న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు.
2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్‌ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎన్‌బీఎఫ్‌సీలకు బాసట..
సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్‌ఎఫ్‌సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు.
ఎన్‌హెచ్‌ఏఐ ‘ఇన్‌విట్’...
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్‌విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్‌ఫ్రా అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్‌లో కేంద్రం భారత్‌మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment