![Action to be taken if gold auction norms violated by banks FM Nirmala Sitharaman](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/NIRMALA-SITHARAMAN.jpg.webp?itok=wDnWx2RK)
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అనుసరించాల్సి ఉంటుంది.
ఈ విషయమై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్‌లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్‌లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment