‘బంగారు’ మాటలు.. మోసపు చేష్టలు
(సాక్షిప్రతినిధి, అనంతపురం) తమ ప్రభుత్వం వస్తే రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చారు. లేనిపోని సాకులు చెప్పి రైతన్నను నిలువునా మోసం చేశారు. సంపూర్ణ రుణమాఫీని పక్కనపెట్టి రైతులకు చిల్లర విదిల్చారు. రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని ఆశపడి భంగపడిన అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 142 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డమే ఇందుకు నిదర్శనం.
బంగారు వేలం విషయం మంత్రి గారికి తెలీదట
జిల్లా వ్యాప్తంగా 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817 కోట్ల రుణ బకాయిలున్నాయి. సర్కారు చెప్పినట్లు పంట, బంగారు రుణాలు మాఫీ చేసినా 8.20 లక్షల ఖాతాల్లో రూ.4,994 కోట్లు రద్దవ్వాలి. ఇందులో రూ.1,821 కోట్లు బంగారు రుణాలున్నాయి. అయితే.. ప్రభుత్వం 6.62 లక్షల ఖాతాల్లో రూ.2,234.5 కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందులో మొదటిదశలో రూ.780.16 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. అలాగే రెండు, మూడు దశలు కలిపి మొత్తం రూ.1,055 కోట్లు మాఫీ చేసింది. ఇందులో రూ. 243.56 కోట్ల బంగారు రుణాలు మాఫీ అయ్యాయి. 20 శాతం చొప్పున మాత్రమే మాఫీ కావడం, తక్కిన రుణాలు బకాయి ఉండటంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు పంపుతున్నారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని ప్రకటిస్తున్నారు. 2015 నవంబర్ నుంచి నేటి దాకా రోజూ ఏదో ఒక దినపత్రికలో రైతుల బంగారు వేలం ప్రకటనలు కన్పిస్తున్నాయి.
విధిలేని పరిస్థితుల్లో చాలామంది రైతులు రూ.3-5 వడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు చేసి బంగారు విడిపించుకుంటున్నారు. భార్య మెడలోని బంగారు గొలుసులు తాకట్టుపెట్టి.. వాటిని విడిపించుకోలేక వేలంలో పోవడం చూసి రైతులు తీవ్ర వేదన పడుతున్నారు. ఇదే విషయంపై అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి సమాధానంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ బ్యాంకులు వేలం వేస్తున్నట్లు తమకు తెలీదని చెప్పారు. రోజూ ఏదో ఒక చోట వేలం ప్రకటనలు వస్తున్నా.. ఈ విషయం ప్రభుత్వానికి తెలీదంటే రైతుల సంక్షేమంపై ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
రైతులను అవమానించడమే.. - పెద్దిరెడ్డి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి
బంగారాన్ని బ్యాంకర్లు వేలం వేస్తున్నారనే విషయం తెలీదని వ్యవసాయ శాఖ మంత్రి అనడం రైతులను అవమానించడమే. కరువు రైతుల దుస్థితిని గమనించి బంగారు వేలం ఆపాలని జిల్లా మంత్రులకు, కలెక్టర్కుపలుమార్లు విన్నవించాం. ఇవేవీ మంత్రి దృష్టికి పోలేదంటే ఆయనకు రైతు సంక్షేమం కంటే ఇతరత్రా వాటిపై శ్రద్ధ ఉన్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికైనా బంగారు వేలాలు అపేలా చర్యలు తీసుకోవాలి.
ప్రత్తిపాటి తక్షణమే రాజీనామా చేయాలి: వెంకట చౌదరి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
రుణమాఫీ చేయకుండా టీడీపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. గోల్డ్‌లోన్ కట్టలేక, వేలం నోటీసులు రావడం చూసి రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని మంత్రి ప్రత్తిపాటి అన్నారంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో ఇట్టే తెలుస్తోంది. వెంటనే ఆయన రాజీనామా చేయాలి. ప్రత్తిపాటి వ్యాఖ్యలపై సీఎం స్పందించాలి.