకాల చర్యలపై ఈ సందర్భంగా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, తదితర వ్యవస్థల సన్నద్ధతపైనా చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు రూ.8 లక్షల కోట్లకు చేరగా, అందులో రూ.6 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకులవే ఉన్నాయి. వీటి పరిష్కారంలో భాగంగా సుమారు రూ.2.5 లక్షల కోట్లు ఎగవేసిన 12 సంస్థలపై ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద చర్యలు చేపట్టాలని ఆర్‌బీఐ అంతర్గత సలహా కమిటీ గత వారం బ్యాంకులను కోరిన విషయం తెలిసిందే.

ఐబీబీఐ ముందుకు ఇంకా రాలేదు...
ఆర్‌బీఐ గుర్తించిన 12 కేసులు తమ ముందుకు రావాల్సి ఉందని ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ (ఐబీబీఐ) చైర్మన్‌ ఎంఎస్‌ సాహూ తెలిపారు. బ్యాంకులు ముందుగా ఎన్‌సీఎల్‌టీ వద్ద కేసులు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఐబీసీని అమలు చేసే సంస్థే ఐబీబీఐ. ఎన్‌సీఎల్‌టీ మరిన్ని కేసులను డీల్‌ చేసేవిధంగా సామర్థ్యాన్ని పెంచాలని సాహూ అభిప్రాయపడ్డారు. 12 కేసుల్లో విచారణ కౌంటర్‌ సివిల్‌ వ్యాజ్యాల కారణంగా ఆలస్యమవుతుందని తాను భావించడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement